గదులు...గందరగోళం! | No accommodation for athletes in asian games 2026 | Sakshi
Sakshi News home page

గదులు...గందరగోళం!

Sep 18 2026 6:25 AM | Updated on Sep 18 2026 6:25 AM

No accommodation for athletes in asian games 2026

ఆసియా క్రీడల్లో కొనసాగుతున్న వసతి సమస్య

నగోయా: అంతా బాగుంది అంటూ ఆసియా క్రీడల్లో ఏర్పాట్లు, వసతి సౌకర్యాలపై గత రెండు రోజులుగా ఆటగాళ్లు, అధికారులు కొంత సంతృప్తి చెందినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే అంతా మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది. ఇరుకైన గదులు, ఇద్దరికే కష్టమైన చోట మూడో వ్యక్తికి చోటు, బయట ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్న అధికారులు... ఇలా అన్ని వైపుల నుంచి సమస్యలు కనిపిస్తున్నాయి. రేపు ఆసియా క్రీడల్లో ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 

ఎంతో గొప్పగా చెప్పుకున్న ‘కోస్టా సెరెనా క్రూజ్‌ షిప్‌’లో వసతి ఏమాత్రం బాగా లేదని ఆటగాళ్లు చెబుతున్నారు. సమన్వయ లోపంతో పురుష, మహిళా ఆటగాళ్లకు కలిపి ఒకే గదిలో వసతి కల్పించినట్లుగా కూడా వినిపిస్తోంది. వీరిలో జపాన్‌ అథ్లెట్లు కూడా ఉండటం విశేషం. ‘కోచ్‌లు, టీమ్‌ అధికారులు, అథ్లెట్లకు కలిపి ఒకే గది ఇచ్చారు. పురుషులు, మహిళలకు కలిపి ఒకే గది ఇస్తూ పది మంది ఆటగాళ్లకు కలిపి ఐదు రూమ్‌లు కేటాయించిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ వాళ్లు అంకె మాత్రమే చూశారు. వాస్తవికంగా చూస్తే ఇలా వాడుకోవడం అసాధ్యం.

 ఎంతో భారీ సామగ్రి ఉండే ట్రైనర్లు, మెడికల్‌ సిబ్బందికి కూడా ఆటగాళ్లతో కలిపి ఇస్తే ఎలా సరిపోతుంది’ అని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు భారత వుషు, రోయింగ్, టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్లు ఇప్పటికే క్రూజ్‌ షిప్‌లోకి చేరుకున్నారు. వారు కూడా తమ సమస్యను చెప్పుకున్నారు. గది కోసం భారత రోయర్లు 12 గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. థాయ్‌లాండ్‌ సెపెక్‌తక్రా ప్లేయర్లయితే గది లభించకపోవడంతో వెల్‌కమ్‌ సెంటర్‌లో నేలపైనే పడుకున్నారు. 

‘ఇద్దరికే కేటాయించాల్సిన ఒక గదిలో ముగ్గురిని పంపించారు. అసలే అవి చిన్నవి కాగా, ఇప్పుడు మరింత సమస్యగా మారింది. తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన అథ్లెట్లను ఇలాంటివి ఇబ్బంది పెడతాయి. అయితే ఇప్పటికిప్పుడు ఫిర్యాదు చేయాలనే ఆలోచన లేదు. వాటికి అనుగుణంగా సర్దుకునే ప్రయత్నం చేస్తున్నాం’ అని భారత క్రీడాకారులు స్పందించారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని భారత చెఫ్‌ డి మిషన్‌ సహదేవ్‌ యాదవ్‌ వివరణ ఇచ్చారు.  

సాధారణంగా ఇలాంటి మెగా ఈవెంట్లలో వసతికి దగ్గర్లోనే ప్రాక్టీస్‌ ఏర్పాట్లు కూడా ఉంటాయి. కానీ నగోయాలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. అథ్లెటిక్స్‌ విలేజ్‌ లేకపోవడంతో 17 వేల మందికి వేర్వేరు చోట్ల వసతి సౌకర్యం కల్పించారు. ఇవన్నీ ప్రాక్టీస్‌ మైదానాలకు చాలా దూరంగా ఉన్నాయి. దాంతో సుదీర్ఘ ప్రయాణం తర్వాతే తమ ప్రాక్టీస్‌ వేదికలకు అథ్లెట్స్‌ వెళ్లగలుగుతున్నారు. ఆటగాళ్లు ఉన్న క్రూజ్‌ షిప్‌ నుంచి రోయర్లు, వుషు, టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్లు 30 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుండగా, మార్షల్‌ ఆర్ట్స్‌ హాల్‌ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరోవైపు ఇప్పటికే బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన కంటెయినర్‌ తరహాలో వసతి గృహాల్లో భారత ఆటగాళ్లు ఉండటానికి ఇష్టపడటం లేదు. ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్, కురా‹Ùవంటి క్రీడాంశాల్లో పాల్గొనే అథ్లెట్ల కోసం ప్రధానంగా ఈ ఏర్పాట్లు ఉండగా...ఒక్క కురాష్‌ ఆటగాళ్లు మాత్రమే కంటెయినర్లలో ఉంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement