మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా  | USA airstrikes hit IRGC targets inside Iran, including a wedding home | Sakshi
Sakshi News home page

మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా 

Sep 3 2026 5:17 AM | Updated on Sep 3 2026 5:44 AM

USA airstrikes hit IRGC targets inside Iran, including a wedding home

ఇరాన్‌పై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించిన అమెరికా  

12 మంది మృతి.. 68 మందికి గాయాలు  

పెళ్లి వేడుకపై దాడిలో నాలుగేళ్ల చిన్నారి సహా నలుగురి మృతి 

తక్షణమే ఇరాన్‌ ప్రతీకార చర్యలు

బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్‌లోని  అమెరికా స్థావరాలపై దాడులు  

దుబాయ్‌/టెహ్రాన్‌:  పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెచ్చరిల్లాయి. ఇరుపక్షాల మధ్య మళ్లీ దాడులు, ప్రతిదాడులు మొదలయ్యాయి. మంగళవారం ఇరాన్‌లో ఓ పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటితో సహా పలు లక్ష్యాలపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. పెళ్లి జరుగుతున్న ఇంటిలో నాలుగేళ్ల చిన్నారి సహా కనీసం నలుగురు మరణించారని, పదుల సంఖ్యలో జనం గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. 

అమెరికా దాడుల్లో మొత్తం 12 మంది మృతిచెందారని పేర్కొన్నారు. మరో 68 మంది గాయపడ్డారని ఇరాన్‌ మీడియా తెలియజేసింది. అమెరికా సైన్యం ప్రధానంగా ఇరాన్‌ దక్షిణ తీరాన్ని టార్గెట్‌ చేసింది. అమెరికా దుశ్చర్య పట్ల ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. వెంటనే ప్రతీకార చర్యలకు దిగింది. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మంగళవారం రాత్రి క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అమెరికా, ఇరాన్‌ మధ్య ఈ స్థాయిలో ఉద్రిక్తతలు పెరగడం జూలై తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం.  

అమెరికా జవాన్లను తరిమికొడతాం  
ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్‌ వ్యవస్థలు, మారిటైమ్‌ మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్‌ కేంద్రాలపై దాడులు చేశామని అమెరికా సైన్యం ప్రకటించింది. హార్మూజ్‌ జలసంధి సమీపంలోనూ అమెరికా దాడులకు పాల్పడినట్లు ఇరాన్‌ ఆరోపించింది. అమెరికాకు బుద్ధి చెప్పడానికి బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్, ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ప్రతి దాడులు చేశామని పేర్కొంది. పశ్చిమాసియా నుంచి అమెరికా సైనికులను తరిమికొట్టడమే తమ ధ్యేయమని తేలి్చచెప్పారు. పరాయి దేశం సైనిక స్థావరాలు ఇక్కడ ఉండడానికి వీల్లేదని స్పష్టంచేసింది. 

ఈ ప్రాంతంలో అమెరికాకు ఆశ్రయం ఇచ్చే దేశాలు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. జోర్డాన్‌తోపాటు ఉత్తర ఇరాక్‌లో తమ దాడుల్లో పలువురు అమెరికా జవాన్లు మరణించారని ఇరాన్‌ మిలటరీ కమాండ్‌ ప్రకటించింది. అయితే, దీన్ని అమెరికా సైన్యం ఖండించింది. తమకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఇరాన్‌ డ్రోన్లను మధ్యలోనే కూల్చివేశామని బహ్రెయిన్‌లోని అమెరికా నావికాదళం వెల్లడించింది. హార్మూజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలపై, ఆ ప్రాంతంలోని అమెరికా సైనికులపై దాడి చేయడానికి ఇరాన్‌ ప్రయతి్నంచిన నేపథ్యంలోనే తాము రంగంలోకి దిగాల్సి వచి్చందని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ స్పష్టంచేసింది.  

ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరిక  
ఇరాన్‌ గనక ప్రతీకార చర్యకు దిగితే తమ ప్రతిస్పందన భీకర స్థాయిలో ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌ ద్వారా హెచ్చరించారు. ‘‘ఇరాన్‌ మరింత తీవ్రంగా, భారీ స్థాయిలో మళ్లీ దాడి జరుగుతుంది. కానీ, అది అన్నింటికంటే పెద్ద దాడి మాత్రం కాదు. అసలైన అతిపెద్ద దాడి ఇంకా జరగాల్సి ఉంది’’అని పేర్కొన్నారు. పశ్చిమాసియా మళ్లీ అగి్నగుండంగా మారుతుండడంతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. పశ్చిమాసియా ప్రాంతం అంతటా వర్తించే ప్రయాణ హెచ్చరికను పునరుద్ధరించింది. అక్కడ పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయని, ఊహించని పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలియజేసింది. పశ్చిమాసియాలో అమెరికన్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement