Photo Credit: Twitter
సౌతాంప్టన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర సెంచరీకి తోడు బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది.
హ్యారీబ్రూక్ (49 బంతుల్లో 114 నాటౌట్, 10 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో చెలరేగగా, ఓపెనర్ జాస్ బట్లర్ (44 బంతుల్లో 80; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకంతో రాణించాడు. లంక బౌలర్లలో చమీరా, దునిత్ వెల్లలగె, ఇషాన్ మలింగ, వనిందు హసరంగ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 19 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది.
దునిత్ వెల్లలగె (33) టాప్ స్కోరర్‌గా నిలవగా, దాసున్ షనక (24) ప్రభావం చూపించలేకపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సొన్ని బేకర్ 3 వికెట్లు తీయగా, లియామ్ డాసన్, జేమీ ఓవర్టన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 42 బంతుల్లో సెంచరీ సాధించిన బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 రేపు మాంచెస్టర్ వేదికగా జరగనుంది.
ఇదీ చదవండి: షేక్ హసీనా సన్నిహితులకు మరణశిక్ష!


