పొంచి ఉన్న వరద ముప్పు
ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న మూడు నదులు
1,243కు పెరిగిన మృతుల సంఖ్య
ఏకంగా 4,216 మంది జాడ గల్లంతు
కఠ్మాండు: మెరుపు వరద బురదతో జలమయమైన నేపాల్ దిగువ ప్రాంతాలపై మళ్లీ వరద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు స్థానికుల కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. కనీవినీ ఎరుగని జల ప్రళయం దాటికి ఇప్పటికే దిగువ ప్రాంతాల్లో జనజీవనం కకావికలంకాగా మరోసారి అపార జలరాశి వరదరూపంలో వచ్చి పడే ఆస్కారముందని నేపాల్ వాతావరణ శాఖలోని వరద అంచనాల విభాగం బుధవారం హెచ్చరికలు జారీచేసింది.
సింధూరి జిల్లాలో సున్ కోశి నది, గూర్ఖా జిల్లాలో బుధి గండకీ నది, దదేల్‌ధురా జిల్లాలో మహాకాళీ నది, లామ్‌జుంగ్ జిలాల్లో మార్షా్యంగ్డి నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నట్లు వరద అంచనాల విభాగం ప్రకటించింది. దిగువ ప్రాంతాల ప్రజలు జనావాసాల నుంచి ఎగువ ప్రాంతాలకు తరలిపోవాలని సూచనలుచేసింది. భుకుందేబేసీ వాటర్ లెవల్ మానిటరింగ్ కేంద్రంలో మంగళవారం రాత్రి 11.15 గంటలకే నది డేంజర్ మార్క్‌ను దాటేసింది. మార్షా్యంగ్డి నదిలో నీటి ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది.
మరోవైపు ఇప్పటికే వినాశనం సృష్టించిన వరద విలయంలో మృత్యువాత పడిన వారి సంఖ్య బుధవారానికి 1243కు పెరిగింది. మరో 4,216 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉంది. భారీ వర్షం, బురద మధ్యే భవన శిథిలాల్లో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనని ఆశతో అన్వేషణ బృందాలు కాలంతో పోటీపడుతూ సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి.
1,113 మృతదేహాల గుర్తింపు, చట్టపర ప్రక్రియ పూర్తయిందని, 95 మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. 21,314 మంది సైనికులు, పోలీసులు, వలంటీర్లు ఈ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే రాసువా, నువాకోట్‌లో కురుస్తున్న భారీ వర్షం సహాయక కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కల్గిస్తోంది. వర్షపు నీరు చేరుతుండటంతో జలవిద్యుత్‌కేంద్ర సొరంగంలో అన్వేషణ ఆగిపోయిందని జాతీయ విపత్తు ముప్పు తగ్గింపు, నిర్వహణ సంస్థ తెలిపింది. భూగర్భ జలవిద్యుత్ కేంద్రాల సొరంగాల్లో అన్వేషణకు భారత్, చైనా, ద.కొరియా నిపుణుల బృందాలు కృషిచేస్తున్నాయి.
వాతావరణ మార్పులతోనే దారుణం: ప్రధాని
సంపన్న దేశాలు వాతావరణంలోకి భారీగా విడుదలచేస్తున్న కర్భన ఉద్గారాలు, వాతావరణ మార్పుల కారణంగానే హిమానీనదాలు అమిత వేగంగా కరిగిపోతూ కొత్త ఉత్పాతాలను తీసుకొస్తున్నాయని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఆరోపించారు. బుధవారం నేపాల్ పార్లమెంట్ దిగువ సభలో ఆయన మాట్లాడారు. ‘‘భోటె కోశీలో వరద రావడానికి ప్రత్యక్షంగా వాతావరణమార్పులు(క్లైమేట్ చేంజ్) కారణమని నిపుణులు తేల్చేశారు.
అంతర్జాతీయ సమాజానికి మేం చెప్పేదొక్కటే. మేం అనుభవిస్తున్న ఈ బాధలకు వాతావరణ మార్పులే కారణం.ప్రపంచ దేశాలతో పోలిస్తే నేపాల్ గ్రీన్‌హౌస్ వాయువులను అత్యల్పంగా విడుదలచేస్తుంది. కానీ ఇతర దేశాలు చేసిన పాపాలకు మేం బలవుతున్నాం’అని అన్నారు. ఆపన్న హస్తం అందిస్తున్న భారత్‌కు ప్రధాని బాలేంద్ర కృతజ్ఞతలు తెలిపారు.
కాఠ్మండులో సోనూ సూద్ సాయం
కోవిడ్ సంక్షోభం వేళ భారీ సంఖ్యలో కరోనా బాధితులను ఆదుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారత చాటారు. కాఠ్మండుకు పెద్ద మొత్తంలో సహాయక సామగ్రిని తీసుకెళ్లి వరద బాధితులకు అందజేశారు. ‘‘ఇక్కడి వాళ్లకు సరిపడా సరకులు, ఆహారం, దుప్పట్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వరదతో సర్వం కోల్పోయిన వాళ్లకు మళ్లీ పాత జీవితాలను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’అని చెప్పారు.


