విశాఖ సమ్మిట్‌.. బాబు, లోకేశ్‌ హడావుడి తప్ప ఒరిగిందేమిటి? | KSR Commntes On Chandrababu Visakhapatnam CII Summit | Sakshi
Sakshi News home page

విశాఖ సమ్మిట్‌.. బాబు, లోకేశ్‌ హడావుడి తప్ప ఒరిగిందేమిటి?

Nov 19 2026 11:00 AM | Updated on Nov 19 2026 11:26 AM

KSR Commntes On Chandrababu Visakhapatnam CII Summit

విశాఖపట్నంలో జరిగింది పార్టనర్ షిప్ సమ్మిట్టా? లేక పబ్లిసిటీ సమ్మిట్టా? పారిశ్రామిక పెట్టుబడుల రక్షణకు చట్టం తీసుకువస్తామంటే అందులో స్కాములకు తెరలేచినట్లా? కాదా? ఇలాంటి సందేహాలు ఎన్నిటికో ఆస్కారం ఇచ్చే విధంగా విశాఖ భాగస్వామ్య సదస్సు జరిగిందన్న అబిప్రాయం ఎక్కువ మందిలో ఏర్పడింది. పెట్టుబడిదారుల ఒప్పందాల కన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ ల ఇంటర్వ్యూలకు, పాడ్ కాస్ట్ లకే అధిక ప్రచారం వచ్చేలా చేసుకున్నట్లు అనిపిస్తుంది.. వీరిద్దరూ గొప్పలు, అతిశయోక్తులు చెప్పుకోవడానికే సహజంగానే  ప్రాధాన్యం ఇచ్చారు.  పరిశ్రమల మంత్రితో సహా మిగిలిన మంత్రులంతా నామమాత్రంగానే మిగిలిపోయారన్న భావన సర్వత్రా  ఏర్పడింది పెట్టుబడి ప్రతిపాదనలపై వచ్చిన విశ్లేషణలు చూస్తే వీటిలో ఎంత డొల్లతనం ఉందో తెలిసిపోతుంది. 

ఈ  మూడేళ్లలో 32 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై ఒప్పందాలు చేసుకున్నట్లు గొప్పలు పోయారు. అసలు దేశం అంతా కలిపి ఈ మేరకు పెట్టుబడులు వచ్చాయా అని కొంతమంది అనుభవజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఆ స్థాయిలో పరిశ్రమలు వచ్చి ఉంటే ఎపిలో ఇక పెట్టుబడుల అవసరమే ఉండకపోవచ్చేమో అని వ్యంగ్య వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇదంతా నిరుద్యోగ భృతి హామీని ఎగవేసిన విషయం కప్పిపుచ్చుకోవడానికే అన్న విమర్శలు ఉన్నాయి.   గత సంవత్సరం నిర్వహించిన సదస్సులో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా 16 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. నిజంగా అందులో సగం కార్యరూపం దాల్చినా, ఓ ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినా  సంతోషించవచ్చు. గత ఏడాది సదస్సు ఎమ్.ఓ.యుల గురించి, వాటి కార్యాచరణ గురించి  వాస్తవ పత్రం ఇచ్చి ఉంటే ప్రభుత్వంపై సదబిప్రాయం కలిగేది. 

పారిశ్రామికవేత్తలకు కూడా నమ్మకం పెరిగేది. ఇలాంటి సదస్సులకు రావాలని పెట్టుబడిదారులను ప్రభుత్వపరంగా పిలుస్తుంటారు. వారు హాజరుకావాలని రకరకాలుగా ఒత్తిడి చేస్తుంటారు. దాంతో కొన్ని కంపెనీలవారు తమ వద్ద పనిచేసే చిన్నస్తాయి అధికారులను సమ్మిట్ కు పంపి ఒప్పందాల డ్రామా నడిపి  మమ అనిపిస్తుంటారు. వాటన్నిటిని లెక్కల్లో వేసి ఊదరగొట్టేస్తే సరిపోతుందన్న భావనతో ప్రభుత్వ వర్గాలు పనిచేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు సర్కారుకు ఇందులో అపార అనుభవం ఉంది. 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కాని, 2024 లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాని సదస్సుల తీరుతెన్నులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా బోధపడుతుంది.సదస్సు జరిగినప్పుడల్లా లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు ప్రొజెక్టు చేస్తుంటారు. కాని తదుపరి ఆచరణలో పెద్దగా కనిపించదు. 

ఉదాహరణకు 2014 టరమ్ లో ఓ నాలుగైదు కంపెనీలు కలిపి సుమారు మూడు  లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు సదస్సులలో తెలిపారు.కాని అవి ఇంతవరకు ఒక్క నయాపైసా పెట్టలేదు.  అప్పట్లో కొందరు టిడిపి కార్యకర్తలను కూడా పారిశ్రామికవేత్తలుగా చూపుతూ ప్రచారం చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది సదస్సులో పాల్గొన్న సంస్థలలో అనేకం ఈసారి కూడా పాల్గొని కధ నడిపించాయట. అంతేకాక ఈసారి విద్యార్ధులను తీసుకువచ్చి వారిని పెట్టుబడిదారుల కింద సభలో కూర్చోపెట్టారన్న వార్తలు విస్తృతంగానే కనిపించాయి. ఇక ప్రభుత్వం డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్స్ ర్ల హడావుడి ఉండనే ఉంది. రీల్స, షార్ట్స్  చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు.వీటన్నిటివల్ల ఈ సదస్సు సీరియస్ నెస్ తగ్గిందన్న అబిప్రాయం కలుగుతుంది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా సదస్సుకు హాజరు అవుతారనుకుంటే ఆయన రాకపోవడంతో కళ తప్పినట్లయింది. రిలయన్స్ అంబానీ, ఆదాని, ఆదిత్య బిర్లా వంటి దిగ్గజాలు కనిపించకపోవడం కూడా గమనించదగిందే. కాగా గత జగన్ ప్రభుత్వ టైమ్ లో నిర్మాణం చేపట్టిన పోర్డులు, ఫిషింగ్ హార్బర్లు  వంటివాటి గురించే ముఖ్యనేతలు చెప్పుకోవడం విశేషం.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ లు తమ ప్రసంగాలలో పెట్టుబడిదారుల పెట్టుబడికి రక్షణ కల్పించే చట్టం తీసుకువస్తామని,కేంద్రం కూడా దీనిని ఆమోదించాలని కోరారు. విశాఖలో అత్యంత విలువైన భూములను 99 సైసలకే ఇచ్చివేస్తూ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. మంత్రి లోకేష్ అదంతా తన ఇష్టం అన్నట్లు గతంలో మాట్లాడారు. అలా 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు పొందినవారు ఎన్ని పరిశ్రమలు ఇంతవరకు పెట్టారో తెలియదు. 

కాని ఇందులో భారీ స్కామ్ లు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం మారినా ఈ స్కామ్ లు బయట పడకుండా ఉండడానికే ఇలాంటి చట్టం తెస్తామంటున్నారని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే టైమ్ లో వచ్చే 2029లో టిడిపి కూటమి ప్రభుత్వం రాదేమో అన్న అనుమానం కూడా టిడిపి అధినాయకత్వంలో ఉండి  ఉండవచ్చన్న విశ్లేషణలు వచ్చాయి.ఇక్కడ విషయం ఏమిటంటే ప్రభుత్వం పెట్టుబడులకు రక్షణ కల్పించాలని మాత్రమే ఎందుకు అనుకుంటున్నది? కొందరు పెట్టుబడిదారులు ప్రభుత్వం నుంచి భూములు, ఇతర రాయీతీలు పొంది ,తగు రీతిలో పరిశ్రమలు నడపడం లేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేస్తున్నారు. వీరిలో  అడ్డగోలుగా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నవారు కూడా ఉండవచ్చు. మరి అలాంటివారికి కూడా ఈ విధమైన రక్షణ కల్పిస్తే అర్ధం ఉంటుందా? అన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వం నిజమైన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం తప్పుకాదు. 

అది ఎప్పటినుంచో జరుగుతున్నదే. కాని ఆ ముసుగులో రాజకీయ నేతలు తమ బినామీలను రంగంలో దించుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇదే టైమ్ లో ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల రక్షణకు ఎందుకు ఇలాంటి చట్టం తీసుకు రావడం లేదన్న  ప్రశ్న వస్తుంది. హామీలు అమలు చేయకపోయినా, అన్నీ చేసేశామని అబద్దాలు చెప్పే నేతల నుంచి ప్రజలకు భద్రత కల్పించడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారని కొందరు మేధావులు  ప్రశ్నిస్తున్నారు. ఈ సమ్మిట్ జరుగుతున్న టైమ్ లోనే చిత్తూరులో  విద్యార్ధుల ఆందోళన చెలరేగింది. ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. దీనికి కారణం ఫీజులు చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి చేయడమే. 

ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా?ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు సుమారు ఐదువేల కోట్లపైనే ఉన్నాయని అంచనా. దానికి ప్రభుత్వం ఎందుకు భ్రద్రత కల్పించలేకపోతోంది? రైతులు, రైతు కార్మికులకు భద్రతపై ఆలోచించని ప్రభుత్వం, పెట్టుబడిదారుల గురించి మాత్రం చెబుతోందని సిపిఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఎద్దేవ చేశారు.అసలు  ఇలాంటి చట్టం తీసుకు రావడం సాద్యమా?కాదో తెలియదు కాని ఇకనుంచి నిత్యం దీనిపై ప్రచారం మాత్రం జోరుగా సాగుతుందని చెప్పవచ్చు.మొత్తం మీద ఈ సమ్మిట్ రియాల్టి షోగా సాగినట్లుగానే కనిపిస్తుంది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement