న్యూ రూల్స్‌: ప్రయాణికుడు లేకుండానే చెక్-ఇన్ లగేజీ తనిఖీ! | Thailand Airports: Luggage Check In to be Screened Without Passenger | Sakshi
Sakshi News home page

న్యూ రూల్స్‌: ప్రయాణికుడు లేకుండానే చెక్-ఇన్ లగేజీ తనిఖీ!

Oct 16 2026 8:57 PM | Updated on Oct 16 2026 9:07 PM

Thailand Airports: Luggage Check In to be Screened Without Passenger
  • తాళాలు ఉంటే పగలగొట్టేస్తారు..!
  • థాయ్‌లాండ్‌ విమానాశ్రయాల్లో నూతన నిబంధనలు

బ్యాంకాక్: విమానయాన భద్రతను పటిష్టం చేయడంతో పాటు విమానాల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించేందుకు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయాల్లో ప్రయాణికుల చెక్-ఇన్ లగేజీని, సదరు ప్రయాణికుడు అక్కడికి రాకపోయినా నేరుగా తెరిచి తనిఖీ చేసేందుకు సెక్యూరిటీ సిబ్బందికి అధికారమిస్తూ నూతన మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధనలు అక్టోబర్ 16 నుంచి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు థాయ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ప్లోయ్‌తలే లక్ష్మీ సేంగ్జాన్ వెల్లడించారు.

అనుమానిత వస్తువుల గుర్తింపు కోసమే
సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ థాయ్‌లాండ్ (CAAT) జారీ చేసిన ఈ మార్గదర్శకాలు సాధారణ ప్రయాణికులందరి లగేజీకి వర్తించవని అధికారులు స్పష్టం చేశారు. ఎక్స్-రే స్క్రీనింగ్‌లో లగేజీ బ్యాగులో విమాన భద్రతకు హాని కలిగించే వస్తువులు, పేలుడు పదార్థాలు లేదా నిషేధిత వస్తువులు ఉన్నట్లు బలమైన అనుమానం వచ్చిన సందర్భాల్లో మాత్రమే సిబ్బంది బ్యాగును తెరిచి పరిశీలిస్తారు.

 

పూర్తి వీడియో చిత్రీకరణ – నోటీస్ జారీ
ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం తనిఖీ విధానాన్ని అంతా కఠిన నిబంధనల నడుమ నిర్వహిస్తారు. నిర్దేశిత సెక్యూరిటీ ఏరియాలోనే బ్యాగులను తెరవాల్సి ఉంటుంది. అంతేకాకుండా, బ్యాగును తెరవడం నుంచి ముగించే వరకు ప్రతి అడుగును సీసీటీవీ లేదా వీడియో కెమెరాల్లో నిరంతరం రికార్డు చేస్తారు. ఒకవేళ అనుమానిత బ్యాగును తెరిచి పరిశీలిస్తే, ఆ విషయాన్ని ప్రయాణికుడికి తెలియజేసేందుకు బ్యాగు లోపల ‘నోటీస్ ఆఫ్ బ్యాగేజ్ ఇన్‌స్పెక్షన్’ (Notice of Baggage Inspection) అనే రసీదును ఉంచుతారు. బ్యాగులో ప్రమాదకర వస్తువులు గుర్తిస్తే వాటిని వెంటనే స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు చేపడతారు.

 

 

 

 

ఆలస్యాలకు చెక్ – ప్రయాణికులకు సూచనలు
గతంలో చెక్-ఇన్ లగేజీలో ఏదైనా అనుమానం వస్తే సదరు ప్రయాణికుడిని బోర్డింగ్ గేట్ల వద్ద వెతికి రప్పించేవరకు బ్యాగును తెరిచేవారు కాదు. దీనివల్ల విమానాలు తీవ్రంగా ఆలస్యమయ్యేవి. ఈ విధానం ఇప్పటికే అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో అమల్లో ఉంది. నూతన నిబంధనల నేపథ్యంలో థాయ్‌లాండ్‌ వెళ్లే ప్రయాణికులు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ‘టీఎస్ఏ (TSA) లాక్స్’ ఉన్న బ్యాగులనే వాడాలని ఎయిర్‌పోర్ట్ అధికారులు సూచించారు. సాధారణ తాళాలు వేస్తే సిబ్బంది వాటిని పగలగొట్టి తనిఖీ చేస్తారని, అందుకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించబోమని స్పష్టం చేశారు. అలాగే లిథియం బ్యాటరీలు, పవర్ బ్యాంకులు, విలువైన డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్-ఇన్ లగేజీలో పెట్టవద్దని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement