భారత ‘ఎ’ జట్టులో షేక్‌ రషీద్‌ | Andhra player Sheikh Rashid gets a place in the India A team | Sakshi
Sakshi News home page

భారత ‘ఎ’ జట్టులో షేక్‌ రషీద్‌

Sep 10 2026 1:28 AM | Updated on Sep 10 2026 1:30 AM

Andhra player Sheikh Rashid gets a place in the India A team

ఆస్ట్రేలియా ‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్‌కు ఎంపిక

కెప్టెన్‌గా దేవదత్‌ పడిక్కల్‌ 

పునరాగమనం చేయనున్న హార్దిక్‌ పాండ్యా  

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో ఆ్రస్టేలియా జట్టు... భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో... త్వరలో ఇరు దేశాల ‘ఎ’ జట్ల మధ్య అనధికారిక టెస్టు, వన్డే సిరీస్‌లు జరగనున్నాయి. వీటి కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం వేర్వేరుగా జట్లను ప్రకటించింది. సుదీర్ఘ ఫార్మాట్‌ కోసం ప్రకటించిన భారత ‘ఎ’ జట్టులో ఆంధ్ర ఆటగాడు షేక్‌ రషీద్‌కు చోటు దక్కింది. ప్రస్తుతం చెన్నై వేదికగా జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో రషీద్‌ సౌత్‌ జోన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 

ఇక గాయం కారణంగా చాన్నాళ్లుగా మైదానానికి దూరంగా ఉన్న సీనియర్‌ పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను ఆస్ట్రేలియా ‘ఎ’తో అనధికారిక వన్డేలకు ఎంపిక చేశారు. 32 ఏళ్ల పాండ్యా ఐపీఎల్‌ అనంతరం గ్రౌండ్‌లో అడుగు పెట్టలేదు. ఇటీవలే ఫిట్‌నెస్‌ సాధించిన పాండ్యా... ఈ సిరీస్‌ ద్వారా తిరిగి పోటీ క్రికెట్‌ ప్రారంభించనున్నాడు. భారత్‌ ‘ఎ’, ఆ్రస్టేలియా ‘ఎ’ జట్ల మధ్య ఈ నెల 22 నుంచి పాండిచ్చేరి వేదికగా తొలి అనధికారిక టెస్టు జరగనుంది. అనంతరం సెప్టెంబర్‌ 29 నుంచి అక్కడే రెండో మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. 

సుదీర్ఘ ఫార్మాట్‌ మ్యాచ్‌లు ముగిసిన అనంతరం పాండిచ్చేరిలోనే అక్టోబర్‌ 6, 9, 11న వరుసగా మూడు అనధికారిక వన్డేలు నిర్వహించానున్నారు. దాదాపు అదే సమయంలో భారత సీనియర్‌ జట్టు వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడుతుంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత ‘ఎ’ జట్టుకు దేవదత్‌ పడిక్కల్‌ సారథ్యం వహించనున్నాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న పడిక్కల్‌ నిలకడైన ప్రదర్శనతో మూడో స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. 

గాయం కారణంగా లంక పర్యటనకు దూరమైన సాయి సుదర్శన్‌... ఈ సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. లంక సిరీస్‌లో అద్వితీయ ప్రదర్శనతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచిన పడిక్కల్‌... ఆస్ట్రేలియా ‘ఎ’పై ఎలా ఆడతాడనేది కీలకం. ఇక వన్డే ఫార్మాట్‌లో భారత ‘ఎ’ జట్టుకు రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా... పడిక్కల్‌ అతడి డిప్యూటీగా ఎంపికయ్యాడు.

సుదీర్ఘ ఫార్మాట్‌కు భారత ‘ఎ’ జట్టు: దేవదత్‌ పడిక్కల్‌ (కెప్టెన్‌), సాయి సుదర్శన్‌ (వైస్‌ కెప్టెన్‌), అమన్‌ మోఖడే, ఆయుశ్‌ పాండే, యశ్‌ రాథోడ్, షేక్‌ రషీద్, కుమార్‌ కుషాగ్ర, షమ్స్‌ ములానీ, తనుశ్‌ కొటియాన్, తుశార్‌ దేశ్‌పాండే, అన్షుల్‌ కంబోజ్, ప్రఫుల్‌ హింగే, ఎన్‌ జగదీశన్, నచికేత్‌ భుటే, వైశాక్‌.  

వన్డే ఫార్మాట్‌కు భారత ‘ఎ’ జట్టు: రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌), దేవదత్‌ పడిక్కల్‌ (వైస్‌ కెప్టెన్‌), ప్రియాన్ష్ ఆర్య, సాయి సుదర్శన్, రజత్‌ పాటీదార్, కుమార్‌ కుషాగ్ర, నిశాంత్‌ సింధు, విప్రాజ్‌ నిగమ్, అర్షిన్‌ కులకర్ణి, అర్షద్‌ ఖాన్, నమన్‌ ధీర్, హార్దిక్‌ పాండ్యా, ప్రభ్‌సిమ్రన్‌సింగ్, గుర్‌జపనీత్‌ సింగ్, యశ్‌ ఠాకూర్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement