రెండు నెలలు ఆటకు దూరంగా ఎప్పుడూ లేను
భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్
చెన్నై: భారత పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఇటీవల శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. అతని బౌలింగ్ వేగం 125–130 కిలోమీటర్ల మధ్యలోనే ఉండగా... దులీప్ ట్రోఫీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా సిరాజ్ పూర్తిగా విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కొంత మెరుగ్గా 135 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన అతను ఒక వికెట్ మాత్రం పడగొట్టగలిగాడు. తన ఈ ప్రదర్శనకు కారణం బౌలింగ్‌లో లయ కోల్పోవడమేనని సిరాజ్ విశ్లేషించాడు. మ్యాచ్‌ల మధ్య ఎక్కువ విరామం ఉండటంతోనే సమస్య ఎదుర్కొన్నట్లు అతను చెప్పాడు.
తన ఇన్నేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఇంత ఎక్కువ విరామం ఎప్పుడూ రాలేదని సిరాజ్ పేర్కొన్నాడు. అఫ్గానిస్తాన్‌తో టెస్టు ఆడిన సరిగ్గా రెండు నెలల తర్వాత సిరాజ్ శ్రీలంకతో టెస్టులో మళ్లీ బరిలోకి దిగాడు. ‘నా బౌలింగ్ పూర్తిగా లయపై ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి బాగా మొదలైతే అలా సాగిపోతుంది. అలా జరగలేదంటే బౌలింగ్ సమయంలో చాలా ఇబ్బంది పడతా. రనప్‌లో తేడా వస్తుంది. నేను వేసే అంగలు కూడా ఒకే రీతిలో ఉండవు. దాంతో సరైన నియంత్రణ లేక పేస్ తగ్గిపోతుంది. శ్రీలంకలో అదే జరిగింది’ అని సిరాజ్ వెల్లడించాడు.
పాఠం నేర్చుకున్నా...
ప్రతీ బౌలర్ శరీరతత్వం భిన్నంగా ఉంటుందని, కొందరికి విరామం మంచి ఫలితాలు ఇస్తే మరికొందరికి దాని అవసరమే రాదని అతను వివరించాడు. ‘చిన్న చిన్న విరామాలు వస్తే సమస్య లేదు. కానీ నా శరీరతత్వానికి ఎక్కువ విరామం మంచిది కాదు. దాదాపు పదేళ్ల నా కెరీర్‌లో రెండు నెలల విరామం ఎప్పుడూ రాలేదు. ఇలాంటప్పుడు శరీరం అంత చురుగ్గా స్పందించదు. ఈ సమయంలో జిమ్‌లో శ్రమిస్తూ బౌలింగ్ కూడా చేశాను. కానీ మ్యాచ్‌లో ఉండే తీవ్రత సహజంగానే ప్రాక్టీస్‌లో రాదు. ఇది నాకు కొత్త అనుభవం. దీని నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగుతా’ అని ఈ హైదరాబాదీ పేసర్ వ్యాఖ్యానించాడు.
రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా...
దులీప్ ట్రోఫీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఘోరంగా విఫలమయ్యాడు. 25 ఓవర్లలో ఏకంగా ఓవర్‌కు 5.60 పరుగులతో 140 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. శ్రీలంకతో రెండో టెస్టులో బాగా అలసిన తర్వాత తీవ్ర వేడి, ఉక్కపోత ఉన్న చెన్నైలో పరిస్థితికి తనను తాను మార్చుకోలేకపోయానని సిరాజ్ అభిప్రాయ పడ్డాడు. ‘శ్రీలంకతో రెండో టెస్టులో మూడున్నర రోజులు ఫీల్డింగ్ చేసిన తర్వాత నేరుగా చెన్నైకి వచ్చాం. వారం రోజుల్లోపే ఇక్కడి తీవ్ర వేడి వాతావరణంలో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాం. అయితే ఇదంతా నేను ఆటపై ఇష్టంతోనే చేశాను.
దేశం తరఫున ఆడుతున్నప్పుడు సాకులు వెతకవద్దు. అన్ని రకాలుగా మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. ఇక్కడ వికెట్లు తీయలేకపోయినా నా శ్రమకు ఫలితం అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపిస్తుంది’ అని సిరాజ్ తన ఆలోచనను పంచుకున్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లలో 47 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసిన ఈ పేసర్ కొన్ని చక్కటి బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమయ్యాడు. భారత వన్డే, టి20 టీమ్‌లలో రెగ్యులర్‌గా చోటు దక్కించుకోలేక దాదాపుగా టెస్టులకే పరిమితమైన సిరాజ్...న్యూజిలాండ్‌తో నవంబర్‌లో జరిగే టెస్టు సిరీస్‌లోనే మళ్లీ ఆడే అవకాశం ఉంది.


