‘ప్రాంప్ట్‌’లు ఉడకవ్‌! | AI has a hundred million tricks and humans have an infinite number of creations | Sakshi
Sakshi News home page

‘ప్రాంప్ట్‌’లు ఉడకవ్‌!

Oct 5 2026 2:50 AM | Updated on Oct 5 2026 2:50 AM

AI has a hundred million tricks and humans have an infinite number of creations

చలం ‘మైదానం’ రాశాడు. ‘బ్రాహ్మణీకం’ రాశాడు. ‘దైవమిచ్చిన భార్య’ రాశాడు. పట్టని పాఠకులకు ఎలాగూ పట్టని ఎన్నో ఉత్తమోత్తమమైన రచనలు చేశాడు. ఆయన పుస్తకా లన్నీ ఫలానా ఏఐ సంస్థవారు ఏ ఆదివారం పూటో అబిడ్స్‌ సెకండ్‌ హ్యాండ్‌ పుస్తకాల కొట్లలోనో గాలించి, వాటన్నింటినీ హైస్పీడ్‌ స్కాన్  చేసి ఆనెక ఆ కాగితాలన్నింటినీ కుప్పబోసి కాల్చేశారనుకోండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకేమైనా తెలుసా? 

రావిశాస్త్రి గారున్నారు. పేదల నడ్డి మీద దుడ్డుకర్రలతో బాదే రక్కసి పెద్దల మీద, వాళ్లకు సపోర్టుగా దిగే ఖాకీవాలాల మీద, లూప్‌హోల్స్‌ అందించే నల్లకోటు కన్నింగ్‌ కోవిదుల మీద ఎన్నో చురకలు వేశాడు. చెమ్డాలు లెక్కదీశాడు. అట్టి రావిశాస్త్రి సమగ్ర రచనలన్నింటినీ పేజీ పేజీన పీల్చుకుని, నమిలి, అరాయించుకుని ఏఐగారు బ్రేవ్‌మని తేన్చారనుకోండి. ఆనెక ఏం జరుగుతుందో తెలుసా?

విశ్వనాథ రాసిన వేయి రచనలు, బీనాదేవి బహుముఖీన కథలు, మధురాంతకం కథా మురబ్బాలు, అల్లం రాజయ్య పిడికెలెత్తిన పాత్రలు... ఇవన్నీ ఏఐ ఒంట పట్టించు కుంటే జరిగే వింత ఏమిటంటే రేప్పొద్దున ఏ ఇన్‌స్టా రచయితో ‘రాజేశ్వరి పశ్చాత్తాపం’ అనే నవల చలం శైలిలో రాయి అంటే రాస్తుంది. మరే రీల్స్‌ రైటరో ‘రావిశాస్త్రి యాసలో సారా కాంట్రాక్టర్ల మానవత్వానికి దీపం పట్టు’ అంటే ఒక రచన నుడువుతుంది. చాసోలా, చండీదాస్‌లా, బుచ్చిబాబులా రాయమని అడగ్గానే క్షణాల్లో వారి శైలిలోనే అక్షరాలను పరుస్తుంది. ఏఐ కిచెన్‌లో పోపు తగిలించుకునే ఫాస్ట్‌ఫుడ్‌ ఇది. ప్లేట్‌ మీద మన పేరు తగిలించుకుని మార్కెట్లోకి వరదలా వదలొచ్చు. బుర్రను వాడలేని, ఒరిజినల్‌గా రాయలేనివారు హోషియారీగా ప్రాంప్ట్‌ ఇవ్వడం నేర్చుకుని రచయితలుగా చలామణి అయిపోవచ్చు. ఇక పాఠకుల విషయానికి వస్తే బావి తెలియని వారికి కుళాయిలో వచ్చేవే నీరైనట్టు ఈ నకళ్లే ఒరిజినల్స్‌ అనుకునే ఖర్మ పట్టొచ్చు.

ఇదొక నష్టమా? ఇంకా ఉంది... ఒక మనిషి ఏదో మేర బుర్ర కలిగి ఉండటమే గొప్ప. షేక్‌స్పియర్‌ బుర్ర, సోమర్‌సెట్‌మామ్‌ బుర్ర, హెమింగ్వే బుర్ర... ఇవి తోడొస్తే? యద్దనపూడి, యండమూరి, మల్లాది బుర్రలను మిక్సీలో వేసి భేషైన బుర్రను ఇస్తాం అని చెప్తే? కొమ్మూరి సాంబశివరావు, టెంపోరావు, మధుబాబుల కాంబినేషన్‌ బుర్ర రెడీగా ఉందంటే? ప్రస్తుత ఉచిత ఏఐ టూల్స్‌తోనే బోలెడంత కాపీ రచనలు చేసేస్తున్నారు మనవాళ్లు. ఇక ‘క్లాసిక్‌ రచయితల రచనలను అరాయించుకున్నప్రీమియం ఏఐ టూల్‌ను ఇస్తాం... మీ ప్రాంప్ట్‌కు బ్రహ్మాండమైన రచన సరఫరాచేస్తాం... నెలకు 20 డాలర్లు’ అనంటే కొనేవాళ్లు కొల్ల. కానీ ఒరిజినల్‌ రైటర్స్‌కు పైసా పోదు. ఏఐ కంపెనీకే పోతుంది. 

ఏఐ వద్ద ఏమీ లేదు. దానికి డేటా కావాలి. మేధో డేటా. బుర్రున్న డేటా. హృదయ మున్న డేటా. స్పందన ఉన్న డేటా. అది సాహిత్యం. గురజాడ నుంచి కేశవరెడ్డి వరకు ఉత్తమ రచయితల రచనలు ఫీడ్‌ అయ్యేకొద్దీ అది తర్ఫీదు అవుతూ ఉంటుంది. ఆ తర్ఫీదుతో తన మీద ఆధారపడే పరాన్నభుక్కు రచయితల ముఖాన కొన్ని పాప్‌కార్న్స్‌ పడేస్తుంటుంది. దానికి తెలుసు.... తన రచనలో నిజమైన గుండె మంట, లెంప పగుల గొట్టే వ్యంగ్యం, కనుచివర దాటని శోకం ఉండవని... ఉండలేవని. అందుకే అది తన వద్దకు రమ్మనదు. వచ్చినవారిని ఖాళీ చేతులతో పంపదు.

ఇప్పుడేం చేయాలి? రచయితలు, పాఠకులు సమష్టిగా ఈ దశను ఎదుర్కొనాలి. రచయితలు  ఏఐకి ఇంకా అందని జీవితాన్ని, ఏఐ పంటి కింద ఇప్పటికీ నలగని భాషలో రాయాలి. ఏఐతో కలిసి రాస్తున్న రచయితల బోలు రచనలను బద్దలు కొట్టే జీవనసాంద్రతలను రాయాలి. మనిషి కంటికీ చేతికీ మాత్రమే చిక్కే బతుకు చిత్తరువును చూపాలి. అంతేనా? పుస్తకం వేశాక   All rights reserved, No part of this book may be used for training AI models  అని స్పష్టంగా రాయాలి. ఇక పాఠకులు స్క్రీన్‌ మీద కాకుండా చేతిలో పట్టుకునే పుస్తకాన్ని మాత్రమే చదవాలి. రీడర్స్‌ గ్రూపులుగా ఏర్పడి మంచి పుస్తకాల ఆనవాలు పట్టి అక్కున చేర్చుకోవాలి. 

ఏ.ఐ.వి శతకోటి ఉపాయాలు. మనిషివి అనంతకోటి సృజనలు. ఏఐ...నీ ప్రాంప్ట్‌లు ఉడకవ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement