పదహారేళ్ల వయసులో సకమ్మకు పెళ్లి జరిగింది. పెళ్లయిన కొద్దికాలానికే ఆమె భర్త మరణించారు. ఇల్లు దాటి బయటకు అడుగు పెట్టడానికి మహిళలు సంకోచించే కాలంలో, ఉద్యోగం చేయాలనే ఆలోచన ఊహకు కూడా రాని కాలంలో ఒంటరి ప్రయాణం మొదలు పెట్టారు సకమ్మ. ‘నేను ఒంటరి కాదు. నా వెనక వేలాది సకమ్మలు ఉన్నారు’ అనుకొని వ్యాపార ప్రస్థానం ప్రారంభించారు. కాఫీతోటల యజమానురాలిగా, ప్రసిద్ధ ‘సకమ్మ కాఫీ వర్క్స్’ బ్రాండ్ సృష్టికర్తగా, సామాజిక సేవకురాలిగా చరిత్ర పుటల్లో నిలిచారు..
బెంగళూరు సంస్కృతిలో కాఫీ విడదీయరాని భాగం. బెంగళూరు వాసుల కాఫీ ప్రేమకు పునాది వేసిన వారిలో ఒకరు... దొడ్డమనే సకమ్మ. ఆ పేరు చెబితే ఆమె ఎవరికీ తెలియదు కానీ ‘కాఫీ పొడి సకమ్మ’ అంటే వెంటనే గుర్తుపడతారు. సకమ్మ కాఫీతోటల యజమానురాలు మాత్రమే కాదు పరోపకారి కూడా. వ్యాపరరంగంలో మహిళలకు అవకాశాలు పరిమితంగా ఉన్న కాలంలో విజయవంతమైన కాఫీ సామ్రాజ్యాన్ని నిర్మించారు.
వెనకడుగు వేయకుండా! కర్నాటక తుమకూరు జిల్లాలోని బిదరే గ్రామంలో 1880లో జన్మించారు సకమ్మ. చిన్న వయసులోనే చదువు ప్రాముఖ్యతను గుర్తించారు. మైసూరు సంస్థానంలో విద్యావంతులైన కొద్దిమంది యువతులలో ఆమె ఒకరు. పదహారేళ్ల వయసులో కూర్గు ప్రాంతానికి చెందిన కాఫీ తోటల యజమాని చిక్కబసప్ప శెట్టితో సకమ్మ వివాహం జరిగింది. అయితే, వివాహమైన కొద్దికాలానికే భర్త మరణించడంతో కుటుంబానికి చెందిన కాఫీ తోటలను నిర్వహించే భారీ బాధ్యత సకమ్మపై పడింది. ఆ కాలంలో మహిళలపై సామాజిక ఆంక్షలు ఉన్నప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదు. తన ఊరు నుంచి బెంగళూరు వెళ్లారు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా తొలి అడుగులు వేశారు.
సకమ్మ కాఫీ వర్క్స్... సూపర్ హిట్!
బసవగుడిలోని బుల్‌టెంపుల్ సమీపంలో ‘కాఫీ క్యూరింగ్ అండ్ పౌడరింగ్ యూనిట్’ను స్థాపించారు సకమ్మ. ఆ సమయంలో కాఫీ ప్రాసెసింగ్‌కు అవసరమైన ఎన్నో యంత్రాలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. కాఫీ గింజలను వేయించడానికి, పౌడర్ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి ఆనాటి ఆధునికత సాంకేతికత పరికరాలపై ఆధారపడ్డారు.
కాఫీ ప్రాసెసింగ్‌ను వినియోగదారులకు మరింత చేరువ చేయాలనే సకమ్మ లక్ష్యం ఆమె వ్యాపార ప్రస్థానంలో మైలురాయిగా మారింది. సకమ్మ కాఫీ పొడి ‘సకమ్మ కాఫీ వర్క్స్ బ్రాండ్’తో మార్కెట్‌లోకి వచ్చింది. రుచి, నాణ్యత కారణంగా ‘సకమ్మ కాఫీ వర్క్స్’ ఇంటింటా సుపరిచితమైంది. నగరంలోని వివిధ ప్రాంతాలలో అమ్మకపు కేంద్రాలను ప్రారంభించి, కాఫీ పొడిని వినియోగదారులకు మరింత అందుబాటులోకి తెచ్చారు. మాస్తి వెంకటేశ అయ్యంగార్, డి.వి.గుండప్పలాంటి ప్రఖ్యాత కన్నడ సాహితివేత్తల రచనలో సకమ్మ బ్రాండ్ కనిపించేది.
లోకసేవ పరాయణే... ఆమె సాధించిన విజయాలు కాఫీ వ్యారానికే పరిమితం కాలేదు. సామాజిక సేవా రంగంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. మహిళా సంక్షేమం, విద్య, సామాజిక అభివృద్ధికి కృషి చేశారు. బసవగుడిలో ఒక వసతిగృహాన్ని, ప్రయాణికుల కోసం విశ్రాంతి గృహాన్ని నిర్మించారు. సకమ్మ సాధించిన వ్యాపార విజయాలు, సామాజిక సేవకు గుర్తింపుగా మైసూర్ దర్బార్ ఆమెకు ‘లోకసేవ పరయణే’ అనే బిరుదును ప్రదానం చేసింది. మైసూర్ ప్రతినిధి సభలో సభ్యురాలిగా కూడా సకమ్మ పనిచేశారు. కూర్గ్‌లోని సోమవార్‌పేటలో ఉన్న సకమ్మ బంగ్లా, బెంగళూరులోని సకమ్మ గార్డెన్ ఆమె విజయగాథను మౌనంగా చెబుతుంటాయి. ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తుంటాయి.
(చదవండి: క్యాట్‌లో మంచి స్కోర్ చేసినా..సైన్యంలోకి! కానీ చివరికి..)


