‘వసతి సమస్యే కాదు’  | Athletes got an experience to stay in containers Says Achanta Sharath Kamal | Sakshi
Sakshi News home page

‘వసతి సమస్యే కాదు’ 

Sep 17 2026 6:24 AM | Updated on Sep 17 2026 6:24 AM

Athletes got an experience to stay in containers Says Achanta Sharath Kamal

ఆసియా క్రీడల్లో కంటైనర్లలో ఉండేందుకు భారత అథ్లెట్లు సిద్ధమే

డిప్యూటీ చెఫ్‌ డి మిషన్‌ శరత్‌ కమల్‌ వెల్లడి

న్యూఢిల్లీ: నాలుగేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో సత్తా చాటేందుకు భారత అథ్లెట్లు సిద్ధంగా ఉన్నారని ఏషియన్‌ గేమ్స్‌ డిప్యూటీ చెఫ్‌ డి మిషన్, టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) దిగ్గజం ఆచంట శరత్‌ కమల్‌ వెల్లడించాడు. జపాన్‌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో... అథ్లెట్ల వసతి కోసం కంటైనర్‌లను సిద్ధం చేయగా... దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో శరత్‌ కమల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

కంటైనర్‌ రూమ్‌లు, క్రూయిజ్‌షిప్‌ వసతులకు భారత అథ్లెట్లు సులువుగా అలవాటు పడతారని... వారి ప్రదర్శనపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని ఆశాభావం వ్యక్తం చేశాడు. శనివారం ప్రారంభం కానున్న ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌ నుంచి 501 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. వీరితో పాటు 265 మంది అధికారులు కూడా జపాన్‌కు చేరుకున్నారు. వీరిని షిప్పింగ్‌ కంటైనర్లు, క్రూయిజ్‌ షిప్‌లు, హోటల్స్‌లో వసతి ఏర్పాటు చేశారు. దీనిపై దక్షిణ కొరియాతో పాటు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌లోని పలు సభ్య దేశాలు గతంలో అభ్యంతరాలు వ్యక్తంచేసినట్లు వార్తలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో శరత్‌ కమల్‌ మాట్లాడుతూ... ‘ఇలాంటి వసతి ఏర్పాట్లతో భారత అథ్లెట్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటి పరిస్థితులకు అలవాటు పడేందుకు అథ్లెట్లకు ప్రత్యేక శిక్షణ సైతం అందించాం. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు చెందిన పలు కేంద్రాల్లో కంటైనర్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి అథ్లెట్‌లకు అందులో వసతి ఏర్పాటు చేశాం. దీంతో వారు పరిస్థితులకు త్వరగా అలవాటు పడతారు. జపాన్‌కు వచి్చంది ఏషియన్‌ గేమ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడానికి. అథ్లెట్ల అందరి లక్ష్యం అదే’ అని వివరించాడు. ఐదు ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన శరత్‌ కమల్‌... నాలుగుసార్లు ఆసియా క్రీడల్లో పాల్గొని రెండు పతకాలు గెలిచాడు. 

2018 జకార్తా ఆసియా క్రీడల్లో పురుషుల టీమ్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో కాంస్య పతకాలు నెగ్గాడు. గతేడాది ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన శరత్‌... ప్రస్తుతం క్రీడా పరిపాలన అంశాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నాడు. ‘ఈసారి ఆసియా క్రీడల్లో భారత టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) జట్టు తప్పక పతకాలు గెలుస్తుంది. పురుషుల డబుల్స్‌ జోడీ మానవ్‌ ఠక్కర్‌–మనుశ్‌ షా... మిక్సడ్‌ డబుల్స్‌లో మనుశ్‌ షా–దియా జోడీలపై భారీ అంచనాలు ఉన్నాయి’ అని శరత్‌ వివరించాడు. ఏషియన్‌ గేమ్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భారత్‌ తరఫున ఐదుగురు మహిళా ప్లేయర్లు, ఐదుగురు పురుష ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. ఈ నెల 20 నుంచి 28 వరకు టీటీ పోటీలు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement