15 రోజుల్లో 1 కోటి మంది లక్ష్యం
న్యూఢిల్లీ: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించింది. ‘హిందూ హిత చింతక్’పేరుతో, ‘అబ్కీ బార్–ఏక్ కరోడ్ పార్’నినాదంతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీహెచ్‌పీ కేంద్ర జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ గురుగ్రామ్‌లో ప్రారంభించారు. సామాజిక సామరస్యాన్ని పెంపొందించడం, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం, సంస్థ భావజాలం, కార్యకలాపాల గురించి యువతకు అవగాహన కల్పించడం ప్రతిమూడేళ్లకోసారి జరిగే ఈ ప్రచార కార్యక్రమం ముఖ్య లక్ష్యాలని జైన్ తెలిపారు.
15 రోజుల కార్యక్రమంలో 1కోటి మందిని సభ్యులుగా చేర్చాలని వీహెచ్‌పీ లక్ష్యంగా పెట్టుకుంది. దేవాలయాలు, దుకాణాలు, మార్కెట్లు, వాణిజ్య సంస్థలతోపాటు ఇంటింటికీ వీహెచ్‌పీ కార్యకర్తలు వెళ్లి సభ్యత్వ నమోదు చేయనున్నారు. సాధారణ ప్రజలను కూడా చేరి్పంచే లక్ష్యంతో సభ్యత్వ రుసుము రూ. 20గా నిర్ణయించారు. ఆన్‌లైన్ డిజిటల్ చెల్లింపుల కోసం ప్రత్యేక అప్లికేషన్‌ను కూడా రూపొందించారు. మొదటి రోజునే దేశవ్యాప్తంగా వేలాది మంది నమోదు చేసుకున్నారని జైన్ వెల్లడించారు.


