అన్నీ ఇక్కడే అంటే నో సార్‌! | Why Microsoft Is Challenging Trump Overseas Data Centre Restrictions And What It Means For India 17.5 Billion Dollars AI Investment Plans | Sakshi
Sakshi News home page

అన్నీ ఇక్కడే అంటే నో సార్‌!

Nov 23 2026 12:55 PM | Updated on Nov 23 2026 1:15 PM

Why Microsoft Is Pushing Back What It Means for India AI Bet trump data centers

ప్రపంచ సాంకేతిక రంగంలో ఏఐ, డేటా సెంటర్ల విస్తరణ చుట్టూ కొత్త భౌగోళిక రాజకీయ వివాదం రాజుకుంది. అమెరికా కంపెనీలు విదేశాల్లో డేటా సెంటర్లు నిర్మిస్తే భారీ జరిమానాలు, పన్నులు విధిస్తామని డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల చేసిన హెచ్చరికపై మైక్రోసాఫ్ట్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు నాణ్యమైన క్లౌడ్‌ సేవలు అందించాలంటే ఆ కేంద్రాలు వారి ప్రాంతాలకు చేరువలోనే ఉండాలని మైక్రోసాఫ్ట్‌ అధ్యక్షుడు బ్రాడ్‌ స్మిత్‌ స్పష్టం చేశారు.

సీబీఎస్‌ ‘ఫేస్‌ ద నేషన్‌’ కార్యక్రమంలో స్మిత్‌ మాట్లాడుతూ.. ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చే కేంద్రాలు, సాధారణ క్లౌడ్‌ సేవల డేటా సెంటర్ల మధ్య తేడాను గుర్తించాలన్నారు. స్ట్రీమింగ్‌, గేమింగ్‌, వ్యాపార సేవలకు నెట్‌వర్క్‌ వేగం కీలకమని, న్యూజెర్సీలో కేంద్రం పెట్టి ఫిన్లాండ్‌లోని హెల్సింకీ వినియోగదారులకు సమర్థంగా సేవలు అందించలేమని ఉదాహరణతో వివరించారు. అన్ని కేంద్రాలను అమెరికాలోనే నిర్మించడం ఆచరణ సాధ్యం కాదని తేల్చిచెప్పారు.

జాతీయ భద్రతే ట్రంప్‌ అస్త్రం

ఇటీవల వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. చైనాతో ఏఐ పోటీలో అమెరికా వెనుకబడకూడదనే విదేశీ డేటా సెంటర్లను అడ్డుకుంటున్నామన్నారు. గతంలో సెమీకండక్టర్‌ చిప్‌ల కోసం విదేశాలపై ఆధారపడటం వ్యూహాత్మక బలహీనతగా మారిందన్నారు. ఏఐ విషయంలో అది పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. అయితే, ఈ విధివిధానాలపై అధ్యక్షుడితో ఇంకా చర్చించలేదని ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ వెల్లడించడం గమనార్హం. ఇప్పటికే దేశీయ డేటా సెంటర్ల విద్యుత్‌ భారం ప్రజలపై పడకుండా టెక్‌ సంస్థలే భరించేలా 2026 మార్చిలో అమెరికా ‘రేట్‌పేయర్‌ ప్రొటెక్షన్‌ ప్లెడ్జ్‌’ను తెచ్చింది.

భారత్‌లో పెట్టుబడుల సంగతేంటి?

ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ ప్రాజెక్టులపై చర్చ మొదలైంది. 2026–2029 మధ్య భారత్‌లో 17.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1.5 లక్షల కోట్లు) పెట్టుబడి పెడతామని 2025 డిసెంబర్‌లో మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. ఆసియాలోనే ఇది అతిపెద్ద పెట్టుబడి. దీని ద్వారా హైదరాబాద్‌లోని ఇండియా సౌత్‌ సెంట్రల్‌ క్లౌడ్‌ రీజియన్‌తో పాటు చెన్నై, పుణె కేంద్రాలను విస్తరించి 2030 నాటికి రెండు కోట్ల మందికి ఏఐ శిక్షణ ఇవ్వనుంది. ప్రస్తుతానికి ట్రంప్‌ హెచ్చరికలు కేవలం విధానపరమైన ప్రకటన మాత్రమే కావడం, భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో దేశీయ ప్రాజెక్టులకు తక్షణ ముప్పు లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: రెండో పాలసీ ఉందని జీవిత బీమా తిరస్కరణ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement