న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)–టేలర్ టౌన్‌సెండ్ (అమెరికా) జోడీ టైటిల్ గెల్చుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సినియకోవా–టేలర్ టౌన్‌సెండ్ ద్వయం 5–7, 6–0, 6–2తో రోబిన్ మోంట్‌గోమేరీ–యాష్లిన్ క్రుయెజెర్ (అమెరికా) జంటను ఓడించింది. సినియకోవా–టౌన్‌సెండ్ జోడీకి 10 లక్షల డాలర్లు (రూ. 9 కోట్ల 55 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సినియకోవా కెరీర్‌లో ఇది 12వ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌కాగా... టౌన్‌సెండ్ కెరీర్‌లో ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్.
తాజా విజయంతో టౌన్‌సెండ్ మహిళల డబుల్స్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌నూ సాధించి ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను పూర్తి చేసుకుంది. మరోవైపు సినియకోవా డబుల్స్ డబుల్ ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ (ఒక్కో గ్రాండ్‌స్లామ్‌ను రెండుసార్లు చొప్పున సాధించడం) ఘనతను సాధించింది. సినియకోవా భాగ స్వామిగా టౌన్‌సెండ్ 2024లో వింబుల్డన్, 2025లో ఆ్రస్టేలియన్ ఓపెన్, 2026లో ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్స్‌ను సాధించింది.


