ఒంగోలు: మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీడీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఎంఈఓ–2 రమాదేవిని, మళ్లీ తూర్పు చౌటపాలెం నామినేషన్ కేంద్రంలో స్టేజ్–1 రిటర్నింగ్ అధికారిగా నియమించడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల దర్శి నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ బాలికల హైసూ్కల్ నామినేషన్ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణలో ఆమె తీవ్ర జాప్యం చేశారని, ప్రతిపక్ష నేతలు కేంద్రానికి వచ్చిన సమాచారాన్ని టీడీపీ నేతలకు ఫోన్‌లో చేరవేసి దాడులకు పరోక్షంగా కారణమయ్యారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
అలాంటి వివాదాస్పద అధికారికి మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించడంపై ప్రతిపక్ష శ్రేణులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దర్శి మండలంలోని కొన్ని పంచాయతీల్లో సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు, సీనియర్ టీచర్లను కాదని.. సర్వీసు, క్యాడర్‌లో జూనియర్లు అయిన ఎస్జీటీలను స్టేజ్–2 అధికారులుగా నియమించేలా ఆమె ఎంపీడీవోపై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నియామకాల్లో అధికార కూటమి పార్టీ మద్దతుగా నిలుస్తున్న ప్రధాన కులాల వారికే ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలపై అధికారులు నోరు మెదపడం లేదు. దీనికి తోడు, తూర్పు చౌటపాలెం కేంద్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ నేతలు తలుపులు వేసి అడ్డుకున్నప్పటికీ, అధికారిగా ఆమె ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఫిర్యాదు చేయకుండా మౌనం వహించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. వరుస వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో సంబంధిత అధికారిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: మమ్మల్ని బిచ్చగాళ్లుగా చూస్తారా?


