జపాన్‌లో జరగనున్న ఏషియన్ గేమ్స్-2026కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 19 నుంచి ఈ ప్రతిష్టాత్మక క్రీడలు ప్రారంభం కానుండగా.. మెన్స్ క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 24 నుంచి షెడ్యూల్ అయ్యాయి. అయితే మ్యాచ్‌లు జరగనున్న ఐచి-నగోయాలోని వసతులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధానంగా క్రికెట్ జట్లకు సరైన 5-స్టార్ హోటల్ వసతి లేకపోవడం, తాత్కాలిక టెంట్లను డ్రెస్సింగ్ రూమ్‌లుగా కేటాయించడంపై వివాదం రేగింది. ఇటీవల జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ మీటింగ్‌లోనూ ఈ ఏర్పాట్లపై బీసీసీఐతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు కూడా తమ నిరసనను వ్యక్తం చేశాయి.
క్రికెటర్లకు ప్రత్యేక ప్రత్యేక వసతి కల్పించాలని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాను డిమాండ్ చేశాయి. కానీ ఓసీఎ మాత్రం క్రికెటర్లకు ప్రత్యేక వసతి కల్పించబడదని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోయేషిన్ కూడా (ఐఓఏ) ధ్రువీకరించింది.
ఈ క్రమంలో భారత క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ తమ పురుష, మహిళల జట్ల వసతి, ఫుడ్, రవాణా ఏర్పాట్లను స్వయంగా చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా ఏషియన్ గేమ్స్ నిర్వాహకులు భారత పురుషుల క్రికెట్ జట్టుకు త్రీ-స్టార్ హోటల్, ఉమెన్స్ టీమ్‌కు ఫోర్-స్టార్ హోటల్‌ను కేటాయించారు.
అయితే ఒకే గదిని ఇద్దరు ప్లేయర్ షేర్ చేసుకోవాల్సి ఉండడతో బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే సాధారణంగా భారత క్రికెటర్లకు అంతర్జాతీయ టోర్నీల్లో విడిగా సింగిల్-ఆక్యుపెన్సీ 5-స్టార్ రూమ్‌లు ఇస్తుంటారు.
అదేవిధంగా ఆటగాళ్ల భారీ కిట్‌బ్యాగ్‌లు, ఇతర క్రీడా పరికరాలు ఉంచుకోవడానికి ఈ చిన్న గదులు సరిపోవని బీసీసీఐ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే సౌకర్యాలను పరిశీలించడానికి జపాన్‌కు ఓ బృందాన్ని బీసీసీఐ పంపనుంది. వారి రిపోర్ట్ మేరకు తమ ఆటగాళ్ల వసతుల విషయంలో బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.
చదవండి: సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్!


