బ్యాంకుల బకాయిల్లో దాదాపు రూ.15 వేల కోట్లు రికవరీ అయ్యాయి.. కాబట్టి తనపై పెండింగ్‌లో ఉన్న కేసులను ముగించాలని ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా వాదిస్తున్నారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వంపైనా, ఇక్కడి దర్యాప్తు వ్యవస్థలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆయన వాదనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి కౌంటర్ ఇచ్చింది. డబ్బు రికవరీ, కేసులనేవి వేర్వేరు అంశాలని చెబుతోంది.
బ్యాంకులు తమ బకాయిలను రికవరీ చేసుకోవడం, మనీలాండరింగ్ కేసులో క్రిమినల్ ప్రాసిక్యూషన్ కొనసాగడం రెండూ వేర్వేరు అంశాలని ఈడీ అంటోంది. బకాయిలు తిరిగి వచ్చాయన్న కారణంతోనే మనీలాండరింగ్ కేసు ముగిసిపోదని తేల్చిచెప్పింది.
విజయ్ మాల్యా 2020లో దాఖలు చేసిన పిటిషన్ బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. తన ఆస్తుల స్వాధీనం, రికవరీ ప్రక్రియను సవాల్ చేస్తూ ఆయన ఈ పిటిషన్ వేశారు. ఇటీవల ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. బ్యాంకులు దాదాపు రూ.15 వేల కోట్లు రికవరీ చేసినందున, ఇక ఈ పిటిషన్ కొనసాగించాల్సిన అవసరం లేదని మాల్యా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఈ అంశంపై ఈడీని కోర్టు వివరణ కోరింది. అయితే, బ్యాంకుల బకాయిలు రికవరీ కావడం వల్ల మనీలాండరింగ్ కేసు మాత్రం ముగియదని ఈడీ తన సమాధానంలో స్పష్టం చేసింది.
బ్యాంకులు రికవరీ చేసిన మొత్తానికి సివిల్ బకాయిల లెక్కల్లో ప్రాధాన్యం ఉండొచ్చని ఈడీ పేర్కొంది. అయితే ఆ మొత్తాన్ని బట్టి మాల్యాపై నమోదైన షెడ్యూల్డ్ నేరాలు లేదంటే మనీలాండరింగ్ ఆరోపణలు రుజువయ్యాయా? లేదా? అన్నది నిర్ణయించలేమని తెలిపింది. బ్యాంకులకు ఎంత డబ్బు తిరిగి వచ్చిందన్నది క్రిమినల్ కేసులో నేరం జరిగిందా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం కాదని స్పష్టం చేసింది.
మాల్యా తరఫు న్యాయవాదులు.. ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం దాదాపు రూ.15,000 కోట్లు రికవరీ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసలు క్లెయిమ్ వడ్డీతో కలిపి సుమారు రూ.6,203 కోట్లు మాత్రమేనని, ఈ నేపథ్యంలో సివిల్ బాధ్యతలు దాదాపు పరిష్కారమయ్యాయని పేర్కొంటూ పెండింగ్ కేసును ముగించాలని కోరారు.
రూ.14,131 కోట్ల ఆస్తుల పునరుద్ధరణ
అయితే ఈ వాదనను ఈడీ తోసిపుచ్చింది. సుమారు రూ.14,131.60 కోట్ల విలువైన ఆస్తులను ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్టియానికి పునరుద్ధరించిన విషయాన్ని ప్రస్తావించింది. పీఎంఎల్‌ఏలోని సెక్షన్ 8(8) కింద ఆస్తుల పునరుద్ధరణ అనేది బాధిత లేదంటే చట్టబద్ధ హక్కు ఉన్న వ్యక్తికి ఆస్తిని తిరిగి అందించే ప్రక్రియ మాత్రమేనని తెలిపింది. ఆస్తులు తిరిగి ఇచ్చినంత మాత్రాన షెడ్యూల్డ్ నేరం/మనీలాండరింగ్ జరిగిందా లేదా అనే అంశం తేలిపోదని పేర్కొంది. అందువల్ల ఆస్తుల రికవరీని చూపించి పెండింగ్‌లో ఉన్న పీఎంఎల్‌ఏ ప్రొసీడింగ్స్‌ను నిరర్థకంగా భావించలేమని స్పష్టం చేసింది.
భారత్‌కు దూరంగా ఉండటంపైనా ప్రస్తావన
మాల్యా భారత్‌కు తిరిగి రాకపోవడం, సంబంధిత క్రిమినల్ కోర్టు పరిధికి తనను తాను అప్పగించకపోవడం కూడా కీలక అంశాలని ఈడీ కోర్టుకు తెలిపింది. కేసులపై ఆయన కోరుతున్న ఉపశమనాన్ని పరిశీలించే సమయంలో ఈ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.
మాల్యా 2016లో భారత్‌ను విడిచి వెళ్లి ప్రస్తుతం యూకేలో ఉన్నారు. 2019లో ఆయనను ఫ్యూజిటివ్ ఎకనామిక్ ఆఫెండర్ (పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు)గా ప్రకటించారు. ఫ్యూజిటివ్ ఎకనామిక్ ఆఫెండర్స్ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేయడంతో పాటు, తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించడంపై కూడా ఆయన న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు.
ఇటీవల బాంబే హైకోర్టు.. భారత్‌కు తిరిగి వచ్చి కోర్టు పరిధికి లోబడే ఉద్దేశం ఉందా? లేదా? అన్నదానిపై మాల్యాకు చివరి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు బ్యాంకుల రికవరీతో కేసులు ముగిసిపోవన్న ఈడీ వాదనపై కూడా కోర్టు తదుపరి విచారణలో పరిశీలన జరపనుంది.
ఇదీ చదవండి: మాల్యా నోట కాక్రోచ్ మాట.. ఎందుకసలు?


