ఇస్లామాబాద్: పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి బయిటపెట్టింది. భారత్‌లోని సిక్కు పుణ్యక్షేత్రమైన శ్రీహేమ్‌కుండ్ సాహిబ్‌ను దర్శించుకునేందుకు వస్తున్న యాత్రికులను ఎన్‌వోసీ 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' పేరుతో అడ్డుకుంది. దీంతో యాత్రికులు నిరాశ చెందాల్సి వచ్చింది. అయితే, తమ ప్రయాణానికి NOC అవసరమని అధికారులు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని దీంతో తమ విమానాన్ని కోల్పోయి విమానాశ్రయంలోనే చిక్కుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
యాత్రికుల వివరాల ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.10 గంటలకు ఫైసలాబాద్ నుంచి షార్జాకు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. అయితే విమానాశ్రయంలో NOC కోసం అధికారులు పట్టుబట్టడంతో వారు ప్రయాణం చేయలేకపోయారు. అంతకుముందు నంకానా సాహిబ్‌లో పాకిస్థాన్ పంజాబ్ సిక్కు మైనారిటీ మంత్రి, పాకిస్థాన్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ (PSGPC) అధ్యక్షుడు రమేశ్ అరోరా, ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు డిప్యూటీ సెక్రటరీ నాసిర్ ముష్తాక్ యాత్రికులను కలిశారు.
విమాన మార్గంలో భారత్‌కు వెళ్లకుండా అట్టారి–వాఘా భూసరిహద్దు ద్వారా రోడ్డు మార్గంలో పంపిస్తామని వారు హామీ ఇచ్చినట్లు సింగ్ తెలిపారు. అయితే NOC విషయాన్ని ముందుగా తమకు ఎవరూ చెప్పలేదని, విమానాశ్రయంలో అధికారులు NOC అడిగినప్పుడు దాన్ని సమకూర్చాలని రమేశ్ అరోరాను కోరినా ఆయన తమకు సహాయం చేయలేకపోయారని సింగ్ పేర్కొన్నారు. యాత్రికులకు ఢిల్లీ, అమృత్‌సర్, శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్, శ్రీ హేమ్‌కుండ్ సాహిబ్‌లను సందర్శించేందుకు భారత వీసాలు ఇప్పటికే మంజూరయ్యాయి.
అట్టారి–వాఘా భూసరిహద్దు మూసివేయడంతో తమకు విమాన మార్గం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని యాత్రికులు తెలిపారు. శ్రీ హేమ్‌కుండ్ సాహిబ్ యాత్ర కోసం భారత్ 92 మంది సిక్కు భక్తులకు వీసాలు జారీ చేసిందని పపిందర్ సింగ్ చెప్పారు. ప్రయాణం, వసతి, ఇతర ఏర్పాట్ల కోసం వారు దాదాపు 2 కోట్ల పాకిస్థాన్ రూపాయలు ఖర్చు చేశారని, ఇప్పుడు ప్రయాణానికి అనుమతి లభించక తీవ్ర నిరాశకు గురయ్యారని తెలిపారు. ఫైసలాబాద్–షార్జా విమానం ఇప్పటికే మిస్ కావడంతో, షార్జా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన తదుపరి విమానం సైతం మిస్ అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రస్తుతం యాత్రికులు విమానాశ్రయంలోనే ఉండి, పాకిస్థాన్ ప్రభుత్వం సమస్యను పరిష్కరించి అట్టారి–వాఘా భూసరిహద్దు ద్వారా భారత్‌కు వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. హేమ్‌కుండ్ సాహిబ్ యాత్రను సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలని వారు పాకిస్థాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


