మరిన్ని ఆంక్షల వేళ.. ఇరాన్‌లో అనూహ్య పరిణామం! | Iran Oil Minister Resigns Amid US Sanctions And Naval Blockade Pressure, Major Shake Up In Tehran Energy Sector | Sakshi
Sakshi News home page

మరిన్ని ఆంక్షల వేళ.. ఇరాన్‌లో అనూహ్య పరిణామం!

Oct 5 2026 10:37 AM | Updated on Oct 5 2026 11:14 AM

Iran Oil Minister Resigns Amid US Sanctions and Naval Blockade

అమెరికా ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనంతో చమురు ఎగుమతులు, ఆదాయాలపై తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ఇరాన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ చమురు మంత్రి మొహ్సెన్‌ పాక్‌నెజాద్‌ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించినప్పటికీ.. దీని వెనక వ్యవహారం వేరే ఉందన్న చర్చ ఇప్పుడు జోరుందుకుంది. 

రాజీనామా ప్రకటన తర్వాత.. ఇరాన్‌ అధ్యక్ష రాయబార కార్యాలయంలో హైడ్రామా నడిచింది. పాక్‌నెజాద్‌ను పునరాలోచన చేయాలని అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ కోరారు. అయినప్పటికీ పాక్‌నెజాద్‌ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో చివరకు రాజీనామాను ఆమోదించారు. ఆ వెంటనే నేషనల్‌ ఇరానియన్‌ ఆయిల్‌ కంపెనీ (NIOC) చీఫ్‌ హమీద్‌ బోవర్డ్‌ను తాత్కాలిక చమురు మంత్రిగా నియమించారు. 

అమెరికా గురి వల్లే..
ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థకు చమురు ఎగుమతులే ప్రధాన ఆదాయ వనరు. ప్రస్తుతం అమెరికా ఆంక్షలు, నౌకల రాకపోకలపై ఆంక్షలతో ఆ రంగంపైనే తీవ్ర ప్రభావం పడుతోంది. ఫిబ్రవరి చివర్లో అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభమయ్యే ముందు హార్ముజ్‌ జలసంధి ద్వారా ప్రపంచ ముడిచమురు, ఎల్‌ఎన్‌జీ రవాణాలో దాదాపు ఐదో వంతు జరిగేది. తర్వాత హార్ముజ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం, వాణిజ్య నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. 

ఇరాన్‌ చమురు ఎగుమతులను అడ్డుకోవడం, ఆ దేశానికి చమురు ద్వారా వచ్చే ఆదాయం, విదేశీ మారకద్రవ్య ప్రవాహాన్ని పరిమితం చేయడమే అమెరికా చర్యల లక్ష్యంగా ఉంది. దీనివల్ల టెహ్రాన్‌తో పాటు ఇతర నగరాల్లో పెట్రోల్‌ కోసం పొడవాటి క్యూలు కనిపిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

రికార్డు స్థాయికి ఇరాన్‌ కరెన్సీ పతనం
అమెరికా ఒత్తిడితో పాటు ఇరాన్‌ ఆర్థిక పరిస్థితి కూడా మరింత దిగజారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌ కరెన్సీ రియాల్‌ తాజాగా డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఒక డాలర్‌కు సుమారు 26.88 లక్షల రియాళ్లకు చేరినట్లు సమాచారం. గత ఏడాది కాలంలో రియాల్‌ విలువ సగానికి పైగా పడిపోయింది. దేశంలో ద్రవ్యోల్బణం 70 శాతాన్ని దాటినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. నిత్యావసర వస్తువులు, ఇళ్ల ఖర్చులు సామాన్యులపై భారంగా మారుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం మార్చి 21 నుంచి జూన్‌ 20 మధ్య ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ ఏడాది ప్రాతిపదికన 10.1 శాతం కుదించుకుంది. ఇదే సమయంలో చమురు, గ్యాస్‌ రంగ కార్యకలాపాలు ఏకంగా 26.4 శాతం తగ్గినట్లు సమాచారం.

బోవర్డ్‌ చేతిలో కీలక బాధ్యత
ఇలాంటి పరిస్థితుల్లో తాత్కాలిక చమురు మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న హమీద్‌ బోవర్డ్‌పై కీలక బాధ్యతలు పడనున్నాయి. ఆయన ఇప్పటికే ప్రభుత్వ రంగంలోని నేషనల్‌ ఇరానియన్‌ ఆయిల్‌ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. చమురు ఎగుమతుల ద్వారా ఆదాయాన్ని కొనసాగించడం, అమెరికా ఆంక్షలు–దిగ్బంధనాన్ని ఎదుర్కొంటూ ఇంధన రంగాన్ని నడిపించడం ఆయన ముందున్న ప్రధాన సవాళ్లుగా మారాయి.

పాక్‌నెజాద్‌ మాత్రం రాజీనామాకు ముందు చమురు ఆదాయాలపై ప్రజలకు భరోసా ఇచ్చారు. తాము ఇప్పటికే విక్రయించిన చమురుకు సంబంధించిన ఆదాయం వస్తూనే ఉందని, అది కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

అమెరికా నుంచి మరిన్ని ఆంక్షలు
మరోవైపు ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఒత్తిడి మరింత పెరుగుతోంది. శుక్రవారం అమెరికా ట్రెజరీ ఇరాన్‌కు చెందిన రైలు, ఆటోమొబైల్‌ రంగాలను లక్ష్యంగా చేసుకుని కొత్త ఆంక్షలు ప్రకటించింది. ‘ఆపరేషన్‌ ఎకనామిక్‌ అవుట్‌కాస్ట్‌’లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా తెలిపింది. ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ మాట్లాడుతూ.. యుద్ధానికి నిధులు సమకూర్చుకునే టెహ్రాన్‌ సామర్థ్యాన్ని తగ్గించడమే లక్ష్యమని చెప్పారు. ఇరాన్‌ మిగిలిన చమురు ఆదాయ మార్గాలను కూడా కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అమెరికా వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా చమురు ధరలు తగ్గుతున్నాయని శనివారం వ్యాఖ్యానించారు. ఇరాన్‌ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యాలను దాదాపుగా వదులుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో అమెరికా–ఇరాన్‌ మధ్య యుద్ధం ఎనిమిదో నెలలోకి ప్రవేశించింది. అయితే పాక్‌నెజాద్‌ రాజీనామాకు అమెరికా ఆంక్షలు లేదంటే యుద్ధ పరిస్థితులే కారణమని ఇరాన్‌ ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన పదవి నుంచి తప్పుకున్నారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. అయినప్పటికీ దేశంలోని కీలకమైన చమురు రంగంపై అమెరికా ఒత్తిడి పెరుగుతున్న సమయంలోనే మంత్రి మారడం అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: నిరసన వెంటనే తుపాకీ పట్టారే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement