యూపీలో బీజేపీని ఓడించాలని వాళ్లకి లేదు  | SP-Congress not serious about defeating BJP in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యూపీలో బీజేపీని ఓడించాలని వాళ్లకి లేదు 

Nov 23 2026 4:21 AM | Updated on Nov 23 2026 4:21 AM

SP-Congress not serious about defeating BJP in Uttar Pradesh

కాంగ్రెస్, ఎస్‌పీ నేతలపై ఏఎస్‌పీ (కాన్షీ రాం) చీఫ్‌ ఆజాద్‌ వ్యాఖ్య 

తమ కూటమితో పొత్తు కోసం ఆ పార్టీలను ఆహ్వానిస్తున్నామని వెల్లడి 

మాయావతికి ప్రజాదరణ తగ్గిపోయిందని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: 2027లో జరిగే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ), కాంగ్రెస్‌లకు బీజేపీని ఓడించాలన్న చిత్తశుద్ధి లేనేలేదని ఆజాద్‌ సమాజ్‌ పార్టీ(కాన్షీ రాం) చీఫ్, ఎంపీ చంద్ర శేఖర్‌ ఆజాద్‌ ఆరోపించారు. అధికార బీజేపీని కలిసి కట్టుగా ఓడించేందుకు ఎంఐఎంతో కలిసి తాము ఏర్పాటు చేసుకున్న ‘సామాజిక్‌ పరివర్తన్‌ మోర్చా’తో పొత్తుకు ఎస్‌పీ, కాంగ్రెస్‌లకు తలుపులు తెరిచే ఉంటాయని ఆయన వెల్లడించారు. అదేవిధంగా, మాయావతి సారథ్యంలోని బీఎస్‌పీకి జనాదరణ తగ్గుతుండగా, తమ పార్టీకి మాత్రం మద్దతు క్రమేపీ పెరుగుతూ వస్తోందని తెలిపారు.

 ‘2007లో ఆ పార్టీ ఓట్‌ షేర్‌ 30 శాతం కాగా, నేడు 9 శాతానికి పడిపోయింది. బీఎస్‌పీకి చట్ట సభల్లో ప్రాతినిథ్యం లేనేలేదు. ఆ పార్టీ ప్రజల్లో పట్టుకోల్పోయిందనేందుకు ఇదే తార్కాణం’అని వివరించారు. ఆదివారం చంద్ర శేఖర్‌ ఆజాద్‌ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ఈ నెల 26వ తేదీన లక్నోలో తమ కూటమి ‘సామాజిక్‌ పరివర్తన్‌ మోర్చా’నిర్వహించే ర్యాలీతో ఏఎస్‌పీ–ఎంఐఎం సత్తా ఏమిటో నిరూపిస్తామని ఆయన ప్రకటించారు. బీజేపీని ఓడించే సామర్థ్యం తమకు ఉందని రుజువు చేస్తామని చెప్పారు. 

ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఎస్‌పీ–కాంగ్రెస్‌ 
‘యూపీలో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలతో ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేద్దామంటూ మేం అన్ని పార్టీలనూ సంప్రదించాం. బాధ్యత కలిగిన నేతలకు సందేశాలు పంపించాం. ప్రతి సందర్భంలోనూ ఇదే విషయాన్ని, మీడియా ద్వారా వెల్లడిస్తూ వస్తున్నాం. స్పందన మాత్రం శూన్యం. అంటే, ప్రతిపక్ష పార్టీలకు బీజేపీని ఓడించాలనే చిత్తశుద్ధి లేదని భావించాం. ఇప్పటికే ఉన్న కూట ములు 2019, 2024లోనూ బీజేపీని ఓడించలేకపోయాయి. అందుకే, బీజేపీని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో వేరు కూటమిని ఏర్పా టు చేయాలని నిర్ణయించుకున్నాం’అని ఆజా ద్‌ తెలిపారు.

 ‘బీజేపీని ఓడించాలంటే ఎక్కువ సంఖ్యలో ఓట్లను చీల్చాలి. అంటే, పెద్ద కూటమిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సరిగ్గా ప్రజల ఆకాంక్ష కూడా ఇదే. అయితే, ఆ పార్టీలు కమలదళాన్ని మట్టికరిపించాలని నిజంగా కోరుకోవడం లేదు. బీజేపీపై ప్రజలకు విసుగు వచ్చినప్పుడు తాము అధికారంలోకి రావాలని మాత్రమే వీరు కోరుకుంటున్నారు. ఈ రెండు పార్టీలు బలహీన వర్గాలు, నిరుపేదలపై జరిగే అఘాయిత్యాలను ఆపాలనుకోవడం లేదు’అని ఆజాద్‌ పేర్కొన్నారు. ‘ఆ పార్టీలు కూడా మాతో కలిసి వచ్చిన పక్షంలో, ఆటోమేటిక్‌గా ప్రజలు కూడా ఏకమవుతారు, అప్పుడిక బీజేపీ ఓటమి తథ్యం’అని ఆయన అన్నారు.

బీజేపీ బీ టీమ్‌ కాంగ్రెస్సే 
ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి చెందిన ఎంఐఎంతో తమ పార్టీ పొత్తును ‘బీజేపీ బీ టీమ్‌’గా కాంగ్రెస్‌ నేతలు అభివర్ణించడంపై ఆజాద్‌ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలకు పాల్పడే వారికి ప్రజలు తగు రీతిలో సమాధానం చెబుతారన్నారు. దేశంలోని పౌరులందరికీ ఎన్నికల్లో పోటీ చేసే అధికారం రాజ్యాంగం కల్పిస్తోందని ఆయన స్పష్టం చేశారు. 2022లో యూపీలో కాంగ్రెస్‌ పార్టీ ఎస్‌పీకి వ్యతిరేకంగా 399 సీట్లలో పోటీకి దిగింది.

 కనీసం 300 సీట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులకు డిపాజిట్లు సైతం గల్లంతయ్యాయి. ఆ పార్టీని బీ టీమ్‌ అనాలా లేక ఏ టీమ్‌ అనాలా?. ఆ పార్టీ నేతలే బదులివ్వాలి. ముస్లింను యూపీ సీఎం అభ్యరి్థగా ప్రకటించాలంటూ కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారు. యూపీలో 30 ఏళ్ల ఏలుబడిలో కాంగ్రెస్‌ పార్టీ ఎందరు ముస్లింలు, బీసీలు, దళితులను సీఎంలుగా చేసింది? మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలోనూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎస్‌పీ పదుల సంఖ్యలో పోటీకి దిగింది. దీన్నేమనాలి?’అంటూ ఆజాద్‌ నిప్పులు చెరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement