Photo Credit: Twitter
క్రీడల్లో విచిత్రాలు అరుదుగా జరుగుతుంటాయి. అయితే ఫుట్‌బాల్ ఆటలో తాజాగా జరిగిన ఒక సంఘటనకు తప్పకుండా ఆ విచిత్రాల్లో చోటు ఇవ్వాల్సిందే. సాధారణంగా ఫుట్‌బాల్‌లో ఆటగాళ్లు గోల్ కొట్టే ప్రయత్నం చేస్తే గోల్‌కీపర్లు వాటిని సమర్థంగా అడ్డుకోవడం చూస్తుంటాం.
బ్రెజిల్ సెకండ్ డివిజన్ ఫుట్‌బాల్ లీగ్‌లో భాగంగా స్పోర్ట్ రెసిఫే, నోవోరిజోంటినో జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నోవోరిజోంటినో జట్టు బంతిని తాకకుండానే ఆట మొదలైన తొలి నిమిషానికే 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడానికి రెసిఫే డిఫెండర్ అలిసన్ కాసియానో, గోల్ కీపర్ కైక్ ఫ్రాంకాకు పాస్ ఇచ్చాడు.
కానీ గోల్ కీపర్ తన పొజిషన్‌లో లేకపోవడంతో బంతి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. దీంతో చేసేదేం లేక నోవోరిజోంటినో జట్టుకు గోల్ ఇవ్వాల్సి వచ్చింది. వాస్తవానికి ఇది పాత మ్యాచ్ అయినప్పటికీ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చినట్లు మార్కా పత్రిక తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను ఒకసారి చూసేయండి.
ఇక అక్టోబర్ 3న భారత్, బ్రెజిల్ మధ్య స్నేహపూర్వక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఐదుసార్లు ఫిఫా చాంపియన్ అయిన బ్రెజిల్‌తో మ్యాచ్ కావడంతో భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఆన్‌లైన్‌లో టికెట్లు పెట్టిన కొద్ది గంటల్లోనే అన్నీ అమ్ముడైపోయాయి.
మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల ధరలు రూ.999 నుంచి రూ 15 వేల వరకు ఉన్నాయి. స్టేడియం సామర్థ్యం 67వేలు కాగా.. అందులో 70 శాతం సీట్లను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. బ్రెజిల్‌తో మ్యాచ్‌కు ముందే భారత్ సెప్టెంబర్ 26న బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పనామాతో మ్యాచ్ ఆడనుంది. బ్రెజిల్‌తో మ్యాచ్ అనంతరం అక్టోబర్ 6న ఇదే కోల్‌కతా వేదికగా ఉరుగ్వేతో తలపడనుంది.
Meanwhile in Brazil a team took the lead without even touching the ball 😂 pic.twitter.com/rJlab2tUY2
— Pulse Sports Nigeria (@PulseSportsNG) September 11, 2026


