చందేల్: మణిపుర్‌లో కల్తీ మద్యం తీవ్ర విషాదాన్ని నింపింది. చందేల్ జిల్లాలో గత మూడు రోజుల్లో కల్తీ మద్యం సేవించి 12 మంది మృతిచెందారు. మరో 180 మంది అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఎక్కువమంది యువకులు, మధ్య వయస్కులే ఉన్నారు. నవంబర్ 18న ఐదుగురు, గురువారం ఒకరు, శుక్రవారం ఇద్దరు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు నుంగ్‌పాన్ గ్రామంలో బుధవారం రాత్రి 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మిగిలిన మరణాలు వివిధ గ్రామాల్లో చోటుచేసుకున్నాయి.
బాధితులు సేవించిన కల్తీ మద్యాన్ని పొరుగున ఉన్న కక్చింగ్ జిల్లాలోని సుగ్నూ ప్రాంతం నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. చందేల్ జిల్లా మయన్మార్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ప్రాంతం. ఈ సరిహద్దులో కంచె లేకపోవడంతో మద్యం అక్రమ రవాణా జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మద్యం ఎక్కడ తయారైందనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు.
మరోవైపు మృతుల సంఖ్య, మరణాలకు కచ్చితమైన కారణాలపై వైద్య, శాస్త్రీయ నిర్ధారణ జరగాల్సి ఉంది. ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. జిల్లా యంత్రాంగం ప్రజల కోసం ఏడు సూత్రాలతో కూడిన హెచ్చరికలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్థానికంగా తయారైన మద్యం, అనుమానాస్పద వనరుల నుంచి లభించే మద్యాన్ని సేవించవద్దని సూచించింది.
కల్తీ మద్యం సేవించిన తర్వాత వాంతులు, కడుపునొప్పి, తలనొప్పి, కళ్లు తిరగడం, చూపు మసకబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రజలకు సూచించింది. మణిపుర్ ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ ఇంఫాల్‌లోని రెండు ప్రైవేటు ఆస్పత్రులను సందర్శించి బాధితులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: పరువు నష్టం కేసులో మేరీకోమ్‌కు నోటీసులు


