సంజూ శాంసన్ (PC: BCCI X)
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 జట్టు ఓపెనింగ్ విషయంలో మేనేజ్‌మెంట్‌కు స్పష్టత లేదని.. ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని మండిపడ్డాడు. టీమిండియా నాయకత్వ బృందం కేవలం విశ్లేషకులకే కాకుండా.. సగటు అభిమానులకు కూడా చిరాకు తెప్పిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
కాగా జింబాబ్వే పర్యటన తర్వాత భారత టీ20 జట్టు తాజాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో సిరీస్ ఆడుతోంది. ఢిల్లీలో అఫ్గాన్ మూడు టీ20లకు ఆతిథ్యం ఇస్తుండగా.. తొలి మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, అఫ్గాన్‌తో తొలి టీ20లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు.
వైభవ్ బెంచ్‌కే పరిమితం
జింబాబ్వే పర్యటనలో సత్తా చాటి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు పొందినప్పటికీ.. సీనియర్, వరల్డ్‌కప్-2026 వీరుడు సంజూ శాంసన్ రాక వల్ల వైభవ్ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయితే, ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌ను కాదని సంజూతో ఓపెనింగ్ చేయించగా.. అతడు కేవలం పది పరుగులే చేసి పూర్తిగా నిరాశపరిచాడు.
నా భార్య అరిచేసింది..
ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఆదివారం మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడలేదు. దీంతో మేము మ్యాచ్‌ను పక్కనపెట్టేసి మూవీతో టైమ్‌పాస్ చేయాల్సి వచ్చింది. అసలు వైభవ్‌ను ఎందుకు ఆడించడం లేదని నా భార్య అరిచేసింది.
గత సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులు గెలిచిన ప్లేయర్‌ను ఎలా పక్కనపెడతారని ప్రశ్నించింది. నా భార్యకు కూడా ఆట, సెలక్షన్ తీరు గురించి ఇంతలా అర్థమవుతోంది. సగటు అభిమానులకు కూడా మీ వ్యూహాలు మింగుడుపడటం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి.
తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు
సూర్యవంశీ సేవల్ని మీరు సరిగ్గా వాడుకోవడం లేదు. ఇక రెండో టీ20లో అతడికి అవకాశం ఇస్తారేమో. ఒకవేళ అతడు ఆ మ్యాచ్‌లో విఫలమైతే మాత్రం మళ్లీ తుదిజట్టు నుంచి తప్పిస్తారు. ఆటగాళ్లకు మీరు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు.
ప్రదర్శన ఎలా ఉన్నా మరుసటి మ్యాచ్‌లో చోటు దక్కుతుందో లేదోనన్న ఆందోళన పెంచుతున్నారు. వైభవ్ సూర్యవంశీ ఇటీవల దులిప్ ట్రోఫీ టోర్నీలోనూ అదరగొట్టాడు. అంతకుముందు ఐపీఎల్, భారత్-ఎ జట్టు తరఫున.. అదే విధంగా అంతర్జాతీయ టీ20లలో రాణించాడు.
సంజూను చూస్తే జాలేస్తుంది
అయినా సరే అతడి విషయంలో ఇలా ఎందుకు చేస్తున్నారు’’ అని హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీరుపై క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే విధంగా వైభవ్ ఒక్కడి విషయంలోనే కాకుండా.. సంజూ శాంసన్ విషయంలోనూ మేనేజ్‌మెంట్ వైఖరి సరిగ్గా లేదని చిక్కా విమర్శించాడు. సంజూను చూస్తే జాలేస్తుందని.. వైభవ్ రాకతో అతడి స్థానానికి ఎసరు వచ్చిందన్నాడు.
యాజమాన్యానికి నిజంగా సంజూ పట్ల సానుకూల వైఖరి ఉంటే వరుస అవకాశాలు ఇవ్వాలని.. వైభవ్‌తోనే కొనసాగాలని భావిస్తే అతడిని పక్కనపెట్టేయాలని సూచించాడు. అంతేతప్ప దాగుడుమూతలు ఆడటం సరికాదని క్రిష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. కాగా భారత్- అఫ్గాన్ మధ్య మంగళవారం రెండో టీ20 జరుగనుండగా.. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.
చదవండి: మా వాడు వైభవ్ పనిపట్టాడు.. ఇంకేం భయం?: జపాన్ కెప్టెన్


