ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. గత వారం మూడో స్థానంలో ఉన్న అతడు.. ఈ వారం పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ను ఓ స్థానం కిందకు తోసి, రెండో స్థానానికి ఎగబాకాడు.
మరో టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్ టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ ఓ స్థానాన్ని కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోగా.. మరో టీమిండియా డాషింగ్ ఓపెనర్ సంజూ శాంసన్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 30వ స్థానానికి ఎగబాకాడు. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరు స్థానాలు కోల్పోయి 29వ స్థానానికి పడిపోయాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ భారత ప్లేయర్లు సత్తా చాటారు. వరుణ్ చక్రవర్తి రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకగా.. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి.. మరో పేసర్ అర్షదీప్ సింగ్ 11 స్థానాలు ఎగబాకి 14వ స్థానానికి చేరుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్-3 ర్యాంక్‌లను కాపాడుకున్నారు.
ఆల్‌రౌండర్ల విభాగానికొస్తే.. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా, పాకిస్తాన్ సైమ్ అయూబ్, నేపాల్ దీపేంద్ర సింగ్ టాప-3లో కొనసాగుతున్నారు. భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 2 స్థానాలు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండు టీ20ల్లో అద్భుత ప్రదర్శనలు చేయడంతో భారత ఆటగాళ్ల ర్యాంకింగ్స్ భారీగా మెరుగుపడ్డాయి.
ఇదీ చదవండి: టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్..!


