వానరాల విందు విలాసం! | Lopburi monkey banquet food festival in Thailand | Sakshi
Sakshi News home page

వానరాల విందు విలాసం!

Nov 29 2026 12:16 AM | Updated on Nov 29 2026 12:16 AM

Lopburi monkey banquet food festival in Thailand

కోతులు దగ్గరికి వస్తే మనం భయపడి దూరంగా వెళ్తుంటాం. కానీ ఆ కోతుల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేస్తే? వాటికి రకరకాల పండ్లు, ఆహార పదార్థాలతో భారీ విందు పెడితే? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, థాయ్‌లాండ్‌లో ప్రతి ఏడాది నవంబర్‌ చివరి వారంలో జరిగే ఓ ప్రత్యేక వేడుక ఇది. దీనినే ‘లోప్‌బురి మంకీ బాంక్విట్‌ ఫెస్టివల్‌’గా పిలుస్తారు. వందలాది కోతులకు రుచికరమైన వంటకాలు వడ్డించే ఈ వేడుకను చూసేందుకు వేలాదిమంది పర్యాటకులు తరలివస్తుంటారు. 

థాయ్‌లాండ్‌లోని లోప్‌బురి పట్టణం ఈ వింత పండుగకు వేదిక. రాజధాని బ్యాంకాక్‌కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఈ లోప్‌బురి పట్టణం ఉంది. ఇక్కడ నివసించే కోతులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అవే మకాక్‌ జాతి కోతులు.

పురాతన ఆలయాల్లో, చారిత్రక కట్టడాల పరిసరాల్లో వేలాదిగా జీవిస్తుంటాయి. వాటిని చూసేందుకు పూర్వం పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. దీంతో స్థానిక వ్యాపారాలు, పర్యాటక రంగం చక్కగా అభివృద్ధి చెందాయి. ఆదాయం కూడా పెరిగింది. అలా మకాక్‌ కోతుల కారణంగానే లోప్‌బురి పట్టణానికి గుర్తింపు రావడంతో వాటికి కృతజ్ఞతలు చెప్పాలనే ఆలోచన స్థానికుల్లో కలిగింది. అందుకే 1989లో తొలుత ఈ లోప్‌బురి మంకీ ఫెస్టివల్‌కు శ్రీకారం చుట్టారు. స్థానిక హోటల్‌ యజమాని యోంగ్‌యుత్‌ కిట్‌వట్టనానుసోంట్‌ ఈ వినూత్న వేడుకను ప్రారంభించారు. కాలక్రమేణా ఇది పెద్ద పండుగగా మారి స్థానికులతో పాటు విదేశీ పర్యాటకులనూ ఆకర్షిస్తోంది. 

నవంబర్‌ చివరి ఆదివారం...
ప్రతి ఏడాది నవంబర్‌ చివరి ఆదివారం ఈ పండుగ నిర్వహించడం ఆనవాయితీ. కోతుల కోసం ప్రత్యేకంగా భారీ విందు బల్లలు ఏర్పాటు చేసి... పుచ్చకాయలు, అరటిపండ్లు, పైనాపిల్, ద్రాక్ష, ఇతర పండ్లతో పాటు కూరగాయలు, స్వీట్లు, థాయ్‌ సంప్రదాయ వంటకాలను అందంగా అమర్చుతారు. కొన్ని చోట్ల పండ్లతో ప్రత్యేక ఆకృతులు కూడా తయారు చేస్తారు. సుమారు రెండు టన్నుల ఆహారాన్ని విందు కోసం సిద్ధం చేస్తారు. వేడుక ప్రారంభానికి ముందు సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోతుల వేషధారణలో కళాకారులు చేసే నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ పండుగలో కోతులకే కాకుండా మనుషులకూ విందు ఉంటుంది. 

హనుమంతుడి వారసులుగా...
లోప్‌బురి కోతుల వెనుక ఓ ఆసక్తికరమైన నమ్మకం కూడా ఉంది. ఈ కోతులు హనుమంతుడి వారసులని స్థానికులు భావిస్తారు. థాయ్‌లాండ్‌లో ప్రాచుర్యంలో ఉన్న రామాయణ కథనం ప్రకారం హనుమంతుడి సహాయంతో శ్రీరాముడు లోప్‌బురి పట్టణాన్ని నిర్మించినట్లు చెబుతారు. అందుకే కోతులకు ఇక్కడ ప్రత్యేక గౌరవం ఇస్తారు. వాటికి ఆహారం అందించడాన్ని శుభప్రదంగా భావిస్తారు.

మారిన వేడుక స్వరూపం!
అయితే కరోనా తర్వాత ఈ పట్టణంలో కోతుల సంఖ్య పెరగడంతో సమస్యలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా 2024లో కోతుల దూకుడు, మనుషులపై దాడులు పెరిగిపోయాయి. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. చాలా కోతులకు సంతాన నిరోధక చర్యలు చేపట్టడంతో పాటు కొన్నింటిని బోనుల్లో బంధించారు. దీంతో పండుగ నిర్వహణలోనూ మార్పులు వచ్చాయి. గతంలో ఆలయ ప్రాంగణాల్లో జరిగే విందు ఇప్పుడు ‘మంకీ శాంక్చువరీ’కి మారింది. 
కోతుల కోసం మనుషులు విందు ఏర్పాటు చేసే ఈ వేడుక ప్రపంచంలోనే అరుదైన పండుగల్లో ఒకటిగా నిలుస్తోంది. ఓవైపు స్థానిక సంప్రదాయాన్ని, మరోవైపు పర్యాటక ఆకర్షణను చాటుతోంది. అయితే మనుషులు, జంతువులు కలిసి జీవించాలంటే వాటి పట్ల ప్రేమతో పాటు బాధ్యత కూడా ఉండాలని ఈ పండుగ గుర్తుచేస్తోంది. 
∙రమా జంబుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement