ప్రిక్వార్టర్స్‌లో అల్‌కరాజ్‌ | Carlos Alcaraz advanced to the pre quarterfinals | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో అల్‌కరాజ్‌

Sep 6 2026 3:19 AM | Updated on Sep 6 2026 3:19 AM

Carlos Alcaraz advanced to the pre quarterfinals

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

న్యూయార్క్‌: సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ దూసుకుపోతున్నాడు. మూడో రౌండ్‌లో అలవోక విజయంతో అతను ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఈ పోరులో అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) 6–3, 6–4, 6–1తో వు యిబింగ్‌ (చైనా)పై ఘన విజయం సాధించాడు. 2 గంటల 20 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో అల్‌కరాజ్‌ 6 ఏస్‌లు, 21 విన్నర్‌లు కొట్టాడు. 2021 చాంపియన్, ఏడో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా) కూడా ముందంజ వేశాడు. మూడో రౌండ్‌లో అతను 6–4, 6–4, 6–4తో ఆర్థర్‌ రిండర్‌నెక్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించాడు. 

పురుషుల విభాగంలో 8వ సీడ్‌ బెన్‌ షెల్టన్‌ (అమెరికా), 11వ సీడ్‌ ఫ్రాన్సిస్‌ టియాఫో (అమెరికా), సిట్సిపాస్‌ (గ్రీస్‌) కూడా ప్రిక్వార్టర్స్‌కు చేరగా... 15వ సీడ్‌ అలెగ్జాండర్‌ బబ్లిక్‌ (కజకిస్తాన్‌) మూడో రౌండ్‌లో ఓడి నిష్క్రమించాడు. షెల్టన్‌ 7–6 (7/3), 6–7 (5/7), 6–3, 6–4 స్కోరుతో డెనిస్‌ షపలోవ్‌ (కెనడా)పై, టియాఫో 6–4, 6–2, 6–4తో వలెంటైన్‌ వాకెరట్‌ (మొనాకో)పై, సిట్సిపాస్‌ 2–6, 6–1, 7–6 (7/3), 6–1తో జిరి లెహెకా (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలుపొందారు. బబ్లిక్‌ను 6–4, 3–6, 6–7 (4/7), 6–1, 6–3తో టామీ పాల్‌ (అమెరికా) ఓడించాడు. 

సెరెనా–వీనస్‌ జోడి ఓటమి 
మహిళల సింగిల్స్‌లో వింబుల్డన్‌ చాంపియన్, 6వ సీడ్‌ లిండా నొస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) మూడో రౌండ్‌లో గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరగా,  9వ సీడ్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌) మూడో రౌండ్‌లో ఓడి వెనుదిరిగింది. నొస్కోవా 6–2, 6–7 (6/8), 6–2తో యాన్‌ లీ (అమెరికా)ను, స్వితోలినా (ఉక్రెయిన్‌) 3–6, 6–2, 3–6తో అనా కలినస్కియా (రష్యా) చేతిలో ఓటమిపాలైంది. మహిళల డబుల్స్‌ అమెరికా స్టార్‌ సిస్టర్స్‌ వీనస్‌ విలియమ్స్‌–సెరెనా విలియమ్స్‌ తొలి రౌండ్‌లోనే ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఓడి వెనుదిరిగారు. మాయా జాయింట్‌ (ఆ్రస్టేలియా)–హావో చింగ్‌ చాన్‌ (చైనీస్‌ తైపీ) జోడి 6–3, 6–7 (6/8), 7–6 (10/7)తో వీనస్‌–సెరెనాపై విజయం సాధించారు.  

బాంబ్రీ, నికీ జోడీల నిష్క్రమణ... 
పురుషుల డబుల్స్‌లో భారత ప్లేయర్‌ నికీ పునాచా –గొంజాలో ఎస్కోబార్‌ (ఈక్వెడార్‌) ద్వయం మొదటి రౌండ్‌లోనే ఓడింది. నికీ–ఎస్కోబర్‌ 6–7 (3/7), 7–6 (7/4), 2–6 స్కోరుతో నీల్‌ ఒబర్‌లీట్‌నర్‌ (ఆస్ట్రియా)–పెట్ర్‌ నౌజా (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో పరాజయంపాలైంది. మరో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ కూడా తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. బాంబ్రీ–మైకేల్‌ వీనస్‌ (అమెరికా) ద్వయం 6–7 (4/7), 6–7 (3/7)తో ర్యాన్‌ సెగెర్‌మన్‌–పాట్రిక్‌ ట్రాక్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement