నేడు క్వార్టర్ ఫైనల్లో జపాన్‌తో భారత్ ‘ఢీ’
రేపటి నుంచి ఆసియా క్రీడలు
నగోయా: ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ పతక వేటలో నేడు తొలి పోరులో బరిలోకి దిగనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్‌ను ఎదుర్కొంటుంది. ఇటీవలే ఆసియా కప్‌ను గెలుచుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ బృందానికి ఈ మ్యాచ్‌లో గెలుపు నల్లేరు మీద నడకలాంటిదే.
అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న భారత్‌ను నిలువరించడం ప్రత్యరి్థకి అసాధ్యం. మరోవైపు ఏడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి 61 టి20 మ్యాచ్‌ల అనుభవం ఉన్నా... పెద్ద జట్లతో ఎప్పుడూ ఆడని జపాన్ ఈ ఆసియా క్రీడల్లో ఒక్క మ్యాచ్‌లోనైనా ప్రభావం చూపించాలని ఆశగా ఉంది.
2028 లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్ క్రీడలకు సన్నాహకంగా ఈ ఆసియా క్రీడలు పనికొస్తాయని భారత కోచ్ అమోల్ మజుందార్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌తో పెద్దగా పరిచయం లేని జట్లతో కూడా ఆడుతున్న తమకు ఒలింపిక్స్‌లోనూ ఇదే తరహా పరిస్థితులు ఎదురవుతాయని అతను వ్యాఖ్యానించాడు. నేడు జరిగే మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మలేసియాతో శ్రీలంక తలపడుతుంది.
సెమీస్‌లో పాక్, బంగ్లాదేశ్...
ఆసియా క్రీడల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మహిళల జట్లు సెమీస్‌లోకి అడుగు పెట్టాయి. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్‌పై 3 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. బంగ్లాదేశ్, చైనా మధ్య జరిగిన మరో క్వార్టర్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా...ర్యాంకింగ్ ప్రకారం బంగ్లాదేశ్ ముందంజ వేసింది.


