సబలెంకా జోరు | Aryna Sabalenka advances to US Open quarterfinals | Sakshi
Sakshi News home page

సబలెంకా జోరు

Sep 7 2026 2:12 AM | Updated on Sep 7 2026 2:12 AM

Aryna Sabalenka advances to US Open quarterfinals

క్వార్టర్‌ ఫైనల్లోకి టాప్‌ సీడ్‌

వరుసగా నాలుగో మ్యాచ్‌లో గెలుపు

న్యూయార్క్‌: తనకెంతో కలిసొచ్చిన యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో మహిళల ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా జోరు కొనసాగిస్తోంది. వరుసగా ఆరో ఏడాది ఈ బెలారూస్‌ స్టార్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సబలెంకా 6–3, 6–4తో ప్రపంచ 96వ ర్యాంకర్‌ టేలర్‌ టౌన్‌సెండ్‌ (అమెరికా)ను ఓడించింది. 

75 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేసింది. 2021, 2022లలో సెమీఫైనల్‌ చేరిన సబలెంకా 2023లో రన్నరప్‌గా నిలిచింది. 2024, 2025లలో విజేతగా నిలిచి ఈసారి ‘హ్యాట్రిక్‌’ టైటిల్‌పై గురి పెట్టింది. మరోవైపు రెండో సీడ్‌ రిబాకినా (కజకిస్తాన్‌), నాలుగో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా), ఐదో సీడ్‌ మిరా ఆండ్రీవా (రష్యా) ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నారు.

ఫ్రిట్జ్, కొబోలి అవుట్‌ 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో టాప్‌–10లోని మరో ఇద్దరు సీడెడ్‌ క్రీడాకారులు ఇంటిముఖం పట్టారు. ఐదో సీడ్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌ ఫ్లావియో కొబోలి (ఇటలీ), తొమ్మిదో సీడ్, 2024 రన్నరప్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా) మూడో రౌండ్‌లోనే నిష్క్రమించారు. ఫ్రాన్సిస్కో సెరెన్‌డోలో (అర్జెంటీనా) 3 గంటల 40 నిమిషాల్లో 3–6, 4–6, 6–3, 6–4, 6–4తో టేలర్‌ ఫ్రిట్జ్‌ను... అలెగ్జాండర్‌ బ్లాక్స్‌ (బెల్జియం) 6–7 (4/7), 6–3, 6–0, 6–3తో కొబోలిను ఓడించి తమ కెరీర్‌లో తొలిసారి యూఎస్‌ ఓపెన్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 

17వ సీడ్‌ జాకుబ్‌ మెన్‌సిక్‌ (చెక్‌ రిపబ్లిక్‌) కూడా మూడో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. గత నాలుగేళ్లు యూఎస్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిన 14వ సీడ్‌ లెర్నర్‌ టియెన్‌ (అమెరికా) 3 గంటల 24 నిమిషాల్లో 6–3, 1–6, 6–7 (2/7), 6–3, 6–4తో మెన్‌సిక్‌పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. 

జ్వెరెవ్‌ మూడు సెట్‌లలోనే... 
తొలి రెండు రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఐదు సెట్‌లలో గట్టెక్కిన టాప్‌ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) మూడో రౌండ్‌లో మాత్రం వరుస సెట్‌లలో గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. జ్వెరెవ్‌ 6–2, 7–6 (7/2), 6–2తో టబిలో (చిలీ)పై నెగ్గాడు. మరోవైపు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఫ్రాన్స్‌ ప్లేయర్, ప్రపంచ 87వ ర్యాంకర్‌ ఆర్థర్‌ గియా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 

‘లక్కీ లూజర్‌’ హోదాలో తొలిసారి యూఎస్‌ ఓపెన్‌లో ఆడుతున్న 21 ఏళ్ల గియా మూడో రౌండ్‌లో 3 గంటల 55 నిమిషాల్లో 7–6 (9/7), 3–6, 4–6, 6–3, 6–2తో మైకేల్‌ జెంగ్‌ (అమెరికా)పై గెలిచాడు. వాస్తవానికి గియా క్వాలిఫయింగ్‌ చివరి రౌండ్‌ మ్యాచ్‌లో తెలుగు సంతతికి చెందిన అమెరికా ప్లేయర్‌ నిశేష్‌ బసవారెడ్డి చేతిలో ఓడిపోయి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించలేకపోయాడు. 

అయితే మెయిన్‌ ‘డ్రా’లోని 19వ సీడ్, 2022 రన్నరప్‌ కాస్పర్‌ రూడ్‌ గాయంతో చివరి నిమిషంలో టోర్నీ నుంచి వైదొలిగాడు. దాంతో క్వాలిఫయింగ్‌ చివరి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఓడిన ఉత్తమ ర్యాంక్‌ ప్లేయర్‌గా గియాకు ‘లక్కీ లూజర్‌’గా మెయిన్‌ ‘డ్రా’లో అవకాశం కల్పించారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో అనిరుధ్‌ చంద్రశేఖర్‌ (భారత్‌)–ఇవాన్‌ లియుటారెవిచ్‌ (బెలారూస్‌) ద్వయం 4–6, 7–5, 4–6తో ఆర్థర్‌ ఫెరీ–జోషువా పారిస్‌ (బ్రిటన్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement