ఆసియా క్రీడల సన్నద్ధతకు రూ. 702 కోట్లు | Sports Ministry says over Rs 700 crore spent on Indian athletes preparation | Sakshi
Sakshi News home page

ఆసియా క్రీడల సన్నద్ధతకు రూ. 702 కోట్లు

Sep 16 2026 2:57 AM | Updated on Sep 16 2026 2:57 AM

Sports Ministry says over Rs 700 crore spent on Indian athletes preparation

కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడి 

సన్నాహాలు వివరించిన టాప్స్‌ సీఈఓ జోహల్‌

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారుల కోసం రూ. 702 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ నెల 19 నుంచి జపాన్‌ వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. వీటి కోసం అథ్లెట్లకు ప్రత్యేక శిక్షణ, క్రీడాసామాగ్రి కొనుగోలు, కోచ్‌ల నియామకం వంటి అన్నీ వసతులు కల్పించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా... ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొంటున్న భారత బృందంలో 310 మంది కొత్త ఈవెంట్లలో అరంగేట్రం చేయనున్నారు. 

టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌) సీఈఓ ఎన్‌ఎస్‌ జోహల్‌ మాట్లాడుతూ... ‘గత ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు 106 పతకాలు సాధించారు. ఈసారి అంతకుమించి పతకాలు సాధిస్తారనే నమ్మకముంది. మంచి ప్రదర్శన కనబర్చగల సత్తా ఈ బృందంలో ఉంది. ఈ క్రీడల్లో ఎంతో మంది కొత్త అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. యువ అథ్లెట్లు త్వరగా అంతర్జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించండం దేశ క్రీడా భవిష్యత్తుకు మంచి సంకేతం’ అని అన్నారు. 

65 మంది ఖేలో ఇండియా వీరులు... 
భారత క్రికెట్‌ జట్టు ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ, యువ షట్లర్‌ ఆయుష్‌ శెట్టి, స్క్వాష్‌ జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌ అనాహత్‌ సింగ్, జూడో ప్లేయర్‌ అస్మితా డే వంటి పలువురు ప్రతిభవంతమైన క్రీడాకారులు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం పొందకుండా... కేవలం తమ ప్రతిభతోనే ఆసియా క్రీడల బరిలో దిగనున్నారు. ‘ఆసియా క్రీడల సన్నాహాల్లో భాగంగా ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు టార్గెట్‌ ఏషియన్‌ గేమ్స్‌ గ్రూప్‌ తొమ్మిది సమావేశాలు నిర్వహించాం. దేశంలోని వివిధ ఫేడరేషన్లలో పరిపాలన సమస్యలు ఉన్నప్పటికీ... వాటి వల్ల అథ్లెట్లకు ఇబ్బందులు ఎదురుకాకుండా అత్యుత్తమ శిక్షణ అందించాం. ఖేలో ఇండియా ద్వారా వెలుగులోకి వచి్చన 65 మంది క్రీడాకారులు ప్రస్తుతం ఆసియా క్రీడల్లో పాల్గొనే బృందంలో ఉన్నారు’ అని జోహల్‌ వెల్లడించాడు. 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్‌ 28 స్వర్ణాలు, 38 రజతాలు, 40 కాంస్యాలు సాధించింది.  

234 మంది మహిళా అథ్లెట్లు.. 
ఆసియా క్రీడల్లో 36 క్రీడాంశాల్లో భారత్‌ పోటీ పడుతోంది. ఇందులో భారత్‌ తరఫున 501 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఇందులో 234 మంది మహిళలు, 267 మంది పురుషులు ఉన్నారు. తొలుత 503 మందిని ఆసియా క్రీడలకు ఎంపిక చేయగా... డోపింగ్‌ ఉల్లంఘనల కారణంగా ఇద్దరి పేర్లను జాబితా నుంచి తొలగించారు. ‘బరిలోకి దిగి సత్తా చాటాల్సిన బాధ్యత అథ్లెట్లదే. మా వంతు ప్రయత్నం మేం చేశాం. అథ్లెట్లందరికీ అత్యున్నత శిక్షణ అందించేందుకు కృషి చేశాం. ఇప్పుడు ఇక పతకాలు సాధించడమే బాకీ ఉంది. అథ్లెట్లతో పాటు ఫిజియోలు, నిపుణులు, మానసిక ఆరోగ్య నిపుణులు, వైద్యలు కూడా ఈ బృందంలో ఉన్నారు. ప్రతీ జట్టులో మహిళా సహాయక సిబ్బంది ఉంటారు’ అని జోహల్‌ వెల్లడించారు. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బృందంతో పాటు వెళ్తున్న 265 మంది సభ్యుల సహాయ బృందంలో 56 మంది మహిళల ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement