source: X
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ మరో అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో నిన్న (సెప్టెంబర్ 15) జరిగిన తొలి టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్ (44 బంతుల్లో 80; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడిన అతడు.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను అధిగమించి రెండో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో పాక్ ప్లేయర్ బాబర్ ఆజం టాప్ ప్లేస్‌లో ఉండగా.. విరాట్ కోహ్లి, పాల్ స్టిర్లింగ్ నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు
బాబర్ ఆజం- 4596
జోస్ బట్లర్- 4292
రోహిత్ శర్మ- 4231
విరాట్ కోహ్లి- 4188
పాల్ స్టిర్లింగ్- 3895
ఈ ఇన్నింగ్స్‌తో బట్లర్ యావత్ టీ20 ఫార్మాట్‌లో తన పరుగుల సంఖ్యను 14970 పరుగులకు పెంచుకొని, అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రపీఠం దిశగా మరో అడుగు ముందుకేశాడు. ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో ఉన్న కీరన్ పోలార్డ్ (14999)కు బట్లర్‌కు ఇక మిగిలింది కేవలం 29 పరుగుల వ్యత్యాసమే.
బట్లర్ మరో 30 పరుగులు చేస్తే, పోలార్డ్ రికార్డును బద్దలు కొట్టి పొట్టి క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరిస్తాడు. ఈ జాబితాలో పోలార్డ్, బట్లర్ తర్వాతి స్థానాల్లో అలెక్స్ హేల్స్ (14581), క్రిస్ గేల్ (14562), డేవిడ్ వార్నర్ (14284) ఉన్నారు.
ఈ ఇన్నింగ్స్‌తో బట్లర్ మరో రికార్డు కూడా సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన వికెట్‌కీపర్ల జాబితాలో పాక్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. వీరిద్దరు తలో 28 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేశారు. ఈ జాబితాలో బట్లర్, రిజ్వాన్ తర్వాతి స్థానంలో క్వింటన్ డికాక్ ఉన్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. బట్లర్‌తో పాటు బ్రూక్ శతక్కొట్టుడుతో శ్రీలంకపై ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేయగా.. శ్రీలంక 19 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. సోనీ బేకర్ (4-1-12-3), లియామ్ డాసన్ (2-23), ఓవర్టన్ (2-20) అద్భుతంగ బౌలింగ్ చేసి లంక పతనాన్ని శాశించారు.
ఇదీ చదవండి: శతకంతో చెలరేగిన బ్రూక్.. లంకపై ఇంగ్లండ్ విజయం


