breaking news
AFI
-
జూలై 5న నీరజ్ చోప్రా ‘క్లాసిక్’ ఈవెంట్
బెంగళూరు: భారత ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా ఈ ఏడాది నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్‌కు కొత్త షెడ్యూల్ ఖరారైంది. వచ్చేనెల 5న బెంగళూరులో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ), జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ల ఉమ్మడి భాగస్వామ్యంతో చోప్రా గత నెలలోనే ఈ అంతర్జాతీయ ఈవెంట్ నిర్వహించాలనుకున్నాడు. కానీ పహల్గాంలో ఉగ్రదాడి దరిమిలా ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్, పాక్‌ల మధ్య డ్రోన్ దాడులతో యుద్ధవాతావరణం నెలకొంది. దీంతో భారత్‌లోని కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేయడం తదితర ప్రతికూల పరిస్థితులతో మే 24న క్రీడాఈవెంట్ను నిర్వహించే వాతావరణం లేకపోయింది. ఈ జావెలిన్ త్రో టోర్నీయే కాదు... ప్రముఖ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ ఐపీఎల్ కూడా వాయిదా పడింది! ఇప్పుడు ఉద్రిక్తతలు సద్దుమణగడంతో నీరజ్ చోప్రా, జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ వాయిదా పడిన ఈవెంట్ నిర్వహణకు తుదికసరత్తు పూర్తి చేసి జూలై 5 నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 12 మంది స్టార్ అంతర్జాతీయ జావెలిన్ త్రోయర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఇందులో చోప్రా సహా ఐదుగురు భారత అథ్లెట్లు కాగా... ఏడుగురు విదేశీ అథ్లెట్లు ఉన్నారు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. భారత్ నుంచి నీరజ్‌తో పాటు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన సచిన్ యాదవ్, కిషోర్ జేనా, రోహిత్ యాదవ్, సాహిల్ పాల్గొంటున్నారు. విదేశీ స్టార్లలో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ థామస్ రోహ్లెర్ (జర్మనీ), 2015 ప్రపంచ చాంపియన్ జూలియస్ యెగో (కెన్యా), కుర్టిస్ థాంప్సన్ (అమెరికా), ఆసియా క్రీడల కాంస్య పతక విజేత గెన్కీ డీన్ (జపాన్), రుమేశ్ పతిరగె (శ్రీలంక), లూయిజ్ మారిసియో (బ్రెజిల్) భారత్‌లో జరిగే ఈవెంట్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు. ఈ పోటీలను ప్రత్యక్షంగా చూసేందుకు రూ. 199 నుంచి రూ. 9999 ధర పలికే టికెట్లను అందుబాటులో ఉంచారు. కార్పొరేట్ బాక్స్ ప్రేక్షకుల కోసం రూ. 44,999 టికెట్లు ఉన్నాయి. -
అథ్లెట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా అంజూ
చండీగఢ్: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నూతన కార్యవర్గం తొలి వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా 9 మంది అథ్లెట్లతో కూడిన ఏఎఫ్ఐ అథ్లెట్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఆరుగురు మహిళా అథ్లెట్లు, ముగ్గురు పురుష అథ్లెట్లకు చోటు దక్కింది. తాజా ఎన్నికల్లో మరోసారి సీనియర్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ‘డబుల్ ఒలింపియన్’ మాజీ లాంగ్‌జంపర్ అంజూ బాబీ జార్జి... ఈ కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరించనుంది. ఈ కమిషన్‌లో అంజూతో పాటు జ్యోతిర్మయి సిక్దర్ (రన్నింగ్), కృష్ణ పూనియా (డిస్కస్ త్రో), ఎండీ వల్సమ్మ (హర్డిల్స్), సుధా సింగ్ (స్టీపుల్‌ఛేజ్), సునీతా రాణి (రన్నింగ్) చోటు దక్కించుకున్నారు. పురుషుల విభాగం నుంచి ఏఎఫ్ఐ అధ్యక్షుడు బహదూర్ సింగ్ సాగూతో పాటు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, అవినాశ్ సాబ్లే (స్టీపుల్ ఛేజ్) ఉన్నారు. గత కమిషన్‌లో నలుగురు మహిళలు ఉండగా... ఇప్పుడు వారి ప్రాతినిధ్యాన్ని పెంచుతూ ఆ సంఖ్యను 6 చేశారు. బహదూర్ సింగ్ గతంలో సుదీర్ఘ కాలం ఈ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. బిజీ షెడ్యూల్ కారణంగా కమిషన్‌కు ఎక్కువ సమయం కేటాయించలేనని చెప్పినప్పటికీ... ఏఎఫ్ఐ ఎక్స్క్యూటివ్ కౌన్సిల్ నీరజ్ చోప్రాతో చర్చించి అతడిని కమిషన్‌లో భాగం చేసింది. 2012 నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఏఎఫ్ఐ అధ్యక్షుడిగా వ్యవహరించిన అదిలె సుమరివాలా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కొనసాగనున్నారు. ప్రస్తుతం ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్న సుమరివాలాకు.. ఏఎఫ్ఐ ఎక్స్క్యూటివ్ కౌన్సిల్ సమావేశాలకు హజరయ్యే అధికారాలు ఉన్నాయి. డోపింగ్ ఉదంతాల వల్ల దేశ అథ్లెటిక్స్ ప్రభ మసకబారకుండా తగిన చర్యలు చేపట్టాలని ఏఎఫ్ఐ నిర్ణయించింది. దీని కోసం అథ్లెట్ల శిక్షణకు సంబంధించిన వివరాలను జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)తో కలిసి పర్యవేక్షించనుంది. -
#GurbachanRandhawa: వయసు భారం.. అందుకే రాజీనామా
న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవికి గుర్బచన్ సింగ్ రణ్‌ధావా రాజీనామా చేశారు. గత 18 ఏళ్లుగా ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వయసు భారం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు 84 ఏళ్ల రణ్‌ధావా వివరించారు. 1962 ఆసియా క్రీడల్లో డెకాథ్లాన్‌లో స్వర్ణ పతకం నెగ్గిన రణ్‌ధావా, 1964 టోక్యో ఒలింపిక్స్‌లో 110 మీటర్ల హర్డిల్స్‌లో ఐదో స్థానంలో నిలిచారు. ‘వయసు పైబడటంతో వందశాతం నా బాధ్యతలు నిర్వహించలేకపోతున్నాను. అందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను. భారత అథ్లెటిక్స్‌కు మంచి రోజులు వచ్చాయి. నీరజ్ చోప్రా రూపంలో మనకూ ఒక ఒలింపిక్ చాంపియన్ లభించాడు’ అని రణ్‌ధావా పేర్కొన్నారు. 1964 టోక్యో ఒలింపిక్స్‌లో భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించిన రణ్ధావాకు 1961లో ‘అర్జున అవార్డు’... 2015లో ‘పద్మశ్రీ’ పురస్కారం లభించాయి. -
జైశా ఆరోపణలపై స్పందించిన కేంద్ర మంత్రి
రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్ ఓపీ జైశా తాను ఎదుర్కొన్న పరిస్థితులపై చేసిన ఆరోపణలపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ స్పందించారు. మారథాన్ రన్నర్ ఓపీ జైశా ఆరోపణలపై విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇద్దరు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటుచేశారు. వారం రోజుల్లో విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని విచారణ అధికారులకు గోయల్ సూచించారు. ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చినా అథ్లెట్లు తీసుకోలేదని అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) చేసిన ప్రకటనలో వాస్తవం లేదని మారథాన్ రన్నర్ ఓపీ జైశా పేర్కొంది. రియోలో 42 కిలోమీటర్ల మారథాన్ పోటీలో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన తనకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని జైశా ఆరోపించింది. 'నిజమేంటో ఏఎఫ్ఐ ప్రతినిధులకు తెలుసు. నేను పోటీలో పాల్గొన్న చోట కెమెరాలు ఉన్నాయి. వీడియో ఫుటేజీ పరిశీలిస్తే వాస్తవం వెల్లడవుతుంది. అబద్దాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు' అని జైశా స్పష్టం చేసిన నేపథ్యంలో స్పందించిన కేంద్ర మంత్రి విచారణకు ఆదేశించారు. -
'నిజం నాకు, దేవుడికే తెలుసు'
బెంగళూరు: తాము ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చినా తీసుకోలేదని అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) చేసిన ప్రకటనపై మారథాన్ రన్నర్ ఓపీ జైశా స్పందించింది. ఏఎఫ్ఐ ప్రతినిధులు అసలు తనకు దగ్గరకు రాకుండా ఎనర్జీ డ్రింక్స్ ఎలా ఆఫర్ చేశారని ఆమె ప్రశ్నించింది. రియో ఒలింపిక్స్ లో 42 కిలోమీటర్ల మారథాన్ పోటీలో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన తనకు కనీసం మంచినీళ్లు ఇవ్వలేదని జైశా వాపోయింది. అయితే తాము ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చినా జైశా, ఆమె కోచ్ తీసుకోలేదని ఏఎఫ్ఐ తెలిపింది. దీనిపై జైశా స్పందిస్తూ... 'మాకు పానీయాలు ఇవ్వలేదు. నిజమేంటో ఏఎఫ్ఐ ప్రతినిధులకు తెలుసు. నేను పోటీలో పాల్గొన్న చోట కెమెరాలు ఉన్నాయి. వీడియో ఫుటేజీ పరిశీలిస్తే వాస్తవం వెల్లడవుతుంది. అబద్దాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా క్రీడా జీవితంలో ఇప్పటివరకు ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదు. ప్రభుత్వానికి లేదా ఏఎఫ్‌ఐకు వ్యతిరేకంగా నేను పోరాటం చేయలేను. కానీ నిజమేంటో దేవుడికి, నాకు తెలుసు. రియో ఒలింపిక్స్ లో నా పట్ల దారుణంగా వ్యవహరించారు. అలసట తీర్చుకోవడానికి నేను ఒప్పుకోలేదని ఇప్పటీకి ఏఎఫ్ఐ చెబుతోంద'ని జైశా వాపోయింది.