అసలు 'చూడటం' అంటే ఏమిటి? | How can we perceive something that is invisible to our eyes? | Sakshi
Sakshi News home page

అసలు 'చూడటం' అంటే ఏమిటి?

Oct 5 2026 2:45 AM | Updated on Oct 5 2026 2:45 AM

How can we perceive something that is invisible to our eyes?

విశ్వగురు

ఈ రోజు బ్యాచిలర్స్, మాస్టర్స్, డాక్టోరల్, ప్రొఫెషనల్‌ డిగ్రీలు అందుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. 2016, ఏప్రిల్‌లో కుమమోటో భారీ భూకంపం వచ్చిన సరిగ్గా పదేళ్ల తర్వాత... గత జూలైలో, అదే కుమమోటో ప్రాంతంలో మరో పెద్ద భూకంపం సంభవించింది. మీ అందరికీ గుర్తుండేఉంటుంది. ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్, మంచినీటి సరఫరా నిలిచిపోయింది. చాలామంది తమ ఇళ్లను వదిలి నిర్వాసితులుగా వెళ్లాల్సి వచ్చింది. జపాన్‌ దీవులు ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఒకటి. 

భూమి లోపల ఉండే రాళ్లలోని పొరలు (ఫాల్ట్స్‌) హఠాత్తుగా జారడం వల్ల భూకంపాలు వస్తాయి. అయితే భూకంపాల గురించి ఇప్పటికీ మనకు పూర్తి సమాచారం తెలియదు. అవి ఎప్పుడు, ఎక్కడ, ఏ స్థాయిలో సంభవిస్తాయో ముందే చెప్పలేం. భూమి ప్రకంపనాలను నిరంతరం నమోదు చేసే ‘సీస్మోగ్రాఫ్‌’ పరికరాలను సుమారు 150 ఏళ్ల క్రితం తయారు చేశారు. 1923 నాటి గ్రేట్‌కాంటో భూకంప సమయంలో... టోక్యో, యోకోహామా నగరాలను ఊపేసిన ప్రకంపనాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, సీస్మోగ్రాఫ్‌ల ముల్లులు పరిమితి దాటి బయటకు వచ్చేశాయి. 21వ శతాబ్దం ప్రారంభం నాటికి జపాన్‌ అంతటాకొత్త, అత్యధిక సామర్థ్యం గల సీస్మోగ్రాఫ్‌లను అమర్చారు. భూమి ఉపరితలంలో వచ్చే మార్పులను మ్యాపింగ్‌ చేయడానికి శాటిలైట్‌ (ఉపగ్రహం) పరిశీలనలను కూడా ఉపయోగిస్తున్నారు. 

మన దగ్గర ఎన్ని రకాల పరిశీలనా డేటా, సమాచారం ఉన్నప్పటికీ... భూమి లోపల జరుగుతున్న వాస్తవ భూకంప దృశ్యా లను నేరుగా చూడలేకపోతున్నాం. మనం చేయగలిగిందల్లా ఆ లోపలి మార్పులను మసకగా ఉన్న ఒక అద్దంలోంచి చూసినట్లు ఊహించడం మాత్రమే. ఇక్కడే మనకు ఒక ముఖ్యమైన ప్రశ్న ఎదురవుతుంది. మన కంటికి కనిపించని దాన్ని మనం ఎలా గ్రహించగలం? అసలు ఒక వస్తువు ‘కనిపించడం’ అంటే ఏమిటి? 

కనిపించని దాన్ని గ్రహించడం ఎలా?
శరీరధర్మ శాస్త్రం (ఫిజియాలజీ) ప్రకారం... చూడటం అనేది కంటిలోకి కాంతి ప్రవేశించడంతో మొదలవుతుంది. కంటిలోని ‘రెటీనా’ ఆ కాంతిలోని సమాచారాన్ని విద్యుత్‌ సంకేతాలుగా మార్చి మెదడుకు పంపుతుంది. మెదడు ఆ సంకేతాలను అర్థవంతమైనదృశ్యంగా మారుస్తుంది. కాబట్టి చూడటం అంటే కేవలం కళ్లుకాంతిలోని సమాచారాన్ని స్వీకరించడం మాత్రమే కాదు, ఆ సమాచారాన్ని మన మెదడు ఎలా అర్థం చేసుకుంటుంది అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది.

జీవుల పరిణామ క్రమంలో, కన్ను ఏర్పడటం అనేది ఒక గొప్ప మలుపు. కేంబ్రియన్‌ కాలంలో జీవించిన ‘ట్రైలోబైట్స్‌’ అనే పురాతన సముద్ర జీవులను చూపున్న తొలి జీవులుగాభావిస్తారు. మొదట్లో వాటికి వెలుతురును మాత్రమే గుర్తించగలిగే సరళమైన అవయవాలు ఉండేవి. కాలక్రమేణా అవి ఆకారాన్ని గుర్తుపట్టే, కదలికలను కనిపెట్టే, దూరాన్ని అంచనా వేసే కళ్లుగా మారాయి.

సుమారు 50 కోట్ల ఏళ్ల క్రితం జరిగిన ‘కంబ్రియన్‌ విస్ఫోట
నం’తో జీవుల సంఖ్య ఆకస్మాత్తుగా పెరిగింది. శిలాజాలుగా మారిన జీవుల సంఖ్య ఎన్నో రెట్లయింది. జీవులు గట్టి పెంకులు, అస్థిపంజ రాలను పెంచుకున్నాయనడానికి ఇదొక నిదర్శనం. దీని వెనుక జీవుల మధ్య మనుగడ కోసం జరిగిన తీవ్రమైన పోటీ ఉంది. ఆ పోటీకి ‘చూపు’ రావడమే ప్రధాన కారణం. చూడగలిగే శక్తి రాగానే జీవులు గ్రహించే సమాచారం విపరీతంగా పెరిగింది. అవి తమ ఆహారాన్ని వేగంగా వెతికి పట్టుకోగలిగాయి. శత్రువులను త్వరగా గుర్తించి, వాటి నుండి తప్పించుకోవడం, దాక్కోవడం నేర్చు కున్నాయి. 

మానవ కంటి పరిమితులను దాటి...
మైక్రోస్కోప్‌ (సూక్ష్మదర్శిని) మనకు సూక్ష్మజీవులు, కణాల ప్రపంచాన్ని చూపించింది; టెలిస్కోప్‌ (దూరదర్శిని) సుదూర నక్షత్రాలను పరిశీలించేలా చేసింది; ఎక్స్‌ రేలు ఘన పదార్థాల లోపల, మానవ శరీరం లోపల ఉన్న అవయవాలను చూపించాయి. సైన్స్ చరిత్ర అంటేనే మానవ కంటి పరిమితులను అధిగమించిన చరిత్ర. వందసార్లు వినడం కంటే ఒక్కసారి చూడటం మేలు. కెమెరాలు, శాటిలైట్లు, అంతరిక్ష నౌకల ద్వారా మానవుడు తన కంటి పరిమితులను దాటి సృష్టిని కొత్త కోణంలో చూడగలుగుతున్నాడు. నేను స్వయంగా మైక్రోఫ్లూయిడ్‌ పరికరాలు కలిగిన చిన్న అండర్‌ వాటర్‌ రోబోలను సముద్ర గర్భంలోకి పంపాను. సూర్యకాంతి కూడా చేరని ఆ చీకటి సముద్రంలో, నీటిలోని మైక్రో–ఆర్గానిజమ్స్‌ జన్యు సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాను. అది మానవ దృష్టిని సముద్ర లోతుల్లోకి తీసుకెళ్లే ఒక ప్రయత్నం.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్(ఏఐ) అభివృద్ధి చెందడం కూడా ఒక రకమైన కొత్త కన్ను పరిణామ క్రమమే! సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు, పారిశ్రామిక రోబోలు, ఫేషియల్‌ రికగ్నిషన్, మెడికల్‌ ఇమేజింగ్‌ లలో యంత్రాలకు కొత్త రకం కళ్లు వచ్చాయి. ఇవి కేవలం ఫోటోలు తీయడమే కాదు, అక్కడ ఏముందో గుర్తించగలవు. పూర్వం కంబ్రి యన్‌ కాలంలో మాదిరిగానే, ఈ కొత్త ‘ఏఐ కళ్లు’ కూడా మనప్రపంచాన్ని మార్చడం ప్రారంభించాయి. అయితే, మనం చూసే శక్తిఎంత పెరిగినప్పటికీ, కేవలం చూడటం వల్లే ప్రపంచం మొత్తం అర్థమైపోదు. అర్థం చేసుకోవడానికి ఒక సమాచారాన్ని మరో సమాచారంతో పోల్చాలి, దాని అర్థాన్ని వెతకాలి, దాన్ని విశ్లేషించాలి. 

