పాక్‌ సెలక్టర్‌ పదవికి రాజీనామా.. టీమిండియాపై ప్రశంసలు! | Misbah-ul-Haq praises Team India after quitting as Pakistan Selector | Sakshi
Sakshi News home page

పాక్‌ సెలక్టర్‌ పదవికి రాజీనామా.. టీమిండియాపై ప్రశంసలు!

Sep 7 2026 2:21 PM | Updated on Sep 7 2026 2:28 PM

Misbah-ul-Haq praises Team India after quitting as Pakistan Selector

PC: PCB/X

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తీరుపై మాజీ కెప్టెన్‌ మిస్బా ఉల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పీసీబీ పెద్దలు విదేశీ కోచ్‌ల విషయంలో ఒకలా.. దేశీ కోచ్‌ల విషయంలో మరోలా వ్యవహరిస్తారని ఆరోపించాడు. ఆటగాళ్లు, కోచ్‌లు మార్పు విషయంలో పీసీబీ తొందరపాటు చర్యలు తీసుకుంటోందని మండిపడ్డాడు.

పాకిస్తాన్‌ క్రికెట్‌లో మరోసారి సంక్షోభం
అదే సమయంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం క్రమపద్ధతిలో ముందుకు వెళ్తూ రోజురోజుకీ తమ జట్టును మరింతగా అభివృద్ధి చేసుకుంటోందని మిస్బా ప్రశంసించాడు. కాగా పాకిస్తాన్‌ క్రికెట్‌లో మరోసారి సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడిపోగానే.. ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసింది యాజమాన్యం.

అంతేకాదు.. టెస్టు జట్టు హెడ్‌కోచ్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, బౌలింగ్‌ కోచ్‌ ఉమర్‌ గుల్‌లను పదవుల నుంచి తప్పించింది. ఆ బాధ్యతలను వైట్‌బాల్‌ కోచ్‌ మైక్‌ హసన్‌ చేపట్టాడు. ఈ పరిణామాల నేపథ్యంలో మనస్తాపం చెందిన మిస్బా ఉల్‌ హక్‌ పాక్‌ సెలక్షన్‌ కమిటీ నుంచి తప్పుకొన్నాడు.

వారి విషయంలో మాత్రం ఉదారంగా ఉంటారు
ఈ క్రమంలో స్థానిక టెలివిజన్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌ క్రికెట్‌లో విదేశీ కోచ్‌లు, దేశీ కోచ్‌లను వేర్వేరుగా చూస్తారు. విదేశీ కోచ్‌ల పట్ల యాజమాన్యం ఎంతో ఉదారంగా వ్యవహరిస్తుంది. అదే దేశీ కోచ్‌ల విషయంలో మాత్రం ప్రతీ దానికి విమర్శలు వస్తాయి.

విదేశీ కోచ్‌లకు అధికారాలు ఎక్కువే ఇస్తారు. కానీ జవాబుదారీతనంలో మాత్రం వారు వెనుకే ఉంటారు. అదే స్థానిక కోచ్‌లు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ ప్రతికూల ఫలితాలు వస్తే ఇక తిట్ల వర్షమే. నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తారు కూడా!

ఇక ఒకటీ రెండు మ్యాచ్‌ల తర్వాత ఆటగాళ్లను తొలగించడం ఈ మధ్య ఎక్కువగా జరుగుతోంది. దీని వల్ల ఆటగాళ్లు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఒత్తిడిలోనూ రాణించేలా వారికి ఊతం ఇవ్వాలి. కానీ దురదృష్టవశాత్తూ మనవాళ్లకు తొందర, హడావుడి ఎక్కువ.

టీమిండియాపై ప్రశంసలు
నిజానికి పాక్‌ యువ క్రికెటర్లు చాలా మంది ఎక్కువగా వైట్‌బాల్‌ క్రికెట్‌ మాత్రమే ఆడుతున్నారు. రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడేలా వారిని ప్రోత్సహించాలి. ఫోర్‌-డే మ్యాచ్‌లు మాత్రమే ఉంటే సరిపోదు. దేశీ క్రికెట్‌లో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలి.

90వ దశకం తర్వాత బీసీసీఐ క్రమక్రమంగా జట్టులో మార్పులు చేస్తూ వస్తోంది. లోపాలు సరిచేసుకుంటూ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటోంది. అంతేతప్ప తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవడం లేదు’’ అని మిస్బా ఉల్‌ హక్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: శుబ్‌మన్‌ గిల్‌ మెరుపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement