చరిత్ర సృష్టించిన రొనాల్డో జట్టు.. 87 ఏళ్ల వరల్డ్‌ రికార్డు బద్దలు | Ronaldo Al Nassr Scripts History Breaks 87 Year Old World Record | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన రొనాల్డో జట్టు.. 87 ఏళ్ల వరల్డ్‌ రికార్డు బద్దలు

Sep 15 2026 9:40 AM | Updated on Sep 15 2026 10:21 AM

Ronaldo Al Nassr Scripts History Breaks 87 Year Old World Record

Photo: Al-Nassr Instagram

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సారథిగా ఉన్న ఆల్‌ నసర్‌ క్లబ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా అత్యధిక మ్యాచ్‌లలో గోల్స్‌ కొట్టిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో అర్జెంటీనాకు చెందిన రివర్‌ ప్లేట్‌ క్లబ్‌ పేరిట ఉన్న 87 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.

చారిత్రక గోల్‌ కొట్టింది ఇతడే
సౌదీ ప్రొ లీగ్‌లో భాగంగా అల్‌ నసర్‌ తమ తాజా మ్యాచ్‌లో అల్‌ ఖలీజ్‌ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో అనూహ్య రీతిలో 72వ నిమిషంలో అల్‌ నసర్‌ ఫార్వర్డ్‌ ప్లేయర్‌, 27 ఏళ్ల అబ్దుల్లా అల్‌ హమ్దాన్‌ గోల్‌ కొట్టాడు. దీంతో అల్‌ నసర్‌ ఈ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది.

2023లో మొదలైన ప్రయాణం
ఈ క్రమంలో అబ్దుల్లా గోల్‌ కారణంగా.. సౌదీ ప్రొ లీగ్‌లో అల్‌ నసర్‌ జట్టు వరుసగా 94వ మ్యాచ్‌లో గోల్‌ కొట్టిన జట్టుగా నిలిచింది. కాగా 2023లో అల్‌ హిలాల్‌ జట్టు చేతిలో (3-0) ఓటమితో లీగ్‌ను మొదలుపెట్టిన అల్‌ నసర్‌.. ఆ తర్వాత అల్‌ రియాద్‌పై 4-1తో గెలిచి.. విజయాల ఖాతా తెరిచింది.

అప్పటి నుంచి తాజాగా అల్‌ ఖలీజ్‌తో మ్యాచ్‌ దాకా.. వరుసగా 94 మ్యాచ్‌లలో అల్‌ నసర్‌ కనీసం ఒక్క గోల్‌ అయినా కొట్టింది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత నిలకడగా గోల్స్‌ సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది.

87 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు
కాగా 1936 -1939 మధ్య అర్జెంటీనాకు చెందిన రివర్‌ ప్లేట్‌ క్లబ్‌ వరుసగా 93 మ్యాచ్‌లలో గోల్స్‌ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. తాజాగా ఈ రికార్డును అల్‌ నసర్‌ బద్దలు కొట్టింది. 

ఇదిలా ఉంటే.. 2023లో అల్‌ నసర్‌ క్లబ్‌లో చేరిన రొనాల్డో ఇప్పటి వరకు సౌదీ ప్రొ లీగ్‌లో 113 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని.. 105 గోల్స్‌ కొట్టాడు. ఓవరాల్‌గా అన్ని అధికారిక మ్యాచ్‌లలో కలిపి రొనాల్డో 979 గోల్స్‌ పూర్తి చేసుకున్నాడు. అధికారికంగా వెయ్యి గోల్స్‌ క్లబ్‌లో చేరిన మొదటి ఆటగాడిగా నిలిచేందుకు ఇంకా 21 గోల్స్‌ దూరంలో ఉన్నాడు.  

ఇక సౌదీ ప్రొ లీగ్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. అల్‌ ఖలీజ్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నప్పటికీ అల్‌ నసర్‌ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. అల్‌ హిలాల్‌, అల్‌ ఇతిహాద్‌ టాప్‌-2లో కొనసాగుతున్నాయి.

చదవండి: ట్రిపుల్‌ సెంచరీతో కదం తొక్కిన పాక్‌ టీ20 కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement