PC: BCCI
ఏషియన్ గేమ్స్-2026కు ముందు టీమిండియా మరొక కీలక పోరుకు సిద్దమైంది. శ్రేయస్ అయ్యర్ సారధ్యంలోని భారత జట్టు.. సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి తిరిగి రావడంతో భారత్ ఈసారి పూర్తి స్ధాయి జట్టుతో బరిలోకి దిగుతోంది.
ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 సెప్టెంబర్ 13న ఢిల్లీ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ భారత తుది జట్టు ఎలా ఉండబోతోనేది ఆసక్తిరంగా మారింది. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ జట్టులోకి పునరాగమనం చేయడంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తొలి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ సంజూ తొలి టీ20లో విఫలమైతే సూర్యవంశీని తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకురావాలని హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా యూకే పర్యటనలో శాంసన్ విఫలం కావడంతో వైభవ్‌కు భారత్ తరపున ఓపెనర్‌గా ఆడే అవకాశముంది. అయితే ఇంగ్లండ్ టూర్‌లో మూడు మ్యాచ్‌లు వైభవ్ నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యాడు.
దీంతో ఆ సిరీస్‌లో ఆఖరి టీ20కు అతడిని పక్కన పెట్టి మళ్లీ సంజూకు ఛాన్స్ ఇచ్చారు. ఆ మ్యాచ్‌లో సంజూ తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అనంతరం జింబాబ్వే టూర్‌కు విశ్రాంతి ఇవ్వడంతో సిరీస్ మొత్తం సూర్యవంశీనే భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఇంగ్లండ్ టూర్‌లో విఫలమైన వైభవ్.. జింబాబ్వేపై మాత్రం అదరగొట్టాడు. కానీ ఇప్పుడు వైభవ్ కంటే సీనియర్ అయిన శాంసన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని టీమ్ మేనెజ్‌మెంట్ భావిస్తుందంట.
ఈ క్రమంలో తొలి టీ20లో శాంసన్ ఆడడం దాదాపు ఖాయమైనట్లే. మరోవైపు గాయాల నుంచి కోలుకుని వచ్చిన జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డిలు తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోనున్నారు. అదేవిధంగా జింబాబ్వే టూర్‌కు దూరంగా ఉన్న పేసర్ అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిలు కూడా ఢిల్లీ టీ20లో ఆడనున్నారు.
అఫ్గాన్‌తో తొలి టీ20కు భారత తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్
చదవండి: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్.. ప్రకటన విడుదల


