ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారులకు ‘సాయ్’ సూచనలు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ఏషియన్ గేమ్స్ జరుగుతుండగా... ఇప్పటికే భారత క్రీడాకారులు క్రీడా వేదికకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జపాన్‌లో వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై ‘సాయ్’ మన అథ్లెట్లకు అవగాహన కల్పించింది.
జపాన్ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడంతో పాటు అక్కడ నడుచుకోవాల్సిన తీరును వీడియో ద్వారా అథ్లెట్లకు వివరించింది. జపాన్ వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు... అపరిచిత వ్యక్తులను ఆలింగనం చేసుకోకూడదు... రహదారులపై బిగ్గరగా మాట్లాడకూడదు... లిఫ్ట్‌లో స్నేహితులతో కలిసి నవ్వకూడదు... ప్రయాణ సమయంలో తోటివారిని ఇబ్బంది పెట్టేవిధంగా సంగీతం వినకూడదని ‘సాయ్’ అథ్లెట్లకు సూచించింది. ‘మీరు కేవలం ఒక అథ్లెట్‌గా జపాన్‌లో పర్యటించడం లేదు. మీరు భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇలాంటి సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలను పాటిస్తూ... స్థానికులను గౌరవిస్తూ ముందుకు సాగండి’ అని ‘సాయ్’ ప్రత్యేక వీడియోలో పేర్కొంది. ఏషియన్ గేమ్స్‌లో భారత బృందానికి డిప్యూటీ చెఫ్ డి మిషన్‌గా వ్యవహరిస్తున్న టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ కూడా... జపాన్‌లో వ్యవహరించాల్సిన తీరుపై అథ్లెట్లకు కొన్ని సూచనలు చేశాడు. ‘జపాన్‌లో క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. శరీరంపై పెద్ద పెద్ద టాటూలు కనిపించకూడదు. వస్త్రాధారణ కూడా హుందాగా ఉండాలి.
రోడ్లపై ఎక్కువ డస్ట్‌బిన్‌లు ఉండవు అయినా... చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. డస్ట్‌బిన్ కనిపించేంత వరకు చెత్తను మీ దగ్గరే పెట్టుకోవాలి. లైంగిక వేధింపుల వంటివైతే ఇక అంతే. అపరిచిత వ్యక్తిని ఏ కారణంతో అయినా తాకకూడదు. ఈ అంశంపై అథ్లెట్లకు తగిన సూచనలు ఇచ్చాం’ అని శరత్ కమల్ వెల్లడించాడు. ఇప్పటికే జపాన్‌లో వ్యవహరించాల్సిన తీరుపై అథ్లెట్లకు ఒక అంచనా ఏర్పడిందని... అయినప్పటికీ క్రీడల ఆరంభానికి ముందే అథ్లెట్లకు మరిన్ని సూచనలు చేస్తామని శరత్ కమల్ తెలిపాడు.
భారత క్రీడాకారులకు మార్గదర్శకాల జాబితా
→ జపాన్ ప్రజల జీవనశైలిని గౌరవిస్తూ నడుచుకోవాలి. రోడ్లపై చెత్త వేయడం పూర్తిగా నిషిద్ధం. డస్ట్‌బిన్ కనిపించేంత వరకు చెత్తను తమ వద్దే ఉంచుకోవాలి. అవసరమైతే దానికి తగ్గ ఏర్పాట్లు ముందే చేసుకోవాలి.
→ బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు శరీరంపై ఉన్న టాటూలు కనిపించకుండా దుస్తులు ధరించాలి. ఏ ప్రదేశంలో అయినా ‘క్యూ’ పద్ధతిని పాటించాలి. ఫోన్ మాట్లాడే సమయంలో స్పీకర్ ఆన్ చేయడం, బిగ్గరగా మాట్లాడటం వంటివి చేయకూడదు.
→ ప్రజా రవాణ వసతులను వినియోగిస్తున్నప్పుడు పెద్ద శబ్దంతో సంగీతం వినకూడదు. ఇయర్‌ఫోన్‌లు తప్పక వాడాలి.
→ రహదారులపై నడుస్తున్నప్పుడు సైతం హుందాగా ప్రవర్తించాలి. అపరిచిత వ్యక్తులను తాకడం, కౌగిలించుకోవడం వంటివి చేయకూడదు.
→ స్థల పరిమితి కారణంగా అథ్లెట్ల కోసం ఓడరేవులోని నౌకలు, ప్రత్యేక కంటైనర్లలో వసతి ఏర్పాటు చేశారు. మన అథ్లెట్లు దీనికి అలవాటు పడేందుకు జపాన్ వెళ్లడానికి ముందే బెంగళూరు, పాటియాలా జాతీయ శిక్షణ శిబిరాల్లో అచ్చం ఇలాంటి పరిస్థితుల్లోనే అథ్లెట్లకు బస కల్పించారు.
→ అన్నీ పోటీలు ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతుండటంతో అథ్లెట్లు వేర్వేరు హోటళ్లలో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు తగ్గట్లే వైద్యులు, ఫిజియోలను బృందాలుగా విభజించారు.
→ మన అథ్లెట్ల సౌకర్యం కోసం శాఖాహార భోజన వసతి సైతం ఏర్పాటు చేయాలని నిర్వాహకులను భారత ఒలింపిక్ కమిటీ కోరింది. అలాగే క్రీడలు జరిగే సమీప ప్రాంతాల్లోని భారతీయ రెస్టారెంట్ల వివరాలను అథ్లెట్లకు అందించారు.


