హాట్‌ కేకుల్లా... | Over 50000 Team India match tickets sold in 2 days | Sakshi
Sakshi News home page

హాట్‌ కేకుల్లా...

Sep 10 2026 1:36 AM | Updated on Sep 10 2026 1:36 AM

Over 50000 Team India match tickets sold in 2 days

2 రోజుల్లో 50 వేలకు పైగా అమ్ముడుపోయిన టీమిండియా మ్యాచ్‌ టికెట్లు

అక్టోబర్‌ 22 నుంచి న్యూజిలాండ్‌లో భారత జట్టు పర్యటన

ఆక్లాండ్‌: టీమిండియాతో వచ్చే నెలలో జరుగనున్న సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు టికెట్ల అమ్మకం ప్రారంభించింది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు ఐదు టి20లు, ఐదు వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. న్యూజిలాండ్‌తో భారత్‌ పూర్తి స్థాయి సిరీస్‌లు ఆడనుండటం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్‌లు వీక్షించేందుకు అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. టికెట్ల విక్రయం ప్రారంభించిన రెండు రోజుల్లోనే 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. 

భారత్, న్యూజిలాండ్‌ మధ్య అక్టోబర్‌ 22న క్రైస్ట్‌చర్చ్‌లో తొలి టి20 జరగనుంది. ఆ తర్వాత 24న అక్కడే రెండో మ్యాచ్‌... 27న వెల్లింగ్టన్‌లో మూడో మ్యాచ్‌... 30న ఆక్లాండ్‌లో నాలుగో మ్యాచ్‌ జరుగుతాయి. నవంబర్‌ 1న హామిల్టన్‌ వేదికగా జరగనున్న చివరి మ్యచ్‌తో పొట్టి సిరీస్‌ ముగియనుంది. ‘క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగే రెండో టి20 మ్యాచ్‌ టికెట్లు దాదాపు అయిపోయాయి. మిగిలిన మ్యాచ్‌ల టికెట్లు కూడా వేగంగా అమ్ముడవుతున్నాయి. ఈడెన్‌ పార్క్‌లో అధిక డిమాండ్‌ ఉంది. 

2019లో టీమిండియా న్యూజిలాండ్‌లో పర్యటించిన అనంతరం ఇంత పెద్ద మొత్తంలో టికెట్ల కోసం పోటీ కనిపించలేదు. దీంతో మైదానంలోని పై అంతస్తును కూడా అభిమానుల కోసం అందుబాటులోకి తేనున్నాం’ అని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. టి20 సిరీస్‌ అనంతరం నవంబర్‌ 4న ఆక్లాండ్‌లో తొలి వన్డే... 7న వెల్లింగ్టన్‌లో రెండో వన్డే... 10న హామిల్టన్‌లో మూడో వన్డే నిర్వహించనున్నారు. నవంబర్‌ 13, 15న జరగనున్న చివరి రెండు వన్డే మ్యాచ్‌లు మౌంట్‌ మాంగనీలో జరుగుతాయి. అనంతరం నవంబర్‌ 19 నుంచి వెల్లింగ్టన్‌లో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. క్రైస్ట్‌చర్చ్‌లో నవంబర్‌ 27 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుతో ఈ పర్యటన ముగియనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement