న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ బృందంలో కీలక మార్పు చోటు చేసుకుంది. గురువారం ముగిసిన ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్‌లో ప్రదర్శనను బట్టి ముగ్గురు ఆటగాళ్లపై భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) వేటు వేసింది. గతంలో ప్రకటించిన 77 మంది బృందంలో ముగ్గురిని తప్పించి 74 మందిని మాత్రమే ఆసియా క్రీడలకు పంపనున్నారు.
తెలంగాణకు చెందిన స్ప్రింటర్ నిత్య గంధె, లాంగ్‌జంపర్ షానవాజ్ ఖాన్‌తో పాటు గత ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన జావెలిన్ త్రోయర్ అన్నూరాణిని కూడా తప్పించడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారమే దీనిపై నిర్ణయం తీసుకున్న ఏఎఫ్‌ఐ కారణం వెల్లడిస్తూ వివరణ ఇచ్చింది. ‘ఫైనల్ ట్రయల్స్‌లో ఏఎఫ్‌ఐ నిర్దేశించిన అర్హతా ప్రమాణాన్ని అన్ను అందుకోలేకపోయింది. పేలవ ప్రదర్శనతో పాటు వైద్యపరమైన కారణాలతో నిత్య, షానవాజ్‌లను కూడా ఆసియా క్రీడలకు పంపించడం లేదు’ అని ఏఎఫ్‌ఐ అధ్యక్షుడు, సెలక్షన్ కమిటీ చైర్మన్ ఆదిల్ సుమరివాలా వెల్లడించారు.


