కెప్టెన్‌గా మహ్మద్‌ సిరాజ్‌.. ప్రకటన విడుదల | Mohammed Siraj Named Hyderabad Ranji Trophy 2026-27 Season Captain, Chamam Milind Appointed Vice-Captain | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌గా మహ్మద్‌ సిరాజ్‌.. ప్రకటన విడుదల

Sep 12 2026 12:24 PM | Updated on Sep 12 2026 12:52 PM

Not Tilak Siraj named Hyderabad captain for Ranji Trophy 2026 27 season

భారత జట్టుతో సిరాజ్‌ (PC: BCCI X)

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో భాగంగా రంజీ ట్రోఫీ 2026-27 ఎడిషన్‌లో సారథిగా జట్టును ముందుకు నడిపించనున్నాడు. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సెలక్షన్‌ కమిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఇక రంజీ జట్టు వైస్‌ కెప్టెన్‌గా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ కుమారుడు, సీనియర్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ చామా మిలింద్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. కాగా గత సీజన్‌లో తిలక్‌ వర్మ హైదరాబాద్‌ జట్టు సారథిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

తిలక్‌ వర్మను కాదని..
తాజాగా దులిప్‌ ట్రోఫీ-2026 టోర్నీలోనూ సౌత్‌ జోన్‌ కెప్టెన్‌గా సేవలు అందించిన తిలక్‌ వర్మ.. జట్టును ఫైనల్‌కు చేర్చాడు. బ్యాటర్‌గా రెడ్‌బాల్‌ క్రికెట్‌లో అదరగొట్టాడు. అయితే, తిలక్‌ టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌తో బిజీ కానున్న నేపథ్యంలో సిరాజ్‌కు తాజా ఎడిషన్‌లో హైదరాబాద్‌ పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సీజన్‌లో భారత మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ హైదరాబాద్‌ జట్టు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. గత రంజీ ఎడిషన్‌లో హైదరాబాద్‌ ఎలైట్‌ గ్రూప్‌-డిలో  భాగంగా ఏడు మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచి.. రెండింట ఓడిపోయి.. నాలుగు డ్రా చేసుకుంది. ఈసారి సిరాజ్‌ నాయకత్వంలో ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాల్సి ఉంది.

లంక పర్యటనలో విఫలం
ఇదిలా ఉంటే.. రంజీ తాజా ఎడిషన్‌లో భాగంగా ఎలైట్‌ గ్రూప్‌-‘బి’లో భాగంగా హైదరాబాద్‌ తమ తొలి మ్యాచ్‌లో (అక్టోబరు 11 నుంచి) త్రిపుర జట్టును ఎదుర్కొంటుంది. కాగా సిరాజ్‌ ఇటీవల శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టుల్లో కలిపి రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.

ఆ తర్వాత దులిప్‌ ట్రోఫీ-2026 ఈస్ట్‌ జోన్‌తో ఫైనల్లో భాగంగా సౌత్‌ జోన్‌ తరఫున బరిలోకి దిగిన సిరాజ్‌ తొలి ఇన్నింగ్స్‌లో పూర్తిగా తేలిపోయాడు. మొత్తంగా 25 ఓవర్లలో ఏకంగా 140 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లలో 47 పరుగులే ఇచ్చి వికెట్‌ పడగొట్టి ఫామ్‌లోకి వచ్చాడు.

టెస్టులపై దృష్టి
ఇక ఇప్పటికే సిరాజ్‌కు పరిమిత ఓవర్ల భారత జట్టులో చోటు కరువైందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెస్టులపై దృష్టి సారించిన ఈ హైదరాబాదీ పేసర్‌.. తదుపరి న్యూజిలాండ్‌ నవంబరులో జరిగే టెస్టు సిరీస్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో హైదరాబాద్‌ రంజీ జట్టు కెప్టెన్‌గా తనకు దక్కిన అవకాశాన్ని సిరాజ్‌ ఏ మేరకు ఉపయోగించుకుంటాడో చూడాలి.

కాగా 2015లో హైదరాబాద్‌ తరఫున అరంగేట్రం చేసిన సిరాజ్‌ ఇప్పటికి 21 రెడ్‌బాల్‌ మ్యాచ్‌లు ఆడి 83 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఫైవ్‌ వికెట్‌ హాల్‌ కూడా ఉంది. అత్యుత్తమ గణాంకాలు 5/52. మరోవైపు.. సీవీ మిలింద్‌ ఇప్పటికి 57 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో కలిపి 140 వికెట్లు కూల్చడంతో పాటు 1445 పరుగులు సాధించాడు. 

చదవండి: ఏడెకరాల భూమి.. ఫామ్‌ హౌజ్‌.. ధర ఎంతో తెలిస్తే షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement