అరంగేట్రంలోనే పాక్ పేసర్‌ చెత్త రికార్డు | Pakistan Pacer Razavulla Creates Unwanted Test Debut Record Despite Four-Wicket Haul, Check More Details Inside | Sakshi
Sakshi News home page

అరంగేట్రంలోనే పాక్ పేసర్‌ చెత్త రికార్డు

Sep 11 2026 4:40 PM | Updated on Sep 11 2026 5:10 PM

Pakistan Razaullah Enters Unwanted Test List On Debut Vs England

source: X

పాకిస్తాన్‌ యువ పేసర్‌ రజావుల్లా టెస్ట్‌ అరంగేట్రంలోనే చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో 4 వికెట్లు తీసి, 6.40 ఎకానమీతో ఏకంగా 148 పరుగులు సమర్పించుకున్నాడు.

తద్వారా పాకిస్తాన్‌ తరఫున టెస్ట్‌ అరంగేట్రంలో అత్యధిక ఎకానమీతో పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో జాహిద్ మహ్మూద్ అగ్రస్థానంలో ఉన్నాడు. జాహిద్‌ 2022లో ఇంగ్లండ్‌పై తన టెస్ట్‌ అరంగేట్రం చేసి, ఆ మ్యాచ్‌లో ఏకంగా 7.3 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. ఓవరాల్‌గా చూసినా టెస్ట్‌ అరంగేట్రంలో ఇదే అత్యంత చెత్త ఎకానమీగా రికార్డుగా ఉంది.

రజావుల్లా పరుగులు ధారాళంగా సమర్పించుకొని, చెత్త రికార్డును మూటగట్టుకున్నా, తన అద్భుతమైన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఎమిలియో గే, జో రూట్‌, జేమీ స్మిత్‌, రాబిన్సన్‌ లాంటి కీలక బ్యాటర్లను ఔట్‌ చేశాడు. 

అలాగే క్రమం తప్పకుండా 145 కిమీకు పైగా వేగంతో బంతులు సంధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు కేవలం 8 టెస్ట్‌లే ఆడినప్పటికీ, అనుభవజ్ఞుడిలా బౌలింగ్‌ చేశాడు. రజావుల్లా వేగం చూసి అభిమానులు పాకిస్తాన్ దిగ్గజం వకార్ యూనిస్‌ను గుర్తు చేసుకున్నారు.

కాగా, రజావుల్లా తొలుత ఇంగ్లండ్‌ సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో లేడు. పాక్‌ మేనేజ్‌మెంట్‌ ఏడుగురు ఆటగాళ్లను స్వదేశానికి పిలిపించుకోగా.. వారికి ప్రత్యామ్నాయంగా ప్రకటించిన ఆటగాళ్లలో అతడు ఉన్నాడు. అప్పటికే తన వేగంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించిన రజావుల్లా, జట్టుకు ఎంపికైన తొలిసారే తుది జట్టులో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే 0-2తో కోల్పోయిన పాక్‌, మరో ఓటమి దిశగా పయనిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 133 పరుగులకే కుప్పకూలగా.. ఇంగ్లండ్‌ 453 పరుగులు స్కోర్‌ చేసి భారీ ఆధిక్యం సాధించింది. 

రెండో ఇన్నింగ్స్‌లో సైతం ఖాతా తెరవకుండానే రెండు  వికెట్లు కోల్పోయిన పాక్‌ జట్టును అజాన్‌ అవైస్‌ (43 నాటౌట్‌), షాన్‌ మసూద్‌ (50 నాటౌట్‌) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్‌ 100-2గా ఉంది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 220 పరుగులు వెనుకపడి ఉంది.

చదవండి: కోహ్లి స్థానంలో బాబర్‌..!


 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement