దేశంలోని నిరుపేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించే ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) అమలులో లబ్ధిదారుల జాబితా ప్రక్షాళన అంశం మరోసారి చర్చకు దారితీసింది. పథకంలో 13.2 శాతం అనర్హులు (ఇన్‌క్లూజన్ ఎర్రర్) ఉన్నారంటూ 2025–26 మూల్యాంకన అధ్యయనాన్ని ఉటంకిస్తూ కథనాలు వస్తున్నాయి. దాంతో ఈ పథకంలో పారదర్శకతను పెంచాల్సిన అవసరం చర్చకు వస్తోంది.
81.35 కోట్ల మందికి భరోసా.. భారీ సబ్సిడీ
జాతీయ ఆహార భద్రత చట్టం–2013 (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) ప్రకారం 2011 జనాభా లెక్కల ఆధారంగా గ్రామీణ జనాభాలో 75 శాతం, పట్టణ జనాభాలో 50 శాతం చొప్పున గరిష్ఠంగా 81.35 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించే వెసులుబాటు ఉంది. 2024 జనవరి 1 నుంచి మరో ఐదేళ్లపాటు పొడిగించిన ఈ పథకం కింద అంత్యోదయ (ఏఏవై) కుటుంబాలకు నెలకు 35 కిలోలు, ప్రాధాన్యతా కుటుంబాల (పీహెచ్‌హెచ్) సభ్యులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత ధాన్యాలు అందుతున్నాయి. 2026 మార్చి 25న లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, 2025 క్యాలెండర్ సంవత్సరంలో సుమారు 4.95 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పంపిణీ చేయగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,99,499.67 కోట్ల ఆహార సబ్సిడీ విడుదలైంది.
గుర్తింపు బాధ్యత రాష్ట్రాలదే..
ఈ పథకంలో లబ్ధిదారుల గరిష్ఠ పరిమితిని కేంద్రం నిర్ణయిస్తే అర్హులను గుర్తించి కార్డులు జారీ చేసే బాధ్యత పూర్తిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలదే. ఆదాయ పరిమితులు, భూమి, ఉద్యోగ ప్రమాణాలు రాష్ట్రాలవారీగా వేర్వేరుగా ఉంటాయి. 2025లో సవరించిన ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్తర్వుల ప్రకారం, లబ్ధిదారుల జాబితాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ప్రతి ఐదేళ్లకోసారి రేషన్ కార్డుదారులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి చేశారు. గతంలో ఆధార్ అనుసంధానం, ఈ-పోస్ యంత్రాల వినియోగం ద్వారా 2014–21 మధ్య రాష్ట్రాలు సుమారు 4.28 కోట్ల నకిలీ కార్డులను రద్దు చేశాయి.
సంక్షేమం, పారదర్శకత మధ్య సమతుల్యత
ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అనర్హులను తొలగించడం ఎంత ముఖ్యమో, సాంకేతిక కారణాలతో నిజమైన పేదలు ఆహార భద్రతకు దూరం కాకుండా చూడటం అంతే ముఖ్యం. కేవలం ఒక వాహనం లేదా చిన్నపాటి గృహ ఆస్తి ఉందన్న కారణంతో కాకుండా కుటుంబ ఆదాయం, అప్పులు, వాస్తవ జీవన స్థితిగతులను సమగ్రంగా మదింపు చేయాలని కొందరు కోరుతున్నారు. వివిధ ప్రభుత్వ డేటాబేస్‌ల మధ్య సమన్వయం పెంచుతూనే పొరపాటున కార్డు రద్దయిన పేదలకు సులభంగా అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పించినప్పుడే పథకం అసలు లక్ష్యం నెరవేరుతుంది.
ఇదీ చదవండి: రెండో పాలసీ ఉందని జీవిత బీమా తిరస్కరణ!


