భవిష్యత్తును నిర్ణయించేది మన నిర్ణయాలే! | Professor Tan Eng Chye delivers annual Commencement addresses to graduating | Sakshi
Sakshi News home page

భవిష్యత్తును నిర్ణయించేది మన నిర్ణయాలే!

Nov 15 2026 4:18 AM | Updated on Nov 15 2026 4:18 AM

Professor Tan Eng Chye delivers annual Commencement addresses to graduating

సింగపూర్‌లోని ‘ద నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌’ (ఎన్‌యూఎస్‌)2026 బ్యాచ్‌ పట్టభద్రులను ఉద్దేశించి విశ్వవిద్యాలయ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ టాన్‌ ఎంగ్‌ చ్యే చేసిన స్నాతకోత్సవ ప్రసంగ సంక్షిప్త పాఠం

విశ్వగురు

గ్రాడ్యుయేట్లకు, వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ శుభోదయం! డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థులందరికీ అభినందనలు.  ఒక అధ్యాయం ముగుస్తోంది. మరో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది.  మీరు కొత్త అవకాశాలతో పాటు కొంత అనిశ్చితి ఉన్న ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. ఈసంవత్సరం స్నాతకోత్సవ ప్రసంగాలు ప్రస్తుత ప్రపంచం పట్ల ఉన్న ఆందోళనలు, సందేహాలు, భయాలతో పాటు ఎన్నో ఆశలు, అవకాశాలను కూడా ప్రతిబింబించాయి. జీవితంలోని ఇలాంటి కీలక మార్పుల సమయంలో మనం ఒక్కసారి ఆగి ఆలోచించాలి. ఇప్పటివరకు సంపాదించిన జ్ఞానం నుంచి మనం శక్తినిæ పొందాలి. 

మనిషి చేసే గొప్ప పనులు అవే!
జ్ఞానాన్ని అన్వేషించడం, జ్ఞానాన్ని సంపాదించడం, దాన్ని ఉపయోగించడం అనేవి మానవుడు చేసే అత్యంత గొప్ప పనులు. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ జ్ఞానాన్ని మానవాళి సంక్షేమానికి ఉపయోగించడం మనందరి బాధ్యత. ఇది ఒక్క కృత్రిమ మేధస్సు (ఏఐ)కే కాదు, ప్రతి కొత్త సాంకేతిక పరిజ్ఞానానికీ వర్తిస్తుంది. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు, మార్పులు, వ్యయాలు, అంతరాయాలు తప్పవు. అదే సమయంలో, ఆ కొత్త టెక్నాలజీతో గొప్ప మేలు చేసే అవకాశాలు ఉన్నట్లే, తీవ్ర హాని చేసేందుకు ఆస్కారం ఉంటుంది. మనం మనుషులం. 

జిజ్ఞాసతో, ఆసక్తితో అన్వేషిస్తాం, ఆవిష్కరణలు చేస్తాం. కొత్త సృష్టిని నిర్మిస్తాం. అదే సమయంలో మనం మనుషులం కాబట్టి తప్పులు కూడా చేస్తాం. ప్రతి తరంలోనూ కొన్ని పొరపాట్లు జరుగుతాయి. కానీ మనం జాగ్రత్తగా, నిజాయితీగా వ్యవహరిస్తే... మనం చేసిన తప్పులను తర్వాతి తరం సరిదిద్దగలదు. పర్యావరణ పరిరక్షణ విషయంలో మనం దీనిని చూశాం. ప్రస్తుతం సోషల్‌ మీడియా వినియోగంలో కూడా ఇలాంటి పరిణామాలను చూస్తున్నాం. త్వరలోనే ఏఐ విషయంలోనూ ఇలాంటి అనుభవాలు ఎదురుకావచ్చు. 

మనం సంపాదించే జ్ఞానం అంతా మంచికి ఉపయోగపడాలి, చెడుకు కాదు అనేదే మన ఆశ. ఆ ఆశ మీ మీదే ఉంది. ఈ రోజు పట్టాలు అందు కుంటున్న ప్రతి ఒక్కరిపైనా నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే... రేపటి సమాజానికి నాయకులుగా ఎదగ బోయేది మీరే. ఈ చదువు మీకు విమర్శనాత్మకంగా ఆలోచించే శక్తిని ఇచ్చింది. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో కలిసి పనిచేసే సామర్థ్యాన్ని పెంచింది. అంతేకాకుండా గొప్ప లక్ష్యం కోసం పనిచేయడం నేర్పించింది. అది ఒక బృందం కోసం కావచ్చు, ఒక సమాజం కోసం కావచ్చు లేదా మొత్తం దేశం కోసం కావచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో నేటి ప్రపంచంలో గతంలో కంటే మానవ విలువలు, నైతికత మరింత ఆవశ్యకంగా మారాయి. ఈ విషయాన్ని గుర్తించి, పదేళ్ల క్రితమే వివిధ విద్యా రంగాలను అనుసంధానం చేస్తూ మా విద్యా ప్రణాళికను అభివృద్ధి చేశాం. ఐదు సంవత్సరాల క్రితం, విద్యార్థుల జీవిత అనుభవాలను కూడా మా విద్యా ప్రణాళికలో భాగం చేశాం. తరగతి గదిలో నేర్చుకునే విద్య, తరగతి గది బయట పొందే అనుభవాలురెండింటినీ కలిపేదే సంపూర్ణ విద్యగా భావించాం. ఈ మార్పుల ఫలితాలను 2026 బ్యాచ్‌ విద్యార్థుల విద్యలో మనం స్పష్టంగా చూస్తున్నాం.

విద్యార్థుల స్ఫూర్తిదాయక విజయగాథలు
» హఫీజ్‌ మారుఫ్‌ అక్బర్‌ ఇండోనేషియాలోని ఆచే ప్రాంతంలో పెరిగాడు. 2004లో సంభవించిన భయంకర మైన సునామీ తర్వాత అక్కడి పరిస్థితులను అతను ప్రత్యక్షంగా చూశాడు. విపత్తుల సమయంలో ప్రజలు ఎలా స్పందిస్తారు? ప్రభుత్వ విధానాలు ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి? అనే విషయాలను మరింత లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తి అతనిలో కలిగింది. ఈ లక్ష్యంతోనే పబ్లిక్‌ పాలసీలో చేరాడు. అతను అంతర్జాతీయ వ్యవహారాలపై తనపరిజ్ఞానాన్ని పెంచుకున్నాడు. అదే సమయంలో సమాజానికి సేవ చేయడం కూడా కొనసాగించాడు. 2025లో ఆచే ప్రాంతంలో వచ్చిన వరదల సమయంలో స్వచ్ఛంద సేవ చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సహాయక కార్యక్ర మాల్లోనూ పాల్గొన్నాడు. ప్రజలు తమ జీవితాల్లో అత్యంత కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో అతనుచేసిన సేవలు ఎంతోమందికి ఉపయోగపడ్డాయి. అతని నాయ కత్వ లక్షణాలను గుర్తించి 2026లో డీన్‌ లీడర్‌షిప్‌ అవార్డు ప్రదానం చేశారు.

» మరో విద్యార్థి హువాంగ్‌ చావో హంగ్‌ గణితం,సంగీతం అనే రెండు విభిన్న రంగాలను అనుసంధానం చేశాడు. అతను డేటా సైన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌ మేజర్‌గా కోర్సు కొన సాగిస్తూనే... సంగీతాన్ని కూడా అభ్యసించాడు. ఈ సంవత్సరం పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌లో సెకండ్‌ మేజర్‌ పూర్తి చేసిన తొలి గ్రాడ్యు యేట్‌గా అతను చరిత్ర సృష్టిస్తున్నాడు. చైనీస్‌ ఆర్కెస్ట్రాలో విద్యార్థి నాయకుడిగా ఉంటూ సంగీతం, కథలు రాయడం, విజువల్‌ ఆర్ట్స్‌ కలిపి అద్భుతమైన ప్రదర్శనలకు నాయకత్వం వహించాడు. అంతే కాకుండా, అతను స్వయంగా సంగీతాన్ని రూపొందిస్తూ, సొంతంగా మల్టీమీడియా కళాఖండాలను సృష్టి స్తున్నారు. హఫీజ్, చావో హంగ్‌ ఎందరో అద్భుతమైన విద్యా ర్థుల్లో ఇద్దరు మాత్రమే. 2026 బ్యాచ్‌లోని ప్రతి ఒక్కరికీమీకంటూ ఒక ప్రత్యేకమైన కథ ఉంది.

సమాజానికి ఉపయోగపడేదే అసలైన విద్య
ఈ రోజు మీరు విశ్వవిద్యాలయం నుంచి బయటకు అడుగుపెడుతున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్నిగుర్తుంచుకోవాలి. భవిష్యత్తును నిర్ణయించేది సాంకేతికఅభివృద్ధి లేదా ఆర్థిక పరిస్థితులు మాత్రమే కాదు. మీరు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అదే మీరు సంపాదించిన జ్ఞానానికి అసలైన పరీక్ష!  అలాగే ఇకపై మీకు పరీక్షలు ఉండవు. ప్రతి సమస్యకు పూర్తిగా సరైన పరిష్కారం లేదా పూర్తిగా తప్పు పరిష్కారంకాని ఉంటుందని కూడా చెప్పలేం. కానీ మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైనదా కాదా అనే విషయాన్ని ఇతరులు ప్రశ్నించ గలిగేలా ఉండాలి. అదేవిధంగా మీరు సమాజంపై చూపించే ప్రభావం ఆధారంగానే మీ విలువను అంచనా వేస్తారని గుర్తుంచుకోండి. 

మీ వృత్తి రంగాల్లో, మీ సమాజంలో, అలాగే ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎన్నో మంచి మార్పులు తీసుకురావాలని ఆశిస్తున్నా. మీ భవిష్యత్తు విజయవంతంగా, సంతృప్తికరంగా, సంతోషంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 

» మీరు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అదే మీరు సంపాదించిన జ్ఞానానికి అసలైన పరీక్ష!
» తరగతి గదిలో నేర్చుకునే విద్య, తరగతి గదిబయట పొందే అనుభవాలు రెండింటినీ కలిపేదేసంపూర్ణ విద్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement