ఎండ–ఎకానమీ | India Heatwave Economic Impact Labour Crisis | Sakshi
Sakshi News home page

ఎండ–ఎకానమీ

Oct 5 2026 9:30 AM | Updated on Oct 5 2026 9:30 AM

India Heatwave Economic Impact Labour Crisis

ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలే ఎండ భారాన్ని ఎక్కువగా మోస్తున్నాయనేది ఇక్కడ కనిపించే లోతైన అసమానత.

ప్రపంచంలోని అత్యంత వేడిగా ఉన్న 50 నగరాల్లో 26 భారత్‌లోనే ఉన్నాయని క్లైమేట్‌ సెంట్రల్‌ అధ్యయనం వెల్లడించింది. మే 21న దేశ విద్యుత్‌ డిమాండ్‌ 270.82 గిగావాట్లకు చేరి కొత్త రికార్డు నెలకొల్పింది. ఇవి కేవలం వాతావరణ గణాంకాలు మాత్రమే కాదు... నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, డెలివరీ రైడర్లు, ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులు, పారిశుద్ధ్య కార్మికులు వంటి కోట్లాది మంది జీవనోపాధిపై ప్రత్యక్ష ప్రభావం చూపే ఆర్థిక సంకేతాలు.

ఇంతకాలం ఎండ తీవ్రతను వాతావరణ శాఖ హెచ్చరికగా, ఆరోగ్య శాఖ సమస్యగానే చూశాం. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) దృష్టిలో మాత్రం ఇది ఆర్థిక వ్యవస్థను కుదిపేసే అంశం. భారత శ్రామిక శక్తిలో సుమారు 75 శాతం మంది... వేడి ప్రభావానికి గురయ్యే వృత్తుల్లోనే ఉన్నారు.

2030 నాటికి ఉత్పాదకత తగ్గుదల కారణంగా 3.4 కోట్ల ఉద్యోగాలకు సమానమైన శ్రామిక సామర్థ్యం కోల్పోవచ్చని ఐఎల్‌ఓ అంచనా వేస్తోంది. ప్రపంచ బ్యాంకు మాత్రం భారత జీడీపీలో 4.5 శాతం (సుమారు 150–250 బిలియన్‌ డాలర్లు) 2030 నాటికి ప్రమాదంలో పడొచ్చని హెచ్చరిస్తోంది.

తీవ్రమైన వేసవి రోజుల్లో అసంఘటిత కార్మికులు తమ ఆదాయంలో 40 శాతం వరకు కోల్పోతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు ఏటా 24 పని దినాలను కోల్పో తున్నారు. ఇది ఒక్కసారి జరిగిపోయేది కాదు. ప్రతి ఏటా పునరావృతమయ్యే, నిశ్శబ్దంగా పేదరికాన్ని మరింత లోతు చేసే ప్రక్రియ.

దేశంలో ఒక్క తీవ్రమైన ఎండ రోజునే సుమారు 3,400 అదనపు మరణాలు సంభ విస్తున్నాయని 2026 అధ్యయనం అంచనా వేసింది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌ – ఈ అయిదు రాష్ట్రాల్లో దేశ జనాభాలో 43 శాతం ఉండగా, వడగాల్పు మరణాల్లో 60 శాతానికి పైగా ఇక్కడే నమోదవుతున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలే ఎండ భారాన్ని ఎక్కువగా మోస్తున్నాయనేది ఇక్కడ కనిపించే లోతైన అసమానత.

తెలంగాణ ప్రభుత్వం వడగాల్పును ‘రాష్ట్ర ప్రత్యేక విపత్తు’గా ప్రకటించి మృతుల కుటుంబాలకు పరిహారాన్ని రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షలకు పెంచింది. తెలంగాణ కార్మిక సంఘాల ప్రకారం...  ప్రభుత్వ ప్రణాళికలు, పథకాలు స్థానిక భాషల్లో కార్మికులకు చేరడం లేదు. నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు ఇప్పటికీ తగిన రక్షణ లేకుండానే పనిచేస్తున్నారు. ఆహార పంపిణీ కార్మికులు, ద్విచక్ర వాహన రైడర్ల ఆదాయం రోడ్డుపై గడిపే గంటలపైనే ఆధారపడి ఉంటుంది. వీరికి కనీస వేతన హామీ లేదు, సామాజిక భద్రతా రక్షణ ఇంకా పరిమితంగానే ఉంది.3

ఒక విధాన ప్రశ్న
పరిష్కారం ‘నీళ్లు తాగండి, నీడలో ఉండండి’ అనే హెచ్చరికలకే పరిమితం కాకూడదు. ఇది శ్రామిక విధానానికి సంబంధించిన ప్రశ్న. మధ్యాహ్నం 12–3 గంటల మధ్య బహిరంగ నిర్మాణ పనులను నిషేధించే చట్టం– ఖతార్, యూఏఈ వంటి దేశాలు అమలు చేస్తున్నాయి. భారత్‌లోనూ తీసుకురావాలి. ప్రతి నిర్మాణ సైట్‌లో నీడ, తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను తప్పనిసరి చేయాలి. 45 డిగ్రీలు దాటిన రోజుల్లో కార్మికుల ఆదాయ నష్టానికి ప్రభుత్వమే బీమా లేదా పరిహార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయంతో ఎండ తీవ్రతను వాతావరణ హెచ్చరికగా మాత్రమే కాకుండా, జాతీయ ఆర్థిక ప్రణాళికలో కీలక ప్రమాద అంశంగా పరిగణించడం అత్యవసరం. థర్మామీటర్‌లో వేడి పెరిగిన కొద్దీ పేదరికం పెరుగుతోంది. ఈ ఎండ నిశ్శబ్దంగా భారత్‌ ఆర్థిక పునాదిని కరిగిస్తోంది. ప్రతి సంవత్సరం పునరావృతమయ్యే ఈ సంక్షోభాన్ని ఇక వాతావరణ వార్తగా కాకుండా, జాతీయ ప్రాధాన్యతగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.
– వంగవోలు రవి, ఉపాధ్యాయుడు, ఒంగోలు

ఇదీ చదవండి: అసలు 'చూడటం' అంటే ఏమిటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement