మరణశిక్ష విధించే విషయంలో సుప్రీంకోర్ట్ అతిగా దయ చూపించడం వలన సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయని ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి దీపాంకర్ దత్తా ఇటీవల వ్యాఖ్యానించారు. మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గించడం వలన నేరస్థులలో నేరాలు చేయడంలో భయం లేకుండా పోతున్నదనీ, అత్యంత అరుదుగా మాత్రమే మరణశిక్ష విధించాలని సుప్రీంకోర్ట్ నిర్ణయించినప్పటి పరిస్థితులు ప్రస్తుత సమాజంలో లేవనీ కూడా అన్నారు.
1980లో ‘బచ్చన్ సింగ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం’ కేసులో మొట్టమొదటి సారిగా చాలా చాలా అరుదైన సందర్భాల్లోనే మరణ శిక్ష విధించాలని సుప్రీంకోర్ట్ నిర్ణయించింది. 1983లో త్రిసభ్య ధర్మాసనం ‘మచ్చీ సింగ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం’ కేసులో అదే నియమాన్ని తిరిగి పునరుద్ఘాటించి మరణ శిక్షకు బదులు యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని నిర్ణయించింది. అప్పటి నుండి ఎన్నో కేసులలో క్రిమినల్ న్యాయస్థానాలు మరణ శిక్ష బదులు యావజ్జీవ కారాగార శిక్ష విధించాయి.
మరణ శిక్ష విధించిన కేసులలో, సుప్రీంకోర్ట్ వాటిని యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గించింది. 1973లో ‘జగ్మోహన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్’ కేసులో, మరణ శిక్ష రాజ్యాంగ బద్ధమేనని తీర్పునిచ్చింది. అయితే, ఆ తరువాత, ఈ ‘ప్రత్యేక’ లేక ‘అరుదు’ నియమాన్ని సూత్రీకరించింది. ఉదాహర ణకు, ఒక కేసులో, ఒక మైనర్ బాలికను మానభంగం చేసి, సాక్ష్యం లేకుండా చేయడానికి ఆ బాలిక కనుగుడ్లు పెరికి, మొహం గుర్తు పట్టనంతగా పచ్చడి చేసి, నాలుకను చీల్చి, చెవులు ముక్కు నుంచి రక్తం కారేలా హత్య చేసిన పరిస్థితుల్లో... ఈ ‘అరుదు’ నియమాన్ని వర్తింపచేయవచ్చని పేర్కొంది.
న్యాయస్థానం ఏదైనా కేసులో ఎవరికైనా మరణ శిక్ష విధించాలని నిర్ణయించితే, ఆ నిర్ణయానికి రావడానికి గల ప్రత్యేక కారణా లను కూడా తమ తీర్పులో వెల్లడించాలని ‘భారతీయ నాగరిక సురక్ష సంహిత– 2023’లోని సెక్షన్ 393 (3) నిర్దేశిస్తుంది. 16 రకాల నేరాలకు మరణ శిక్షను భారత న్యాయ సంహిత– 2023 నిర్దేశించింది. ఇది కాక, టెర్రరిజంను కట్టడి చేసే చట్టాలు, మాదక ద్రవ్య నిరోధక చట్టాల అతిక్రమణలకు కూడా మరణశిక్ష విధించవచ్చు.
లా కమిషన్ల సిఫార్సులు
పలు దేశాలు మరణశిక్షను రద్దు చేశాయి. మరణశిక్ష ఇంకా అమలులోఉన్న 78 దేశాలలో మనదేశం ఒకటి. ‘లా కమిషన్’ తన 35వ నివేదికలో (1967) మరణశిక్ష ను కొనసాగించాలని సిఫారసు చేసింది. 2003లో సమర్పించిన 187వ నివేదికలో, మరణశిక్షను విధించడానికి ఉరి బదులు విషపు ఇంజెక్షన్ ఇవ్వాలని సూచించింది. 2015లో సమర్పించిన నివేదికలో, ఉగ్రవాద సంబంధిత నేరాలకు తప్ప, మరణశిక్షను రద్దు చేయాలని ‘లా కమిషన్’ సూచించింది.
ఈ నివేదిక ప్రకారం, నేరం చేయకుండా మరణశిక్ష నిలువరించలేదని, మరణశిక్ష నేరస్థులకు భయం కలిగించలేదని, ప్రస్తుతం నేర పరిశో ధన శాస్త్రీయంగా లేదని, పేదవారికి న్యాయ సహాయం కోర్ట్‌లో విచా రణ సమయంలో సరిగ్గా లభించుటలేదు కాబట్టి న్యాయస్థానాల తీర్పులలో దోషాలుండే అవకాశం లేకపోలేదని, మరణ శిక్షను రద్దు చేయడానికి గల కారణాలుగా కమిషన్ పేర్కొంది. ఇప్పటి వరకు మరణశిక్షకు గురైనవారందరూ దాదాపుగా పేదవారేనని కమిషన్ పేర్కొనడం గమనార్హం.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 755 మందికి ఉరి శిక్ష పడిందని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, ఢిల్లీ వారి పరిశోధనలో తేలింది. ప్రస్తుతం, దాదాపు 500 మంది మరణ శిక్ష అమలుకాని ఖైదీలున్నారు. 2020 మార్చ్ నెలలో నిర్బయ కేసులో నేరస్థులు నలుగురిని ఉరి తీసినా, మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉండటం గమనార్హం. సుప్రీంకోర్ట్ వ్యాఖ్యా నాలలో కొంత నిజమున్నా, మరణశిక్ష రద్దు చేసే బదులు, సుప్రీం కోర్టే ఏర్పరచిన ‘ప్రత్యేక’ లేక అరుదైన కేసులలోనే మరణశిక్ష విధించాలన్న నియమం సహేతుకం.
– హరీశ్ కుమార్ కొలిచాల, విశ్రాంత అసిస్టెంట్ జనరల్ మేనేజర్(లా), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


