యూపీ రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌.. మాయావతి మేనల్లుడిపై వేటు! | Mayawati Expels Nephew Akash Anand After He Fails to Repost Her Post | Sakshi
Sakshi News home page

యూపీ రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌.. మాయావతి మేనల్లుడిపై వేటు!

Sep 11 2026 8:37 AM | Updated on Sep 11 2026 9:17 AM

Mayawati Expels Nephew Akash Anand After He Fails to Repost Her Post

ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌పై మరోసారి వేటు వేశారు. ఈసారి ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచే తొలగించారు. పార్టీ కంటే కుటుంబానికే ఆకాశ్‌ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని.. పైగా తాను చేసిన ‍ట్వీట్‌ను అతను రీ-ట్వీట్‌ చేయలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారామె.

బీఎస్పీ మాజీ రాజ్యసభ సభ్యుడు అశోక్‌ సిద్ధార్థ్‌ను మాయావతి ఆగస్టులో పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకోవడం, పార్టీ నాయకత్వ నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరించడం వంటి కారణాలతో ఆయనపై మాయావతి చర్యలు తీసుకున్నట్లు అప్పట్లో పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 9న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

అశోక్‌ సిద్ధార్థ్ గనుక‌ రాజకీయాల నుంచి తప్పుకుంటే.. ఆకాశ్‌ ఆనంద్‌ పార్టీ కోసం స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి వస్తుందని సూచించారు. ఆ వ్యాఖ్యల మరుసటి రోజే.. తన అల్లుడి రాజకీయ భవిష్యత్తు కోసం అశోక్‌ సిద్ధార్థ్‌ రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఇక ఆకాశ్‌కు మళ్లీ పార్టీలో కీలక బాధ్యతలు దక్కుతాయని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా మాయావతి అతడినే పార్టీ నుంచి పూర్తిగా తొలగించారు.

ఆ ఒక్క రీపోస్ట్‌ చేయలేదని..
ఆకాశ్‌పై చర్యకు కారణాన్ని మాయావతి స్వయంగా వెల్లడించారు. తాను ఎక్స్‌లో పెట్టే పోస్టులను ఆకాశ్‌ గతంలో తరచూ రీపోస్ట్‌ చేసేవాడని చెప్పారు. కానీ అశోక్‌ సిద్ధార్థ్‌ రాజకీయాల నుంచి తప్పుకోవాలని తాను చేసిన సూచనను మాత్రం ఆకాశ్‌ రీపోస్ట్‌ చేయలేదని పేర్కొన్నారు. అతని రాజకీయ భవిష్యత్తు కోసమే తాను ఆ పోస్టు పెట్టినా.. ఆకాశ్‌ దానిని పట్టించుకోకపోవడం తనకు ఆగ్రహం తెప్పించినట్లు మాయావతి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. 

పార్టీ ప్రయోజనాల కంటే కుటుంబ బంధానికే ప్రాధాన్యం ఇస్తున్నాడనే సంకేతంగా ఆమె దీనిని పరిగణించారు. ఇలా రెండు వైపులా ఆలోచించే వ్యక్తి బీఎస్పీ ప్రయోజనాల కోసం ఎలా పనిచేయగలడని మాయావతి ప్రశ్నించారు. పార్టీ, బహుజన ఉద్యమం కంటే కుటుంబ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చేవారితో ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.

ఆకాశ్‌ ఆనంద్‌కు రాజకీయంగా ఇబ్బందులు రావడానికి అతనికి పిల్లనిచ్చిన అశోక్‌ సిద్ధార్థ్‌ ప్రధాన కారణంగా మాయావతి భావిస్తూ వచ్చారు. సెప్టెంబర్‌ 9న సిద్ధార్థ్‌ రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించిన తర్వాత.. గురువారం ఆయన సన్యాసం ప్రకటించారు. మాయావతిని తన రాజకీయ గురువుగా, అక్కగా పేర్కొన్న సిద్ధార్థ్‌.. ఆమె ఆదేశమే తనకు అన్నింటికంటే ముఖ్యమని చెప్పారు. తన వల్ల ఆకాశ్‌ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతోనే రాజకీయాలకు దూరమవుతున్నట్లు తెలిపారు.

అయితే ఆయన నిర్ణయం మాయావతిని సంతృప్తిపరచలేదు. సిద్ధార్థ్‌ రాజకీయ సన్యాసం తీసుకున్నప్పటికీ అది చాలా ఆలస్యమైన నిర్ణయమని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ముందుగానే రాజకీయాల నుంచి తప్పుకుని ఉంటే బీఎస్పీ, బహుజన ఉద్యమం, ఆకాశ్‌ ఆనంద్‌ ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని అన్నారు. అంతేకాదు.. ఆకాశ్‌ రాజకీయ భవిష్యత్తు గురించి నిజంగా ఆలోచించి ఉంటే సిద్ధార్థ్‌ ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుని ఉండాల్సిందని మాయావతి వ్యాఖ్యానించారు.

రెండేళ్లలో మూడోసారి..
ఆకాశ్‌ ఆనంద్‌పై మాయావతి చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గత రెండేళ్లలో ఆయనపై ఇది మూడో కీలక చర్య. వాస్తవానికి.. 2023 డిసెంబర్‌లో మాయావతి ఆకాశ్‌ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బీఎస్పీ భవిష్యత్‌ నాయకుడిగా ఆయనకు ప్రాధాన్యం పెరిగింది. జాతీయ సమన్వయకర్త బాధ్యతలు కూడా అప్పగించారు.

2024 మేలో ఆకాశ్‌కు అప్పగించిన కీలక పార్టీ బాధ్యతలను మాయావతి తొలగించారు. ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు. 2025 మార్చిలో మరోసారి ఆయనపై చర్య తీసుకుని పార్టీ నుంచి బహిష్కరించారు. అనంతరం ఆకాశ్‌ క్షమాపణ చెప్పడంతో తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. కానీ ఆ తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 3న జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తొలగించారు. సాధారణ కార్యకర్తగా పార్టీలో ఉండేందుకు మాత్రం అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వారం రోజులు కూడా తిరగకముందే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్నే రద్దు చేశారు.

తమ్ముడికి కీలక బాధ్యతలు..
ఆకాశ్‌పై వరుస చర్యలు జరుగుతున్న సమయంలోనే ఆయన తమ్ముడు ఇషాన్‌ ఆనంద్‌ బీఎస్పీలో కీలకంగా ఎదగడం ఆసక్తికరంగా మారింది. ఆకాశ్‌ను జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తొలగించిన కొద్ది రోజులకే 27 ఏళ్ల ఇషాన్‌ ఆనంద్‌కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించారు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ మినహా ఇతర రాష్ట్రాల్లో బీఎస్పీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను ఆయనకు ఇచ్చారు. తన తండ్రి, బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు ఆనంద్‌ కుమార్‌కు ఇషాన్‌ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఆకాశ్‌ నిర్వహించిన బాధ్యతల్లో కొంత భాగం ఇప్పుడు ఇషాన్‌ చేతికి వెళ్లడంతో.. ఆయన మాయావతికి రాజకీయ వారసుడిగా ఎదుగుతారా? అనే చర్చ మొదలైంది.

ఎన్నికల ముందు బీఎస్పీలో కలకలం
ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీఎస్పీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీని బలోపేతం చేసి తిరిగి అధికారంలోకి రావాలని మాయావతి లక్ష్యంగా పెట్టుకున్నారు. 

2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 403 స్థానాల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్నీ గెలవలేకపోయింది. ఓటు శాతం కూడా 9.39 శాతానికి పడిపోయింది. ఇలాంటి సమయంలో పార్టీ భవిష్యత్తుకు కీలకంగా భావించిన ఆకాశ్‌ ఆనంద్‌నే బయటకు పంపడం బీఎస్పీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇషాన్‌ ఆనంద్‌కు కీలక బాధ్యతలు అప్పగించడం మరింత ఆసక్తిని రేపుతోంది.

2027 ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని మాయావతి ఇప్పటికే పిలుపునిచ్చారు. పూర్తి మెజార్టీతో బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టాలని కోరారు.

అశోక్‌ సిద్ధార్థ్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆకాశ్‌ ఆనంద్‌కు మళ్లీ బీఎస్పీలో కీలక స్థానం దక్కుతుందని భావించినా.. సీన్‌ పూర్తిగా మారిపోయింది. మామ రాజకీయ సన్యాసం తీసుకున్నా.. మేనల్లుడికి మాత్రం పార్టీ తలుపులు మూసుకుపోయాయి. అందుకు కుటుంబంపై ఉన్న అనుబంధమే కారణమని మాయావతి భావించడం ఇప్పుడు బీఎస్పీలో హాట్‌టాపిక్‌గా మారింది.

ఇదీ చదవండి: టీవీకేకు తొలి పరీక్ష.. నెగ్గుతారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement