హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ వ్యాఖ్య
అఫ్గాన్‌తో సిరీస్‌కు సిద్ధమన్న హైదరాబాదీ
చెన్నై: దులీప్ ట్రోఫీలో సౌత్‌జోన్ కెప్టెన్‌గా రెండు మ్యాచ్‌లు ఆడిన ఠాకూర్ తిలక్ వర్మ మూడు ఇన్నింగ్స్‌లలో వరుసగా 116 నాటౌట్, 51 నాటౌట్, 99 పరుగులు (మొత్తం 266) చేశాడు. టి20 స్పెషలిస్ట్‌గానే ప్రస్తుతం భారత జట్టులో ఉన్న తిలక్... ఫస్ట్ క్లాస్ ఆట శైలికి తగినట్లుగా తన బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. దులీప్ ట్రోఫీ సెమీస్, ఫైనల్ మ్యాచ్ కలిపి 461 బంతులు ఎదుర్కొన్న అతను... ఫైనల్ మ్యాచ్‌లో పరిస్థితికి అనుగుణంగా ఆడుతూ ఒకదశలో వరుసగా 63 బంతులపాటు బౌండరీ కొట్టకుండా నియంత్రణ కూడా ప్రదర్శించాడు. దీనికి ముందు భారత ‘ఎ’ జట్టుకు కూడా తిలక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
‘నా వ్యక్తిగత ఫామ్ చాలా బాగుంది. ఈ ప్రదర్శనతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ నా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చానని భావిస్తున్నా. ఈ మ్యాచ్‌లో కాస్త ముందుగానే దూకుడు ప్రదర్శించగలిగేవాడిని. కానీ పరిస్థితులకు, జట్టు అవసరాలకు తగినట్లు ఆడటమే ముఖ్యం. నాతో పాటు అవతలి ఎండ్‌లో మరో బ్యాటర్ నిలిస్తే సెషన్లవారీగా ఆడుతూ డ్రా కోసం ప్రయత్నించేవాడిని. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడం ఈస్ట్‌కు మేలు చేసుంది. భారత ‘ఎ’ జట్టుకు, ఇప్పుడు సౌత్‌జోన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం వల్ల ఇతర యువ ఆటగాళ్ల నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం లభించింది.
సారథిగా నేను ఎదుగుతున్నాననే భావన కలిగింది. కొన్ని సార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడే కెప్టెన్‌గా నా బాధ్యత మరింత పెరుగుతుంది’ అని తిలక్ అభిప్రాయపడ్డాడు. ఈ నెల 13 నుంచి అఫ్గానిస్తాన్‌తో జరిగే టి20 సిరీస్‌లో భారత జట్టును గెలిపించడంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టినట్లు తిలక్ వెల్లడించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి ఒక్కసారిగా టి20లకు మారడం తనకు కష్టమేమీ కాదని, సిరీస్‌కు సిద్ధంగా ఉన్నానని అతను చెప్పాడు.
‘ఇప్పుడు నా బ్యాటింగ్ గేర్లు మార్చి దూకుడు ప్రదర్శిస్తా. నా ఆటపై నాకు చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు అఫ్గానిస్తాన్‌తో సిరీస్ గెలవడమే లక్ష్యం. ఎరుపు రంగు బంతి మ్యాచ్ నుంచి టి20లకు మారడం అంత సులువు కాదు. అయితే సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ కోసం నాకు రెండు రోజుల సమయం లభిస్తోంది. నా ఆట శైలిని మార్చుకునేందుకు ఇది సరిపోతుంది’ అని తిలక్ వ్యాఖ్యానించాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు 64 టి20 మ్యాచ్‌లు ఆడిన తిలక్ 145.18 స్ట్రయిక్‌రేట్‌తో 1645 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతను మరో 5 వన్డేల్లో కూడా బరిలోకి దిగాడు.


