క్రికెటర్లను ప్రశ్నించిన పాక్ సైబర్ క్రైమ్ ఏజెన్సీ
లాహోర్: పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్లు మొహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్‌లపై ఇటీవల వచ్చిన పలు ఆరోపణలకు సంబంధించి అక్కడి ప్రభుత్వం విచారణ మొదలు పెట్టింది. పాక్‌కు చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌సీసీఐఏ) గురువారం ఈ ఇద్దరు క్రికెటర్లను పలు అంశాలపై ప్రశ్నించింది. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుల్లో పేలవ ప్రదర్శన తర్వాత వీరిని జట్టు నుంచి తొలగించిన పాక్ బోర్డు (పీసీబీ) స్వదేశానికి పంపించింది. పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి కీలక సమాచారాన్ని బయటి వ్యక్తులకు చేరవేశారంటూ రిజ్వాన్, ఇమామ్‌లపై ఆరోపణలు వచ్చాయి. దాంతో వీరిద్దరి మొబైల్ ఫోన్లను జప్తు చేసి అధికారులకు అందజేశారు.
ఇటీవలి కాలంలో వీరి ఆర్థిక లావాదేవీలు, అకౌంట్ల వివరాలన్నింటిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. విచారణ అనంతరం తమ వాదనలు వినిపించేందుకు, రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేందుకు రిజ్వాన్, ఇమామ్ కొంత సమయం కోరినట్లు సమాచారం. పీసీబీ చైర్మన్ అయిన మొహసిన్ నఖ్వీ ఆ దేశ అంతర్గత భద్రతా మంత్రి కూడా. నఖ్వీ ఆధ్వర్యంలోనే ఎన్‌సీసీఐఏ పని చేస్తుంది. దాంతో ఆటగాళ్లను విచారించాలని ఆయన నేరుగా ఆదేశించినట్లు సమాచారం.


