అరుణాచల్‌ప్రదేశ్ ప్రగతి కోసం కేంద్రం శ్రమిస్తోంది
కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడి
ఈటానగర్: ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, తగినంత ఆర్థిక సహాయం అందించలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అరుణాచల్‌ప్రదేశ్ ప్రగతి శ్రమిస్తోందని, నిధుల కేటాయింపులను గణనీయంగా పెంచిందని పేర్కొన్నారు. ఆదివారం అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఈటా నగర్‌లో రాష్ట్ర సహకార శాఖ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
2004 నుంచి 2014 వరకు యూపీఏ పాలనలో కేంద్ర ప్రభుత్వం అరుణాచల్‌ప్రదేశ్‌కు రూ.33,530 కోట్లు అందజేసిందని, 2014 నుంచి 2024 వరకు ఎన్డీఏ ప్రభుత్వం రూ.1,64,664 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. రాష్ట్రానికి పన్ను వాటాల బదిలీ నాలుగు రెట్లు పెరిగిందని, గ్రాంట్లు 18 రెట్లు పెరిగాయని చెప్పారు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఈ గణాంకాలు నిదర్శనమని స్పష్టంచేశారు. అరుణాచల్‌ప్రదేశ్ బడ్జెట్ రూ.12,000 కోట్ల నుండి రూ.36,000 కోట్లకు పెరిగిందని, గత 12 ఏళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధికి ఇదొక సూచిక అన్నారు.
అవి ‘దేశపు మొదటి గ్రామాలు’
‘వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్’గురించి అమిత్ షా ప్రస్తావించారు. దేశ సరిహద్దు గ్రామాలను ‘దేశపు చివరి గ్రామాలు’అని కాకుండా ‘దేశపు మొదటి గ్రామాలు’గా పరిగణించడం ద్వారా వాటి పట్ల ఉన్న దృక్పథాన్ని ప్రధానమంత్రి మార్చేశారని చెప్పారు. దేశ అభివృద్ధి సరిహద్దుల నుండే ప్రారంభం కావాలని, అక్కడ నివసించే ప్రజలకు అన్ని ప్రాథమిక సౌకర్యాలు, జీవనోపాధి అవకాశాలు లభించాలని తేల్చిచెప్పారు.
సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్, పాఠశాలలు, మౌలిక సదుపాయాలు, ఉపాధికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని వివరించారు. మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా ఈశాన్య ప్రాంతంలో అనుసంధానం, అభివృద్ధి పరంగా పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయని, తద్వారా ఈ ప్రాంతానికి, దేశ రాజధానికి మధ్య దూరం గణనీయంగా తగ్గిందని స్పష్టంచేశారు. ఈశాన్యంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో ఇప్పుడు మెరుగైన రోడ్డు, రైలు, విమాన కనెక్టివిటీ ఉందని చెప్పారు. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల రంగంలో అపూర్వమైన విస్తరణ జరిగిందని, ఇది ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన విజయాల్లో ఒకటిగా అమిత్ షా అభివర్ణించారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్ బెటాలియన్ క్యాంపస్ ప్రారంభం
విపత్తుల నిర్వహణ కోసం ప్రభుత్వం ‘జీరో–క్యాజువాలిటీ’విధానాన్ని అనుసరిస్తోందని అమిత్ షా చెప్పారు. దీని కింద విపత్తుల సమయంలో బలహీన వర్గాల ప్రజలను సురక్షిత పప్రాంతాలకు రక్షించడానికి సకాలంలో హెచ్చరికలు, తక్షణ తరలింపు చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆదివారం ఈటా నగర్ సమీపంలోని హోలోంగిలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్((ఎన్‌డీఆర్‌ఎఫ్) 12వ బెటాలియన్ క్యాంపస్‌ను అమిత్ ప్రారంభించారు. దేశంలో ప్రకృతి వైపరీత్యాలు అధికంగా సంభవించే ఈశాన్య ప్రాంతం అంతటా ఇది విపత్తు సంసిద్ధత, ప్రతిస్పందనను గణనీయంగా బలోపేతం చేస్తుందని వెల్లడించారు.


