రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ‘పెద్ది’ సినిమాలోని అచ్చియమ్మ పాత్రలో హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన విషయం తెలిసిందే. వెండితెరపై అచ్చియమ్మ పాత్రను చూపించిన తీరుపై అభ్యంతరకరమైన అబీప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘కాఫీ విత్ కరణ్ 9’ టాక్ షో వేదికగా జాన్వీ కపూర్ తాజాగా ఈ అంశంపై స్పందించారు. ‘‘ఆ సినిమా కోసం (పరోక్షంగా ‘పెద్ది’ సినిమాను ప్రస్తావిస్తూ..) నాతో పాటు చాలామంది కష్టపడ్డారు. అందుకే ఈ అంశంపై నేను ఇప్పటివరకు స్పందించకుండా మౌనంగా ఉండిపోయాను.
కానీ ఈ విషయం గురించి నేనేదైనా మాట్లాడాల్సి వస్తే జరిగిన వ్యవహరంలో కొంచెం నా బాధ్యత కూడా ఉంది. ఆ విషయంలో నాకు కలిగిన బాధ, అపరాధ భావన ఎప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటాయి. దక్షిణాది పరిశ్రమలో ముందుగానే పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకునే పద్ధతి చాలా అరుదు. అలాగే ఏ సన్నివేశాన్ని ఏ కెమేరా యాంగిల్‌లో చిత్రీకరించాలనే వివరాలను స్క్రిప్ట్‌లో ముందే రాసి పెట్టడం కూడా అరుదుగా జరుగుతుంది. సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు చెప్పినట్లు చేయాలనే వృత్తిపరమైన ఒత్తిడి నాపై ఉంటుంది. ఒక వ్యక్తిని మరీ అసభ్యంగా, ఇబ్బందికరంగా చూపించారా? కథనం లైంగిక దాడులను సమర్థించేలా లేదా ప్రోత్సహించేలా ఉందా? అని ప్రశ్నించుకుంటే... అలానే ఉందనిపించింది.
ఈ సినిమాలోని కథనం సమాజంపై, ముఖ్యంగా మహిళలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపిస్తుందో అన్న ఆలోచన నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. నేను ఇలా మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే, ఇలా మాట్లాడితే జరిగిన దాని తాలూకు బాధ్యతను తప్పించుకుని, ఇతరుల మీదకు నెట్టేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే నాకు పెద్ద సినీ బ్యాగ్రౌండ్ ఉంది. ఆ పలుకుబడిని ఉపయోగించుకుని కాస్త మార్చడానికి (తన పాత్రని చూపించిన విధానాన్ని ఉద్దేశించి) నేను గట్టిగా ప్రయత్నించి ఉండాల్సింది. ఇక నేను భవిష్యత్‌లో చేయగలిగింది ఒక్కటే. ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా జాగ్రత్తపడటమే’’ అని పేర్కొన్నారు.