నేటికీ మనం చూడలేనివెన్నో!
మనకు కనిపించనంత మాత్రాన అక్కడ ఏమీ లేదని అర్థం కాదు. అలాంటి తెలియని ప్రాంతాల్లోనే మన ప్రస్తుత జ్ఞానాన్ని మార్చే, కొత్త భవిష్యత్తును ఇచ్చే తాళంచెవులు దాగి ఉంటాయి. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కేవలం చూడటం ఒక్కటే సరిపోదు. మనం అందరం ఒకే వస్తువును చూస్తున్నప్పటికీ... ప్రతి ఒక్కరికీ అది ఒకేలా కనిపించకపోవచ్చు. కొంతకాలం క్రితం, నేను టోక్యో యూనివర్సిటీ ఆఫ్‌ ది ఆర్ట్స్‌ అధ్యక్షులైన ఆర్టిస్ట్‌ కట్సుహికో హిబినోతో మాట్లాడాను. ఆయన ఒక మాట చెప్పారు. వంద మందిని ఒక యాపిల్‌ పండు బొమ్మ గీయమంటే... ఏ ఇద్దరి బొమ్మలూ ఒకేలా ఉండవు. అందరూ ఒకే పండును ఊహించి నప్పటికీ... దాని ఆకారం, రంగు, ఆకృతిని వేర్వేరుగా చూస్తారు. వారి మెదడు పనిచేసే విధానం, వారు యాపిల్‌ను తాకినప్పుడు లేదా రుచి చూసినప్పుడు పొందిన అనుభూతులు వేర్వేరుగా ఉండ టమే దీనికి కారణం అని చెప్పారు. బొమ్మ గీయడం అనేది మన మధ్య ఉన్న తేడాలను చూపిస్తుంది, అలాగే ఆ తేడాలను గౌరవించడం నేర్పుతుంది.

ఇతరుల ఆలోచనలను, వారి దృక్పథాలను తెలుసుకోవడంలో గొప్ప విలువ ఉంది. ఒక విషయం ఇతరులకు ఎలా కనిపిస్తుంది? వారు దాని నుంచి ఏమి గ్రహిస్తున్నారు? అని తెలుసుకున్నప్పుడు, మనకు తెలియని ప్రపంచాలు ఉన్నాయని అర్థమవుతుంది. ఇక్కడే ‘సంభాషణ’ అసలు అర్థం ఉంది. కన్ఫ్యూషియస్‌ బోధనలలో ఒక మాట ఉంది: ‘గొప్ప ఆలోచనలు ఉన్నవారు సామరస్యాన్ని కోరు కుంటారు. అందరూ ఒకేలా ఉండాలని అనుకోరు. 

అల్ప ఆలో చనలు ఉన్నవారు మాత్రం అందరూ ఒకేలా ఉండాలనుకుంటారు. కానీ ఐక్యతను కోరుకోరు’.అంటే మన చుట్టూ ఉన్నవారితో కలిసి మెలిసి ఉండాలి, కానీ అందరిలాగే మన ఆలోచనలను మార్చేసు కోకూడదు. సంభాషణ అంటే మన ఆలోచనలను ఇతరులపై రుద్దడం కాదు. లేదా ఎవరితోనో ఊరికే ఏకీభవించడం కాదు. వ్యత్యాసాలను అంగీకరిస్తూనే అవగాహనను పెంచుకోవడం. ఇతరు లను అర్థం చేసుకోవడానికి వేసే ప్రశ్న వేరు.. ఇతరులను ఓడించ డానికి వేసే ప్రశ్న వేరు. చూడటానికైనా, ప్రశ్నించడానికైనా

వినయం, ఊహాశక్తి చాలా అవసరం.
హోసే విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ షోజో ఫుజితా పరిశోధ కులను తరచుగా రెండు ప్రశ్నలు అడిగేవారు: ‘మీరు ఆ పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివారు? మీరు తయారు చేసిన ముసాయిదాను ఎన్నిసార్లు తిరగరాశారు?’ వేగంగా సమాచారం కోసం ఏఐ సమ్మరీలపై ఆధారపడే ఈ రోజుల్లో, ఒకే పుస్తకాన్ని పదే పదే చదవడం సమయం వృథా అనిపించవచ్చు. కానీ, లోతుగా పరిశీలించడమే విశ్లేషణకు, అవగాహనకు పునాది. పరిశీలన అనేది ఒకే చూపుతో పూర్తయిపోదు. సమాచారాన్ని సరిగ్గా విశ్లేషించాలన్నా, ఒక పుస్తకాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలన్నా దాన్ని పదే పదే చదవాలి. సంభాషణ కూడా అంతే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement