అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి! | Three killed at Ohio baby shower and nine shot at California | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి!

Nov 23 2026 10:07 AM | Updated on Nov 23 2026 10:07 AM

Three killed at Ohio baby shower and nine shot at California

వాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. వారాంతంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల ఘటనల్లో మొత్తం 12 మందికి బుల్లెట్‌ గాయాలు తగిలాయి. ఓహియోలో జరిగిన బేబీ షవర్‌ వేడుకలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. మరోవైపు కాలిఫోర్నియాలో జరిగిన ఒక సంగీత కార్యక్రమంలో దుండగులు కాల్పులకు తెగబడటంతో తొమ్మిది మంది గాయపడ్డారు.

ఓహియోలోని పార్మాలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. క్లీవ్‌ల్యాండ్‌కు సమీపంలోని పండోరాస్‌ మ్యాజికల్‌ ఈవెంట్స్‌ వేదికలో బేబీ షవర్‌ వేడుక జరుగుతుండగా కుటుంబ వివాదం కారణంగా కాల్పులు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 39 ఏళ్ల మహిళ కాలికి గాయమైంది.

మృతుల్లో 17 ఏళ్ల లీసియా ఇంగ్లండ్‌, 45 ఏళ్ల జేసన్‌ టౌన్‌సెండ్‌ ఉన్నారు. ఈ కాల్పుల్లో 19 ఏళ్ల యువకుడు కూడా మరణించాడు. అతడే పుట్టబోయే బిడ్డకు తండ్రి అని, వేడుకకు అతడిని ఆహ్వానించలేదని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు అదుపులోకి తీసుకున్న 29 ఏళ్ల వ్యక్తి కాల్పులు జరిపాడా? లేక ఆత్మరక్షణ కోసం వ్యవహరించాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇక కాలిఫోర్నియాలోని తులారే కౌంటీ స్ట్రాత్‌మోర్‌లో శనివారం రాత్రి సంగీత కార్యక్రమం జరుగుతుండగా కాల్పులు జరిగాయి. సుమారు 150 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. 26 ఏళ్ల వ్యక్తి ఛాతీలో బుల్లెట్‌ తగలడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. అతడి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి కూడా ఆపరేషన్‌ అవసరమైంది. మిగిలిన ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన గ్యాంగ్‌ సంబంధిత దాడి అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ప్రజలకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: సైబర్‌ ముప్పు.. ట్రంప్‌ కీలక నియామకం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement